logo

ఏడుకొండల నుంచి పల్లెవాడలకు..

ఓ చిన్న కుటుంబం తిరుపతి వెళ్లి ఏడుకొండల వాడిని దర్శించుకుని తిరిగి రావాలంటే  రూ. 6 వేల నుంచి రూ. 10 వేల వరకు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి.

Published : 03 Feb 2023 04:34 IST

న్యూస్‌టుడే, వరరామచంద్రాపురం

తిరుపతిలో భక్తుల భజనలు

చిన్న కుటుంబం తిరుపతి వెళ్లి ఏడుకొండల వాడిని దర్శించుకుని తిరిగి రావాలంటే  రూ. 6 వేల నుంచి రూ. 10 వేల వరకు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. తితిదే, సమరసత సేవా ఫౌండేషన్‌ సంయుక్తంగా పల్లెవాసులకు రవాణా సౌకర్యంతోపాటు వసతులు, దైవ  దర్శనం అన్నీ ఉచితంగా కల్పిస్తున్నాయి. పేద, మధ్య తరగతి, ఎస్సీ, ఎస్టీ, మత్సకార్మిక కుటుంబాలకు ఆర్థిక భారం లేకుండా భక్తులను తిరుపతి తీసుకెళ్లి, వారికి అక్కడ అన్ని  వసతులు ఉచితంగా ఏర్పాటు చేసి, వీఐపీ బ్రేక్‌ దర్శన సదుపాయం కల్పిస్తున్నారు.

రంపచోడవరం, చింతూరు డివిజన్లలోని 11 మండలాల్లో ఇప్పటివరకు దాదాపుగా 5 వేల మంది భక్తులను తిరుమల తీసుకువెళ్లారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో 23 ఆలయాల నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు. వీటిలో 16 పూర్తిచేసి శాస్త్రోక్తంగా విగ్రహ ప్రతిష్ఠలు జరిపారు. మిగిలినవి నిర్మాణ దశలో ఉన్నాయి. 500 భజన బృందాలకు తిరుపతిలో, స్థానిక యువకులకు అర్చకత్వంపై శిక్షణ ఇచ్చారు. ఎటపాక మండలంలోని లక్ష్మీపురంలో అభయాంజనేయస్వామి ఆలయం నిర్మించి, అక్కడ ఎస్సీ వర్గానికి చెందిన జక్కుల శంకర్‌ను పూజారిగా నియమించారు. మరికొన్ని ఆలయాలకు విగ్రహాలను అందించారు. అన్ని మండలాల్లోని గ్రామాలను తిరుమల ప్రచారం రథం సందర్శించింది. మండల కేంద్రాల్లో తిరుపతి ఆలయ అర్చక బృందంతో, అక్కడి ఉత్సవ విగ్రహాలతో అంగరంగ వైభవంగా శ్రీనివాస కల్యాణం తంతును నిర్వహించారు. కరోనా సమయంలో, వరదల తరువాత బాధితులకు నిత్యావసరాలు, దుస్తులు, మందులు పంపిణీ చేశారు.

నందిగామలో విగ్రహ ప్రతిష్ఠ హోమం


అద్భుత అవకాశం
- కారం సంకురమ్మ

ప్రకృతి, వన దేవతలతో సరిపెట్టుకునే మాకు తితిదే అద్భుత అవకాశం కల్పించింది. కలియుగ దైవం వెంకన్న దర్శనం చేసుకునే భాగ్యం మాకు దక్కింది. అప్పటినుంచి తిరుమల వేంకటేశ్వరస్వామిని ఆరాధ్య దైవంగా పూజిస్తున్నాం. అన్ని వసతులు వారే ఏర్పాటుచేసి నాకు, మా బంధువులకు దైవ దర్శనం చేయించారు.


పూర్వజన్మ సుకృతం
- జక్కుల శంకర్‌, లక్ష్మీపురం, ఎటపాక మండలం

మామూలువారికి గర్భగుడి ప్రవేశమే ఉండదు. అలాంటి నాకు తితిదే శిక్షణ ఇచ్చి, స్వామి కైంకర్యం చేసుకునే భాగ్యం కల్పించింది. ఆలయాల్లో దైవారాధనలతోపాటు, వ్రతాలు, అభిషేకాలు శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నాను. ఇదినా పూర్వజన్మ సుకృతం.


ప్రతి నెలా పౌర్ణమి హారతి
- సవలం పద్మావతి, డివిజన్‌ మహిళా కన్వీనర్‌

తితిదే ఆధ్వర్యంలో భక్తులు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పేద ఆదివాసీ బిడ్డలను తిరుపతి యాత్రకు తీసుకెళ్తున్నాం. మహిళలు భజనల్లో ముందుండాలని వారిని ప్రోత్సహిస్తున్నాం. వారందరితో ప్రతి పౌర్ణమికి ప్రత్యేక హారతి కార్యక్రమం చేపడుతున్నాం.


ఆధ్యాత్మికత వైపు నడిచేలా..
- కర్రి శ్రీనివాసరావు, చింతూరు డివిజన్‌ ప్రచారక్‌

ప్రజలంతా ధర్మం, ఆధ్యాత్మికత వైపు నడిచేలా కృషి చేస్తున్నాం. మన్యంలో పేదవర్గాల ప్రజల్లో చైతన్యం పెంచుతున్నాం. వారికి ఉచితంగా తిరుపతి దైర్శనంతోపాటు, సామాజిక బాధ్యతలపై అవగాహన కల్పిస్తున్నాం. కష్టంలో ఉన్నవారిని ఆదుకోవడం, ధర్మాన్ని పరిరక్షించడం వంటివి వివరిస్తున్నాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని