logo

ఆదివాసీలకు ఆశాదీపం

కొండల్లో.. కోనల్లో ఓ స్థిరమైన జీవనం లేక.. సంచార జాతులుగా సాగుతున్న ఆదిమజాతి గిరిజనుల (పీవీటీజీ- పర్టిక్యులర్లీ వల్నరబుల్‌ ట్రైబల్‌ గ్రూప్స్‌) జీవనంలో స్థితిగతుల్లో సమూల మార్పులు తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

Published : 04 Feb 2023 02:46 IST

పీవీటీజీల అభ్యున్నతికి కొత్తగా ‘పీఎం-పీవీటీజీ’
పాడేరు, రంపచోడవరం, న్యూస్‌టుడే

పీవీటీజీ గ్రామంలో తాగునీటికి ఇక్కట్లు (దాచిన చిత్రం)

కొండల్లో.. కోనల్లో ఓ స్థిరమైన జీవనం లేక.. సంచార జాతులుగా సాగుతున్న ఆదిమజాతి గిరిజనుల (పీవీటీజీ- పర్టిక్యులర్లీ వల్నరబుల్‌ ట్రైబల్‌ గ్రూప్స్‌) జీవనంలో స్థితిగతుల్లో సమూల మార్పులు తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. తాజా కేంద్ర బడ్జెట్‌లో పీవీటీజీల అభ్యున్నతికి పీఎం-పీవీటీజీ పేరుతో డెవలప్‌మెంట్‌ మిషన్‌ పథకాన్ని ప్రకటించారు. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా పీవీటీజీల అభివృద్ధికి రూ. 15 వేల కోట్లను కేటాయించారు. ఈ నిధులతో వీరు జీవించే ప్రాంతాల్లో రానున్న మూడేళ్లలో రోడ్డు, రవాణాతోపాటు వారి సర్వతోముఖాభివృద్ధికి ఖర్చు చేయనున్నారు.

మన రాష్ట్రంలో పాడేరు ఐటీడీఏ పరిధిలోని పదకొండు మండలాల్లోనే పీవీటీజీల సంఖ్య అధికం. ఈ 11 మండలాల్లో మొత్తం 6.65 లక్షల వరకు జనాభా ఉంటే, ఇందులో 28 శాతం వరకు ఆదివాసీలు ఉంటారు. 3,803 గ్రామాల్లో 960 వరకు గ్రామాల్లో పూర్తిస్థాయిలో వారే జీవనం సాగిస్తుండగా, మరో 700 గ్రామాల్లో కొన్ని కుటుంబాలు నివాసముంటున్నాయి. మొత్తంగా 1600 గ్రామాల్లో వారి ప్రభావముంది. పాడేరు ఏజెన్సీ పరిధిలో ప్రధానంగా పోర్జ, గదబ, కొందు ఉప కులాలున్నాయి.

* రంపచోడవరం, చింతూరు ఐటీడీఏల పరిధిలో నాలుగున్నర లక్షల వరకు జనాభా ఉండగా ఇందులో 55 వేల వరకు పీవీటీజీలున్నారు. 25 వేల వరకు కుటుంబాలున్నాయి. కొండరెడ్డి, కోయ, గదబ, కొండరెడ్డి పూర్జ ఉప కులాలున్నాయి.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొన్నేళ్లగా పీవీటీజీల సంక్షేమానికి ప్రత్యేకంగా కొన్ని కార్యక్రమాలు చేపడుతున్నాయి. ప్రత్యేకించి సీసీడీపీ నిధులు రూ. 25 కోట్ల వరకు కేటాయించారు. ఆయా నిధులతో ప్రతి గ్రామంలో కనీసం సీసీ రోడ్లు, వ్యక్తిగత మరుగుదొడ్లు, అంగన్‌వాడీ, సామాజిక భవనాలను ఏర్పాటు చేశారు. కాఫీ, మిరియాలు, పసుపు, రాజ్‌మా వంటి విత్తనాల పంపిణీలో వీరికి మిగతా సామాజిక వర్గాల కంటే రాయితీ అధికంగా లభించేలా చూస్తున్నారు. సీసీడీపీ నిధులతో కాఫీ పంట విస్తరణకు అవసరమైన యంత్ర సామగ్రితో పాటు మిరియాలను సేకరించేందుకు నిచ్చెనలు రాయితీపై అందించారు. సుమారు 1200 వరకు పాఠశాలలను ఏర్పాటు చేసి వీరి వాడుక భాషలో విద్యాబోధన చేస్తున్నారు. తద్వారా గ్రామాల్లో విద్యపై వారికి మక్కువ పెంచేలా కృషి చేస్తున్నారు. ట్రైకార్‌, వెలుగు ఆధ్వర్యంలో స్వయం ఉపాధి కల్పించే వ్యక్తిగత రుణాలు శతశాతం రాయితీపై ఇందిస్తున్నారు. గొర్రెలు, మేకలు, సొంతంగా కిరణా దుకాణాలు, జిరాక్సు, టెంట్‌ హౌస్‌, ఫొటో స్టూడియో వంటి వ్యాపారాల నిర్వహణకు రుణాలిచ్చారు. విద్య, ఉద్యోగ రంగాల్లో ప్రాధాన్యం కల్పిస్తున్నారు.  

వన విధానంలో మార్పు...

రాష్ట్రంలో ఏడు ఐటీడీఏలు ఉంటే అందులో పాడేరు ఐటీడీఏలోనే ఎక్కువ మంది పీవీటీజీ జనాభా ఉన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అభివృద్ధికి దూరంగా ఉన్న వారిపైనే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చూపుతూ పలు కార్యక్రమాలను చేపడుతున్నాయి. ఐటీడీఏ ద్వారా పలు పథకాల్లో వారికి రాయితీలను అందిస్తూ వారి ఉన్నతికి ప్రోత్సాహన్ని అందిస్తున్నాం. తాజాగా కేంద్రం ప్రత్యేకించి వారికి బడ్జెట్‌లో అధిక నిధులు కేటాయించడం మంచి పరిణామం. కొత్తగా ప్రవేశ పెట్టిన పీఎం-పీవీటీజీ పథకం వారి జీవితాల్లో కొత్త వెలుగును నింపేందుకు అవకాశం లభిస్తుందని అనుకుంటున్నా.  
రోణంకి గోపాలకృష్ణ, పాడేరు ఐటీడీఏ పీఓ
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని