logo

ధర లేక దిగాలు

మన్యంలో బంగాళదుంపలు సాగుచేస్తున్న గిరిజన రైతులు గిట్టుబాటు ధర లభించడం లేదని ఆందోళన చెందుతున్నారు.

Published : 06 Feb 2023 02:58 IST

ముంచంగిపుట్టు, న్యూస్‌టుడే

వనబసింగిలో బంగాళదుంప సాగు

మన్యంలో బంగాళదుంపలు సాగుచేస్తున్న గిరిజన రైతులు గిట్టుబాటు ధర లభించడం లేదని ఆందోళన చెందుతున్నారు. కనీసం పెట్టుబడి సొమ్ము చేతికందలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ముంచంగిపుట్టు మండలం దోడిపుట్టు, వనబసింగి, పేటమాలిపుట్టు, గూడమాలిపుట్టు, గత్తురమండ గ్రామాల్లో రైతులు కూరగాయలు సాగు చేస్తున్నారు. ఈ ఏడాది   గ్రామాల్లో 30 ఎకరాల్లో బంగాళా దుంపలు సాగు చేశారు. రైతులు ఒడిశా రాష్ట్రంలోని నిర్వహించనున్న వారపు సంతల నుంచి విత్తనాలు కొనుగోలు చేసి సాగు చేపట్టారు. 40 కేజీల దుంపలను రూ.950 నుంచి రూ.వెయ్యి చెల్లించి కొనుగోలు చేశారు. ఎకరా భూమిలో దుంపలు సాగు చేసేందుకు రూ.40వేల వరకు ఖర్చు చేశామని దిగుబడి లేక ఆర్థికంగా నష్టపోయామని రైతులు వాపోతున్నారు.

అందని రాయితీ విత్తనాలు..

కూరగాయలు సాగుచేసే రైతులకు గతంలో పాడేరు ఐటీడీఏ, ఉద్యాన శాఖ సంయుక్తంగా రాయితీపై విత్తనాలు అందించి సాగును ప్రోత్సహించేవారు. మూడేళ్ల నుంచి రైతులకు విత్తనాలు అందించక పోవటంతో రైతులు ఒడిశా వెళ్లి కొనుగోలు చేసుకుని సాగు చేస్తున్నారు. కనీసం సస్యరక్షణ చర్యలు చేపట్టేందుకు కూడా అధికారుల నుంచి సహకారం లేదని, అందుబాటులో ఉండే సేంద్రీయ ఎరువులతో పాటు కృత్రిమ ఎరువులు వినియోగిస్తున్నామని, ఎకరాకు రూ.40వేలు వరకు ఖర్చు చేస్తున్నా ఆశించిన దిగుబడి రావటంలేదని రైతులు ఆందోళన చెందుతున్నారు.

దుంపలు చూపుతున్న రైతు

వారపు సంతల్లో విక్రయాలు..

బంగాళాదుంపలు సాగు చేసిన రైతులు ఇక్కడ రైతు బజార్లు లేక ముంచంగిపుట్టు, జోలాపుట్టు, పెదబయలు, లక్ష్మీపురం, బంగారుమెట్ట, బూసీపుట్టు గ్రామాల్లో నిర్వహించనున్న వారపు సంతలో విక్రయిస్తున్నారు. దుంప పరిమాణం తగ్గిపోవడంతో కేజీ రూ.10 నుంచి రూ.20లకు విక్రయిస్తున్నామని ధర లేక, దిగుబడి లేక నష్టపోతున్నామని రైతులు చెబుతున్నారు. నాణ్యమైన విత్తనాలు అందించి కూరగాయల సాగుకు పాడేరు ఐటీడీఏ సహకారం అందించాలని రైతులు కోరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని