logo

ధాన్యం కొనుగోళ్లలో కొర్రీలు

జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా జరగడం లేదని పలువురు జడ్పీటీసీ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. మిల్లర్ల వ్యవహార శైలిపై ధ్వజమెత్తారు.

Updated : 05 Feb 2023 02:51 IST

జడ్పీ స్థాయీ కమిటీలో జడ్పీటీసీల ఆగ్రహం

మాట్లాడుతున్న సుభద్ర, జడ్పీ సీఈఓ శ్రీరామమూర్తి

విశాఖపట్నం, న్యూస్‌టుడే: జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా జరగడం లేదని పలువురు జడ్పీటీసీ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. మిల్లర్ల వ్యవహార శైలిపై ధ్వజమెత్తారు. జడ్పీ సమావేశ మందిరంలో శనివారం ఛైర్‌పర్సన్‌ జల్లిపల్లి సుభద్ర అధ్యక్షతన స్థాయీ కమిటీ సమావేశాలు జరిగాయి. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోళ్లలో ఎదురవుతున్న ఇబ్బందులను నర్సీపట్నం, దేవరాపల్లి, గొలుగొండ జడ్పీటీసీ సభ్యులు రమణమ్మ, కర్రి సత్యం, గిరిబాబు ప్రస్తావించారు. కర్రి సత్యం మాట్లాడుతూ పాండ్రంగి మిల్లుకు తన ధాన్యం పంపితే మిల్లరు తీసుకోలేదని, రూ.10 వేలిస్తే గానీ కొనుగోలు చేయకపోవడం దారుణమని వాపోయారు. రంగు మారాయని చెబుతూ కొనడం లేదన్నారు. ప్రభుత్వం చెబుతున్న దానికి ఇక్కడ జరుగుతున్న దానికి పూర్తి భిన్నంగా ఉందని.. తనకే ఇటువంటి పరిస్థితి ఎదురైతే సాధారణ రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారో చెప్పలేమన్నారు.

* జడ్పీ ఛైర్‌పర్సన్‌ మాట్లాడుతూ జగనన్న కాలనీల పనులు ఉగాది నాటికి పూర్తి చేయాలన్నారు. కశింకోట ఆర్‌ఈసీఎస్‌ను ఈపీడీసీఎల్‌లో విలీనం చేసే ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలన్నారు. స్థాయీ కమిటీ సమావేశాలు నామమాత్రంగా జరిగాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన ఆరోగ్యశాఖ అధికారులు సమావేశానికి గైర్హాజరవడంపై గిరిజన ప్రాంత జడ్పీటీసీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయా అధికారులకు షోకాజ్‌ నోటీసులు జారీ చేస్తామని, వచ్చే సమావేశాల నుంచి తప్పనిసరిగా హాజరయ్యేలా చూస్తామని సీఈఓ శ్రీరామమూర్తి సభ్యులకు హామీ ఇచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని