logo

ముఖ ఆధారిత హాజరుతో సత్ఫలితాలు

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన ముఖ ఆధారిత హాజరు ప్రక్రియ మంచి ఫలితాలు ఇస్తోందని జిల్లా విద్యాశాఖాధికారి రమేష్‌ పేర్కొన్నారు. గురువారం ఆయన ‘న్యూస్‌టుడే’తో మాట్లాడారు.

Published : 03 Feb 2023 04:23 IST

డీఈవో రమేష్‌

పాడేరు, న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన ముఖ ఆధారిత హాజరు ప్రక్రియ మంచి ఫలితాలు ఇస్తోందని జిల్లా విద్యాశాఖాధికారి రమేష్‌ పేర్కొన్నారు. గురువారం ఆయన ‘న్యూస్‌టుడే’తో మాట్లాడారు. విద్యా బోధన సక్రమంగా, సజావుగా సాగేందుకు అవసరమైన అన్ని సర్దుబాటు ప్రక్రియలు పూర్తి చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం బోధన క్రమపద్ధతిలో జరగడంపై దృష్టి పెట్టామని చెప్పారు. సబ్జెక్టు టీచర్లు కొరత ఉన్న చోట ఇప్పటికే సర్దుబాటు చేసినట్లు తెలిపారు. పదో తరగతి విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా సబ్జెక్టు టీచర్లను సర్దుబాటు చేశామన్నారు. గతంలో ఉపాధ్యాయులు సమయపాలన పాటించడం లేదని, విధులకు గైర్హాజరవుతున్నట్లు స్థానిక ప్రజాప్రతినిధులు, ఇతరుల నుంచి ఎక్కువ ఫిర్యాదులు అందేవన్నారు. ముఖ ఆధారిత హాజరు ప్రక్రియతో ఇవి తగ్గాయని తెలిపారు. జిల్లావ్యాప్తంగా మూడు వేల వరకు వివిధ యాజమాన్యాల బడులుంటే 90 శాతం ఉపాధ్యాయులు సకాలంలో వెళ్తున్నారని నివేదికల ద్వారా తెలుస్తోందన్నారు. భవిష్యత్తులో ముఖ ఆధారిత హాజరు ఆధారంగానే ఉపాధ్యాయులకు జీతాలు చెల్లించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. కొందరు మొక్కుబడిగా టీచింగ్‌ నోట్స్‌ తయారు చేస్తున్నారన్నారు. ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేస్తున్న నోట్‌ బుక్స్‌ను కొంత మంది ఉపాధ్యాయులు తమ సొంత అవసరాలకు వాడుకోవడం సమంజసం కాదన్నారు. ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న ప్రతి నోట్‌ బుక్‌ విద్యార్థికి చేరాలని స్పష్టంచేశారు. టీచింగ్‌ నోట్స్‌ రాయడంతోపాటు విద్యార్థుల వర్కు బుక్స్‌ పరిశీలన వంటి పనులు ఉపాధ్యాయుల ప్రాథమిక విధిగా భావించాలన్నారు. ఉపాధ్యాయుల బోధనలో ఎటువంటి లోపాలున్నా చర్యలు తప్పవని హెచ్చరించారు.  

పెదబయలు మండలకేంద్రంలోని సీతగుంట మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలని తనిఖీ చేయగా అక్కడ ఒకటి, రెండు తరగతుల విద్యార్థులు పదాలు, లెక్కలు చక్కలు చెప్పారని డీఈవో తెలిపారు. ఉపాధ్యాయుడు గండేరు మాధవరావుకు ప్రశంసాపత్రాన్ని అందిస్తామని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని