logo

విశ్వనాధ నేత్రం..చూస్తే అద్భుత ‘చిత్రం!!’

అందరమైన సాగర తీరాన్ని...విశాఖ నగరాన్ని మరింత మనోహరంగా తిలకించాలంటే ‘స్వర్ణ కమలం’లోగీతాలను చూస్తే కేఎస్‌ విశ్వనాథ్‌ ప్రత్యేక కళా దృష్టి కనిపిస్తుంది!!

Updated : 04 Feb 2023 04:50 IST

వెండితెరపై మెరిసిన ‘విశాఖ’ అందాలు

న్యూస్‌టుడే, విశాఖపట్నం

అందరమైన సాగర తీరాన్ని...విశాఖ నగరాన్ని మరింత మనోహరంగా తిలకించాలంటే ‘స్వర్ణ కమలం’లో గీతాలను చూస్తే కేఎస్‌ విశ్వనాథ్‌ ప్రత్యేక కళా దృష్టి కనిపిస్తుంది!!
సినిమా చిత్రీకరణలకు పేరెన్నికగన్న భీమిలి ప్రాంత సొబగులను కనువిందుగా కళ్లముందుంచిన వైనాన్ని‘శుభ సంకల్పం’ కళ్లముందుంచుతుంది!!
గిరులు.. జలపాతలే సిరులుగా పర్యాటకుల మదిలో మెదిలే అరకులో ఆకట్టుకునే ప్రకృతి రమణీయతను
‘స్వయంకృషి’తో ప్రేక్షకుల మదిలో కలకాలం నిలిచేలా చిత్రీకరించారు!!

విశాఖ నగరాన్ని...ముడసర్లోవ జలాశయ పరిసరాలనుతన ‘శుభలేఖ’తో వెండితెరపై మెరిపించారు!!
సాగర సంగమంలో..‘వుడా పార్క్‌’ స్వర్ణ కమలంలో ఎర్రమట్టి దిబ్బల ప్రాంతాలు శుభ సంకల్పంలో... ఉప్పుటేరు...

ఇలా ఎన్నో ప్రాంతాల్లోని ప్రకృతి రమణీయతను తన సినిమాల్లో మరింత అద్భుతంగా చూపించి ఉమ్మడి విశాఖ జిల్లా పర్యాటక ప్రాంతాలను ప్రేక్షకుల మనసుల్లో నిలిచేలా చేశారు.
‘కళా తపస్వి’ కె.విశ్వనాథ్‌ మృతితో ఆయన అభిమానుల్లో అంతులేని విషాదం నెలకొంది. దర్శకునిగా మరపురాని చిత్రాలను అందించిన ప్రతిభను.. ఆయనతో ఉన్న అనుబంధాన్ని శాఖ నగరానికి చెందిన పలువురు గుర్తు చేసుకుంటున్నారు.
* విశాఖలో, సమీప ప్రాంతాల్లో తీసిన చిత్రాల సంగతులను జ్ఞపక్తికి తెచ్చుకుంటున్నారు. కమల్‌హాసన్‌, ఆమని, ప్రియారామన్‌ నటించిన శుభసంకల్పం’ చిత్రం షూటింగ్‌ నిమిత్తం దాదాపు వారం రోజుల పాటు భీమునిపట్నం వచ్చారు. ఈ చిత్రానికి దర్శకత్వం వహించడంతో పాటు విశ్వనాథ్‌ నటించారు.
*    కమల్‌హాసన్‌ను, విశ్వనాథ్‌ను చూసేందుకు ఆ రోజుల్లో పెద్ద ఎత్తున జనం వచ్చారు. విశ్వనాథ్‌ తీసిన హిందీ చిత్రాలు కూడా ఇక్కడ చిత్రీకరించారు.

శుభప్రదం చిత్రీకరణ పేటలో..

పాయకరావుపేట పట్టణానికి చెందిన సినీనటుడు, రచయిత కె.ఆర్‌.జె.శర్మకు ఆయనతో సాన్నిహిత్యం ఉంది. సిరివెన్నెల సినిమాకు సమీక్ష రాసి పంపడంతో వారిద్దరి మధ్య స్నేహం చిగురించింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో విశ్వనాథ్‌ ప్రధానపాత్రలో నటించిన నారాయణతీర్థులు సీరియల్‌లో శర్మ ఆయనకు ప్రధాన శిష్యుని పాత్రలో నటించారు. స్వరాభిషేకం చిత్రంలోనూ నటించారు. అల్లరి నరేష్‌ కథానాయకుడిగా కళాతపస్వి తెరకెక్కించిన శుభప్రదం సినిమా ఎక్కువ భాగాన్ని శ్రీప్రకాష్‌ విద్యానికేతన్‌లోనే తీశారు.


ఆపద్బాంధవుడు, శంకరాభరణం ఇక్కడే..

దేవీపట్నం, న్యూస్‌టుడే: కళాతపస్వి కె.విశ్వనాథ్‌కు అల్లూరి సీతారామరాజు జిల్లాతో మంచి అనుబంధం ఉంది. ఆయన దర్శకత్వం వహించిన ఆపద్బాంధవుడు సినిమా చిత్రీకరణ దేవీపట్నం మండలం పూడిపల్లిలో జరిగింది. చిరంజీవి నటించిన ఈ చిత్రం షూటింగ్‌ పూడిపల్లిలో దాదాపు రెండు నెలలపాటు చేశారు. ఆ సమయంలో విశ్వనాథ్‌ పూడిపల్లిలో ఉన్నారని స్థానికులు చెబుతున్నారు. దీంతోపాటు శంకరాభరణం చిత్రంలో పలు సన్నివేశాలను గండిపోశమ్మ అమ్మవారి ఆలయానికి ఎదురుగా వీరవరపులంక ఇసుక తిన్నెలు, పూడిపల్లి- పోశమ్మగండి గ్రామానికి మధ్యలో ఉన్న తిర్రికాలువ వద్ద చిత్రీకరించారని తెలిపారు. ఆపద్బాంధవుడు చిత్రీకరణ సమయంలో విశ్వనాథ్‌ పూడిపల్లిలోని దేవిశెట్టి పట్టాభిరామయ్య ఇంట్లో ఉన్నారని, ఆయన బయటకు వస్తే అందరితో సరదాగా ముచ్చటించేవారని గ్రామానికి చెందిన బదిరెడ్డి నాగేశ్వరరావు తెలిపారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా పూడిపల్లి గ్రామమంతా ఖాళీ అయినా ఆ జ్ఞాపకాలు ఎప్పటికీ మరువలేమని చెప్పారు.

విశ్వనాథునితో విడదీయలేని బంధం

అనకాపల్లి, న్యూస్‌టుడే: విశ్వనాథ్‌తో అనకాపల్లికి అనుబంధం ఉంది. ప్రముఖ సాంస్కృతిక సంస్థ డైమండ్‌ హిట్స్‌ ఆధ్వర్యంలో నాలుగు దశాబ్దాల క్రితమే ఆయనను ఇక్కడ భారీ ఎత్తున సన్మానించారు. మాజీ మంత్రి, సంస్థ వ్యవస్థాపకులు దాడి వీరభద్రరావు ఆధ్వర్యంలో అనకాపల్లి జిల్లా సహకార మార్కెటింగ్‌ సొసైటీ (డీసీఎంఎస్‌) ఆవరణలో మూడు వేదికలు ఏర్పాటు చేశారు. ఒక వేదికపై సన్మాన కార్యక్రమం నిర్వహించగా మరో వేదికపై సమావేశం, మరో స్టేజ్‌పై దొంగాటకం నాటకం ప్రదర్శించారు. ఆనాటి సన్మాన సభలో హిందీ హీరో రాకేష్‌ రోషన్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.  
 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు