logo

లేటరైట్‌ క్వారీపై అధికారుల దృష్టి

నాతవరం మండలం సుందరకోట గ్రామంలోని ముల్లుకొండపై లేటరైట్‌ క్వారీని ఆయా శాఖల అధికారులు పరిశీలించారు. లీజు కాలపరిమితి ఉన్నప్పటికీ కొన్నేళ్లుగా ఇక్కడ తవ్వకాలను ఆపేశారు.

Published : 03 Feb 2023 04:23 IST

సుందరకోట గ్రామంలోని ముల్లుకొండ

నర్సీపట్నం గ్రామీణం, నాతవరం, న్యూస్‌టుడే: నాతవరం మండలం సుందరకోట గ్రామంలోని ముల్లుకొండపై లేటరైట్‌ క్వారీని ఆయా శాఖల అధికారులు పరిశీలించారు. లీజు కాలపరిమితి ఉన్నప్పటికీ కొన్నేళ్లుగా ఇక్కడ తవ్వకాలను ఆపేశారు. క్వారీ ప్రతినిధులు కొద్దిరోజులుగా పొక్లెయిన్‌తో క్వారీకి వెళ్లే రహదారి పునరుద్ధరణ పనులు చేపట్టడం తెలిసిందే. ఈ క్వారీలో మైనింగ్‌ జరుగుతోందని, దీన్ని గ్రామస్థులు అడ్డుకున్నారని మాజీమంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు రెవెన్యూ, అటవీ, మైనింగ్‌, పోలీసు అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. ఖనిజం దోపిడి జరగకుండా చూడాలని కోరారు. ఈ నేపథ్యంలో మూడు రోజుల కిందట నర్సీపట్నం ఆర్డీఓ జయరామ్‌ క్వారీని పరిశీలించి వచ్చారు. తాజాగా అనకాపల్లి గనులు, భూగర్భ శాఖ అధికారులు సిబ్బందితో బుధవారం మధ్యాహ్నం క్వారీ పరిశీలనకు వెళ్లారు. లీజు కాలపరిమితి ఉన్నప్పటికీ ఖనిజం రవాణాకు సంబంధించి పర్మిట్లు ఏవీ ఇంకా ఇవ్వలేదని మైనింగ్‌ అధికారి ఒకరు ‘న్యూస్‌టుడే’తో పేర్కొన్నారు. అక్రమంగా తవ్వకాలు ఏవైనా జరుగుతున్నాయా అన్న కోణంలో పరిశీలించినట్లు చెప్పారు. రోడ్డు పనులు జరుగుతున్నట్లు గుర్తించామని, అన్ని అనుమతులు తీసుకోవాలని చెప్పి వచ్చినట్లు వెల్లడించారు. నర్సీపట్నం గ్రామీణ సీఐ రమణయ్య, నాతవరం ఎస్సై లక్ష్మీనారాయణ తదితరులు అధికారుల వెంట ఉన్నారు. నిఘా వర్గాల సిబ్బంది క్వారీ పరిశీలనకు వెళ్లినప్పుడు అక్కడ భూమిపూజ జరిగిన ఆనవాళ్లను గుర్తించినట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని