logo

కొండంత బకాయిలు.. కొండెక్కుతున్న సేవలు!

గిరిజన సహకార సంస్థ... అటవీ, వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లలో దళారుల మోసాల నుంచి గిరిజనులను కాపాడేందుకు ఏర్పాటు చేసిన ఈ సంస్థకే ప్రభుత్వం సహకారం కరవైంది.

Published : 05 Feb 2023 03:08 IST

ఆర్ధిక సంక్షోభంలో జీసీసీ
చింతపల్లి, న్యూస్‌టుడే

నిత్యావసరాలను గోదాముల్లోకి తరలిస్తున్న హమాలీలు

గిరిజన సహకార సంస్థ... అటవీ, వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లలో దళారుల మోసాల నుంచి గిరిజనులను కాపాడేందుకు ఏర్పాటు చేసిన ఈ సంస్థకే ప్రభుత్వం సహకారం కరవైంది. సకాలంలో బకాయిలు విడుదల కాకపోవడంతో ఆర్థిక భారంతో కుంగిపోతోంది.
గిరిజన సహకార సంస్థ (జీసీసీ) 1956లో ఏర్పాటైంది. మన్యంలో నిత్యావసరాల పంపిణీ బాధ్యతలను భుజానికెత్తుకున్న ఈ సంస్థకు పౌరసరఫరాల శాఖ ఏడాది కాలంగా బకాయిలు చెల్లించడం లేదు. దీంతో పెట్టుబడులు పెట్టలేక నిధుల లేమితో కొట్టుమిట్టాడుతోంది. జీసీసీ చింతపల్లి డివిజన్‌ పరిధిలో చింతపల్లి, గూడెంకొత్తవీధి, కొయ్యూరు మండలాలున్నాయి. ఈ మూడు మండలాల పరిధిలో శాఖ కార్యాలయాలు, గోదాములతోపాటు మొత్తం 155 డి.ఆర్‌. డిపోలున్నాయి. ప్రతినెలా  విశాఖ నుంచి పౌర సరఫరాలశాఖ గిడ్డంగుల ద్వారా జీసీసీ గోదాములకు బియ్యం, పప్పులతోపాటు ఇతర నిత్యావసర సరకులు వస్తుంటాయి. ఇలా నెలకు సుమారు 130 లారీల వరకూ వస్తాయి. ప్రజలకు సరఫరా చేయాల్సిన బియ్యం, ఇతర నిత్యావసరాలతోపాటు అంగన్‌వాడీ కేంద్రాలు, ఆశ్రమాలు, కళాశాల వసతిగృహాల్లో భోజనాలకు సంబంధించి సరకులన్నింటినీ జీసీసీయే సరఫరా చేస్తోంది. ఇలా సరఫరా చేసే ప్రతి వంద కేజీలకు రూ. 22 చొప్పున హమాలీలకు చెల్లించాల్సిన బాధ్యత పౌర సరఫరాల శాఖపై ఉంది. నెలకు ఒక శాఖకే సుమారు రూ. 2 లక్షల వరకూ ఖర్చవుతుంది. ఇలా చింతపల్లి డివిజన్‌ పరిధిలోని మూడు శాఖలకు కలిపి నెలకు హమాలీలకు చెల్లించే ఖర్చే సుమారు రూ. 6 లక్షలకు పైగా ఉంటోంది. సరకుల రవాణాకు నెలకు ఒక శాఖ పరిధిలో సుమారు రూ. 8.58 లక్షల వరకూ ఖర్చవుతోంది. ఇలా నెలకు మూడు శాఖలకు కలిపి సుమారు రూ. 14 లక్షల వరకూ అవుతోంది. ఇది కాక నిత్యావసరాలను ప్రజలకు, ఇతర సంస్థలకు సరఫరా చేసినందుకు జీసీసీకి పౌర సరఫరాల శాఖ కమిషన్‌ రూపంలో కొంత నగదు చెల్లించాల్సి ఉంది. ఇలా చెల్లించాల్సిన కమిషన్‌ బకాయిలు సుమారు రూ. 35 లక్షల వరకూ పేరుకుపోయాయి. ఒక్క చింతపల్లి డివిజన్‌ పరిధిలోనే గతేడాది ఏప్రిల్‌ నుంచి ఇప్పటివరకూ హమాలీలు, సరకు రవాణాకు సుమారు రూ. 1.5 కోట్లదాకా చెల్లించాల్సి ఉంది.

కాస్మెటిక్‌ ఛార్జీలకూ దిక్కులేదు

గిరిజన సంక్షేమ ఆశ్రమాలు, కళాశాల విద్యార్థులకు గతంలో ప్రభుత్వం కాస్మెటిక్‌ ఛార్జీలు చెల్లించేది. విద్యార్థులకు అవసరమైన షాంపూలు, సబ్బులు, కొబ్బరి నూనెలు, దువ్వెనలు వంటి సామగ్రిని విద్యార్థులకు అందించేవారు. జీసీసీ ద్వారా తయారైన ఉత్పత్తులైన సబ్బులు, షాంపూలు వంటివి జీసీసీ సరఫరా చేసేది. ఇలా సరఫరా చేసిన వాటికి 2017 నుంచి ఐటీడీఏ ఇవ్వడం నిధులు మానేసింది. ఇలా పేరుకుపోయిన బకాయిలు రాష్ట్రవ్యాప్తంగా సుమారు రూ. 18 కోట్లు ఉండగా, ఒక్క చింతపల్లి జీసీసీ డివిజన్‌ పరిధిలో సుమారు రూ. 2 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఇక ఐటీడీఏ ద్వారా గిరిజన సంక్షేమ ఆశ్రమాలకు సరఫరా చేసిన గ్యాస్‌ సిలెండర్లకు సంబంధించి సుమారు రూ. 60 లక్షల వరకూ బకాయిలను ఐటీడీఏ చెల్లించలేదు. ఇలా ఇటు పౌర సరఫరాల శాఖ, అటు ఐటీడీఏ చెల్లింపులు చేయకపోవడంతో స్వయంప్రతిపత్తిగల జీసీసీ నిర్వీర్యం అయిపోతోంది.


లేఖలు రాస్తున్నాం

సరకుల పంపిణీకి సంబంధించి జీసీసీకి పౌర సరఫరాల శాఖ ద్వారా చెల్లించాల్సిన బకాయిలు తక్షణమే చెల్లించాల్సిన సంబంధిత ఉన్నతాధికారులకు తరచూ లేఖలు రాస్తున్నాం. కోట్లలో బకాయిలు పేరుకుపోవడంతో జీసీసీ కొంతమేర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటోంది. సంస్థకు చెందిన నిధులు లేకపోవడంతో అటవీ, వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లకూ నిధుల సమస్య ఎదురవుతోంది.

 సింహాచలం, జీసీసీ డివిజనల్‌ మేనేజరు చింతపల్లి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని