logo

ఏకగ్రీవ నిధులకు ఎదురుచూపులు

ఉమ్మడి జిల్లాలో 969 పంచాయతీలకు 2021 ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించారు. అంతకుముందే పాలకవర్గాలను ఏకగ్రీవం చేసుకుంటే జనాభా ప్రాతిపదికన ప్రోత్సాహకం ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది.

Published : 09 Feb 2023 02:11 IST

4.65 కోట్లిచ్చి వెనక్కి తీసుకున్న సర్కారు
ఈనాడు డిజిటల్‌, పాడేరు, న్యూస్‌టుడే పాడేరు

ఉమ్మడి జిల్లాలో 969 పంచాయతీలకు 2021 ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించారు. అంతకుముందే పాలకవర్గాలను ఏకగ్రీవం చేసుకుంటే జనాభా ప్రాతిపదికన ప్రోత్సాహకం ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీనికి స్పందించి జిల్లాలో 75 పంచాయతీలు ముందుకొచ్చాయి. వీటికి జనాభా లెక్కన రూ.5 లక్షల, రూ.10 లక్షలు చొప్పున రూ.4.65 కోట్ల నజరానా ఇవ్వాల్సి ఉంది. పంచాయతీల్లో పాలకవర్గాలు కొలువు తీరి రెండేళ్లు కావొస్తున్నా సర్కారు ఏకగ్రీవ ప్రోత్సాహక నిధులను మాత్రం విడుదల చేయలేదు.

ఆర్థిక సంఘం, సాధారణ నిధులకు అదనంగా ప్రభుత్వమిచ్చే ప్రోత్సాహక మొత్తం అందుబాటులోకి వస్తే మిగతా గ్రామాలు కంటే ఎక్కువ అభివృద్ధి చేసుకోవచ్చని సర్పంచులు ఆశపడ్డారు. ఏడాది క్రితం ఓసారి ఏకగ్రీవ నిధులు మంజూరు చేసినట్లే చేసి మరలా వెనక్కి తీసుకున్నారు. ఆర్థిక సంఘం నిధులు పరిస్థితి అంతే..సాధారణ నిధులున్నా ఖర్చుపెట్టడానికి ఆంక్షలు పెడుతుండడంతో ఏకగ్రీవ పంచాయతీలు ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. 

పాడేరు డివిజన్‌లోని పదకొండు మండలాల్లో 244 పంచాయతీలు ఉన్నాయి. ఇందులో కొయ్యూరు మండలం మంపతో పాటు గూడెంకొత్తవీధి మండలం మొండిగెడ్డ పంచాయతీల్లో పాలకవర్గాలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వీటికి రూ.10 లక్షల చొప్పున ప్రోత్సాహక సొమ్ము అందాల్సి ఉంది. పేరుకు ఏకగ్రీవ పంచాయతీలుగా ప్రకటించిదే తప్ప ప్రభుత్వ ఉత్తర్వులు అందించి ఏడాదిన్నర గడుస్తున్నా నేటికీ ఒక్క పైసా కూడా రాలేదు. ఇదిగో..అదిగో అంటున్నారు తప్పితే నేటికి ప్రభుత్వం నుంచి ఎటువంటి నిధులు అందలేదని మంప సర్పంచి త్రినాథ పడాల్‌ చెబుతున్నారు.

కొయ్యూరు మండలం మంప పంచాయతీ కార్యాలయం


నిధుల్లేక ఇబ్బందులు..

ప్రోత్సాహక సొమ్ము వస్తుందని చూస్తున్నాం. ఇంతవరకు పైసా వేయలేదు. గ్రామంలో దోమల బెడద ఎక్కువగా ఉంది. దీని నివారణకు ప్రధాన మురుగు కాలువపై పలకలు వేయాలి. దీంతో పాటు వీధి రోడ్లు నిర్మాణం, కుళాయిలు వేయించాలి. గ్రామం చిన్నది కావడంతో నిధులరాక అంతంతమాత్రంగా ఉంది. అధికారులను అడుగుతుంటే అందరితోపాటే వస్తాయి అంటున్నారు తప్పితే, ఎప్పుడనేది చెప్పడంలేదు.

ఫాతిమున్నీసా బేగం, సర్పంచి పెదబోదిగల్లం


మురుగు సమస్య వేధిస్తోంది..

జి.భీమవరం పంచాయతీలో మురుగు పారుదల సమస్య తీవ్రంగా ఉంది. అయినా పరిష్కరించలేని పరిస్థితి. శివారు సింగవరంలో మరింత అధ్వానంగా ఉంది. మురుగుకాలువలు, రహదారులు లేక గ్రామస్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఏకగ్రీవ నిధులు మంజూరు కాగానే వీటిని పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నాం.

హనుమంతు వెంకట లక్ష్మణరావు, జి.భీమవరం సర్పంచి


జి.మాడుగుల మండలం కిల్లంకోట పంచాయతీ ఏకగ్రీవమైంది. దీని పరిధిలో 21 గ్రామాలున్నాయి. ప్రోత్సాహక నిధులు వస్తే అభివృద్ధి చేసుకోవచ్చని సర్పంచి బుటారి ముత్యాలమ్మ ఆశించారు. ఏళ్లు గడుస్తున్నా ఆ నిధులు రాలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీకి వెళ్లేందుకు రహదారి లేదని చాలా గ్రామాల్లో కనీసం తాగునీరు దొరకడం లేదన్నారు.


డీఎల్‌పీవో కుమార్‌ను వివరణ కోరగా ప్రభుత్వం ఏకగ్రీవ పంచాయతీలను గుర్తించిందని, త్వరలో నిధులు విడుదల కానున్నట్లు చెప్పారు. రంపచోడవరం డివిజన్‌లోని రెండు ఏకగ్రీవ పంచాయతీలకు ఇదివరకే నిధులు మంజూరు చేశారని గుర్తుచేశారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని