logo

వేతనాలు పెంచండి.. వేధింపులు మానండి

తమ దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సీఐటీయూ నాయకుల ఆధ్వర్యంలో అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకులు సోమవారం కలెక్టరేట్‌ను ముట్టడించారు.

Published : 07 Feb 2023 03:43 IST

కలెక్టరేట్‌ను ముట్టడించిన అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకులు

పాడేరు/పట్టణం, న్యూస్‌టుడే: తమ దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సీఐటీయూ నాయకుల ఆధ్వర్యంలో అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకులు సోమవారం కలెక్టరేట్‌ను ముట్టడించారు. ముందుగా ఐటీడీఏ కార్యాలయం నుంచి కలెక్టరేట్‌ వద్దకు ర్యాలీగా చేరుకున్నారు. ముఖద్వారం వద్ద బైఠాయించి నినాదాలు చేశారు. సంయుక్త కలెక్టర్‌ శివ శ్రీనివాస్‌ ఆందోళనకారుల వద్దకు చేరుకున్నారు. అంగన్‌వాడీలు తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. కనీస వేతనం రూ. 26 వేలకు పెంచాలని, అంగన్‌వాడీలకు ముఖ ఆధారిత హాజరు నమోదును రద్దు చేయాలని కోరారు. పర్యవేక్షణ పేరుతో వేధింపులను మానుకోవాలని, బకాయి బిల్లులు చెల్లించాలని, పదవీ విరమణ అనంతరం రూ. 5 లక్షలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. వేతనంలో సగం పింఛను అందించాలని, సీనియారిటీ ప్రకారం వేతనం చెల్లించాలన్నారు. పదోన్నతుల విషయంలో రాజకీయ జోక్యం అరికట్టాలని కోరారు. నూనె, కందిపప్పు నాణ్యంగా ఉండాలని, కారుణ్య నియామకాలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. ర్యాలీలు, సభలను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోను రద్దు చేయాలన్నారు. తమ పరిధిలో ఉన్న సమస్యలను తక్షణమే పరిష్కరిస్తామని జేసీ తెలిపారు. మిగతావాటిని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. సంఘ జిల్లా నాయకులు భాగ్యలక్ష్మి, వెంకటలక్ష్మి, నాగమ్మ, సీఐటీయూ జిల్లా అధ్యక్షులు చిన్నయ్యపడాల్‌, ఉమామహేశ్వరరావు, బాలదేవ్‌ తదితరులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని