logo

పాడేరు రహదారి విస్తరణకు రంగం సిద్ధం

జిల్లా కేంద్రం పాడేరు పట్టణ రహదారిని విస్తరించేందుకు రంగం సిద్ధమైంది. ప్రస్తుతం ఏడుమీటర్ల వెడల్పున మెయిన్‌ రోడ్డు సరిపోవడం లేదు.

Published : 06 Feb 2023 02:58 IST

పాడేరు పట్టణ మెయిన్‌ రోడ్డు

పాడేరు, న్యూస్‌టుడే: జిల్లా కేంద్రం పాడేరు పట్టణ రహదారిని విస్తరించేందుకు రంగం సిద్ధమైంది. ప్రస్తుతం ఏడుమీటర్ల వెడల్పున మెయిన్‌ రోడ్డు సరిపోవడం లేదు. జన సంచారం, వాహన రద్దీ ఎక్కువ కావడంతో నిత్యం ట్రాఫిక్‌ సమస్య తలెత్తుతోంది. రోడ్డు మీదే సంచార వ్యాపారాలు నిర్వహిస్తుండటంతో ఎక్కడికక్కడే ట్రాఫిక్‌ స్తంభిస్తోంది. మంత్రులు, ఉన్నతాధికారుల వాహనాలు సైతం ట్రాఫిక్‌లో చిక్కుకుంటున్నాయి. ఈ ఇబ్బందులను గుర్తించిన ఉన్నతాధికారులు ప్రధాన రహదారులు విస్తరించాలని సంబంధిత ఆర్‌అండ్‌బీశాఖకు ఆదేశించారు.

రెండు వరుసలుగా..

పాడేరు పట్టణ పరిధిలోని అంబేడ్కర్‌ కూడలి నుంచి మండల పరిషత్తు కార్యాలయం, తలారిసింగి, సెయింటాన్స్‌ పాఠశాల వరకు రహదారులు నిత్యం రద్దీగా ఉంటున్నాయి. జిల్లా కేంద్రంగా మారడంతో ఉన్నతాధికారులను కలిసేందుకు జిల్లావ్యాప్తంగా పెద్దఎత్తున ఇక్కడకు వస్తుండటంతో రద్దీ ఎక్కువైంది. భవిష్యత్తులో ఈ రద్దీ మరింత పెరగనుంది. ఈ నేపథ్యంలో ఈ రహదారిని 15 మీటర్లు (సుమారు 45 అడుగులు) మేర విస్తరించాలని యోచిస్తున్నారు. అరకులోయ రహదారుల మాదిరిగా మధ్యలో డివైడర్‌ ఏర్పాటు చేసి, రెండు వరసలుగా విస్తరిస్తే ట్రాఫిక్‌ ఇబ్బందులు తప్పుతాయని అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఆర్‌అండ్‌బీ, రెవెన్యూ, పంచాయతీ అధికారులు కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఇప్పటికే రెవెన్యూ, పోలీసు, పంచాయతీ అధికారులు వ్యాపారవర్గాలతో సమావేశం నిర్వహించారు. రోడ్డుకు ఇరువైపులా ఆక్రమణలను తొలగించాలని సూచించారు. దీనిపై ఆర్‌అండ్‌బీ ఈఈ బాలసుందరను ‘న్యూస్‌టుడే’ వివరణ కోరగా.. జిల్లా కేంద్రంగా మారడంతో వాహన రద్దీ ఎక్కువైందన్నారు. ప్రమాదాలు నివారణకు, ట్రాఫిక్‌ ఇబ్బందులు తొలగించేందుకు ఇప్పుడున్న రోడ్డును విస్తరించాల్సి ఉందని చెప్పారు. స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాలు, పంచాయతీ, రెవెన్యూ అధికారుల సహకారంతో ప్రతిపాదనలు రూపొందించనున్నట్లు వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని