logo

ఆసరా అందలేదు.. భరోసా దక్కలేదు!

సంక్షేమ పథకాల అమలులో సర్కారు తడబడుతోంది. ప్రభుత్వం అందించాల్సిన ఆర్థిక సాయాన్ని వాయిదాలు వేసుకుంటూ వస్తోంది. నిధుల కొరతని పైకి చెబుతున్నా.. వచ్చే ఏడాది ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పథకాల అమలు కాస్తా వెనక్కి జరుపుతున్నారనే ప్రచారం జరుగుతోంది.

Updated : 05 Feb 2023 02:49 IST

గాడితప్పిన సర్కారు సంక్షేమ క్యాలెండర్‌
పథకాల సాయం కోసం లబ్ధిదారుల ఎదురుచూపులు

ఈనాడు డిజిటల్‌, అనకాపల్లి  

ఆసరా లబ్ధిదారులనుంచి వేలిముద్రలు తీసుకుంటున్న వెలుగు సిబ్బంది

సంక్షేమ పథకాల అమలులో సర్కారు తడబడుతోంది. ప్రభుత్వం అందించాల్సిన ఆర్థిక సాయాన్ని వాయిదాలు వేసుకుంటూ వస్తోంది. నిధుల కొరతని పైకి చెబుతున్నా.. వచ్చే ఏడాది ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పథకాల అమలు కాస్తా వెనక్కి జరుపుతున్నారనే ప్రచారం జరుగుతోంది. అమ్మ ఒడి సొమ్ములు మొదట్లో జనవరి నెలలో అందజేసేవారు.. తర్వాత జూన్‌ నెలకు మార్చారు..తాజాగా పొదుపు మహిళల రుణమాఫీకి సంబంధించి ఆసరా పథకాన్ని అక్టోబర్‌ నుంచి జనవరికి మార్చారు.. అయినా ఇప్పటికీ వారికి ఆసరా అందలేదు.. జనవరిలో ఇవ్వాల్సిన రైతు భరోసా పథకం కూడా గాడితప్పింది. ఫిబ్రవరి వచ్చినా ఇంకా అన్నదాతలకు భరోసా దక్కనే లేదు.. ఉమ్మడి జిల్లాలో లక్షలాది మంది లబ్ధిదారులు ఈ పథకాల సాయం కోసం నెలల తరబడి నిరీక్షిస్తున్నారు..

పొదుపు మహిళలు తీసుకున్న రుణాలు వైఎస్సార్‌ ఆసరా పేరుతో నాలుగు వాయిదాల్లో మాఫీ చేస్తామన్నారు. మొదటి విడతగా 2020 నవంబర్‌లో ఉమ్మడి జిల్లాలో 62,999 సంఘాలకు రూ. 456 కోట్లు ఖాతాల్లో వేశారు. రెండో విడత సొమ్ములు 2021 అక్టోబర్‌ 7న 63,991 సంఘాలకు రూ. 470 కోట్ల సాయం అందజేశారు. మూడోవిడత మొత్తం 2022 అక్టోబర్‌లోనే మహిళల ఖాతాల్లో పడాలి. కాని ప్రభుత్వం 2023 జనవరిలో అందజేస్తామని ముఖ్యమంత్రే ప్రకటించారు. ఆ మేరకు సర్కారు సంక్షేమ క్యాలెండర్‌లో పెట్టి సచివాలయాల వద్ద ప్రదర్శించారు. ఇందుకోసం రెండు నెలలు ముందుగానే ఈ పథకంలో ఉన్న స్వయం సహాయక సంఘాల మహిళల నుంచి బయోమెట్రిక్‌ వివరాలు తీసుకున్నారు. జనవరి నెలలో ఆసరా అందితే పండగ ఖర్చులు ఒడ్డెక్కుతాయని పొదుపు మహిళలు ఎంతో ఆశపడ్డారు.. కానీ అందలేదు.. పండగ తర్వాతైనా అందుతాయేమోనని ఎదురుచూశారు. జనవరి దాటి ఫిబ్రవరి మొదటి వారంలోకి వచ్చినా ఈ పథకం లబ్ధి ఎప్పుడిచ్చేదీ అధికారులు సైతం స్పష్టత ఇవ్వలేకపోతున్నారు. మొదటి రెండు విడతలతో పోల్చితే మూడో విడత సాయం అందించడంలో ఇప్పటికే నాలుగు నెలలు ఆలస్యం కావడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు.

ఈ-కేవైసీ చేయించుకోడానికి ఆర్‌బీకేకు వచ్చిన రైతులు

రైతుకేదీ అండ?

అన్నదాతలకు పెట్టుబడి సాయంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పీఎం కిసాన్‌, వైఎస్‌ఆర్‌ రైతు భరోసా పేరుతో ఏడాదికి రూ. 13,500 అందజేస్తున్న సంగతి తెలిసిందే. 2022-23 ఖరీఫ్‌నకు సంబంధించి ఇప్పటికే పీఎం కిసాన్‌ ద్వారా రూ. 4 వేలు.. రైతు భరోసా ద్వారా రూ.7500 చొప్పున భూ యజమానులకు అందింది. మూడో విడతగా జనవరి నెలలో పీఎం కిసాన్‌ లబ్ధిదారులకు రూ. 2 వేలు, కౌలు రైతులు, ఆర్‌ఓఎఫ్‌ఆర్‌, ఈనాం రైతులకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 2 వేల చొప్పున ఆర్థిక సాయం అందించాల్సి ఉంది. పీఎం కిసాన్‌ పథకం అందాలంటే ఈ-కేవైసీ పూర్తయి ఉండాలి. ఈ ప్రక్రియలో కాస్త జాప్యం జరగడంతోపాటు సాంకేతిక సమస్యలున్నాయని కేంద్ర ప్రభుత్వ మూడో విడత సాయాన్ని వాయిదా వేసింది. రాష్ట్ర ప్రభుత్వ మూడో విడతలో ఇవ్వాల్సిన మొత్తం తక్కువగా ఉండడంతో పీఎం కిసాన్‌తో కలిసి ఇస్తే ఎక్కువ మొత్తం ఇచ్చినట్లవుతుందని రాష్ట్ర సర్కారు ఈ సాయం అందించకుండా చూస్తోంది. ఫిబ్రవరి మొదటి వారం వచ్చినా ఈ పథకంపై ప్రభుత్వం ప్రకటన జారీ చేయకపోవడంపై రైతుల్లో అయోమయం నెలకొంది.

ఈ నెలలో అందే అవకాశం..

* ‘ఆసరా పథకానికి సంబందించి అర్హులను గుర్తించడం పూర్తయింది. మూడో విడత సాయం అందించే తేదీని ప్రభుత్వమే ప్రకటిస్తుంది. జనవరిలో అందించాల్సి ఉన్నా సాంకేతిక కారణాలతో వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఈనెలలో అందే అవకాశం ఉంది’ అని అనకాపల్లి డీఆర్‌డీఏ లక్ష్మీపతి చెబుతున్నారు.

* ‘రైతు భరోసా సాయం బహుశా ఈనెల రెండో వారంలో అందించే అవకాశం ఉంది. ప్రభుత్వం నుంచి ప్రకటన రావాల్సి ఉంది. అర్హులైన రైతులందరికీ సాయం అందుతుంది..ఇందులో ఆందోళన అవసరం లేదు’ అని అనకాపల్లి జిల్లా వ్యవసాయాధికారి మోహనరావు చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని