logo

సొంతంగా ఎదుగుతూ అండగా నిలుస్తూ..

గిరి మహిళలు స్వయం ఉపాధి మార్గాల వైపు పయనిస్తున్నారు. ఒకప్పుడు ఇంటి పనులు, పొలం పనులతో సరిపెట్టుకునేవారు.

Published : 09 Feb 2023 02:11 IST

గిరి మహిళలకు పథకాల తోడు

పాడేరు, న్యూస్‌టుడే

గిరి మహిళలు స్వయం ఉపాధి మార్గాల వైపు పయనిస్తున్నారు. ఒకప్పుడు ఇంటి పనులు, పొలం పనులతో సరిపెట్టుకునేవారు. ఇప్పుడు పురుషులతో సమానంగా విభిన్న రంగాల్లో ప్రవేశించి సత్ఫలితాలను అందుకుంటున్నారు. ఒకప్పటిలా సొంత వ్యాపారంతో సరిపెట్టుకోకుండా ప్రభుత్వం కల్పిస్తున్న ప్రతి అవకాశాన్ని సద్వినయోగం చేసుకుంటూ తమతో పాటు మరొకొందరికి జీవనోపాధిని కల్పించేందుకు కృషి చేస్తున్నారు. చిన్న పరిశ్రమలను నెలకొల్పుతూ గుర్తింపు తెచ్చుకుంటున్నారు.

18 సంవత్సరాలు దాటిన ప్రతి పురుష, మహిళకు స్వయం ఉపాధి అవకాశాలు మెరుగుపర్చేందుకు ప్రధాన మంత్రి ఉపాధి కల్పన పథకం (పీఎంఈజీపీ) ద్వారా బ్యాంకుల ద్వారా రాయితీ రుణాలను అందిస్తున్నారు. సొంత వ్యాపారమే కాకుండా చిన్న పరిశ్రమల స్థాపనకు సైతం ఒక్కో యూనిట్‌కు రూ.లక్ష నుంచి 50 లక్షల వరకు రుణం అందించే వీలుంది. అల్లూరి సీతారామరాజు జిల్లా ఏర్పడిన తర్వాత కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ పీఎంఈజీ పథకం అమలుపై దృష్టి సారించారు. ఉద్యోగ, స్వయం ఉపాధి కల్పించే దిశగా చొరవ తీసుకుంటున్నారు. స్థానికంగా స్వయం సహాయక సంఘాల్లోని సభ్యులకు, గతంలో చిన్న చిన్న వ్యాపారాలను చేసుకుంటూ బ్యాంకు లింకేజీ రుణాలను క్రమ పద్ధతిలో చెల్లించిన మహిళలకు ఈ రుణాల జారీలో ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. వెలుగు ఆధ్వర్యంలో పొదుపు సంఘాల సభ్యులను ఎంపిక చేసి లబ్ధిదారుల గుర్తింపు కార్యక్రమాన్ని ముమ్మరం చేశారు. ఈ పథకం ద్వారా ఎస్‌హెచ్‌సీ గ్రూపుల్లోని వారే కాకుండా వ్యాపార ఆసక్తి కలిగిన ఇతర యువతీ యువకులు సైతం రుణాన్ని పొందే అవకాశముంది.


వాయిదాలు చెల్లిస్తూ..

ఒకప్పుడు మేము బతికేందుకు ఎలా అని ఆలోచన చేసేవాళ్లం. ఇప్పుడు మాతో పాటు మరికొన్ని కుటుంబాలకు జీవనోపాధి కల్పించే వ్యాపారాలపై దృష్టి పెట్టాం. మాకున్న ఆసక్తిని గుర్తించి కలెక్టర్‌, ఐటీడీఏ పీవో రూ.10 లక్షల వరకూ రుణం అందించారు. క్రమం తప్పకుండా వాయిదాలు చెల్లిస్తున్నాం. మరో చిన్న పరిశ్రమ పెట్టి పది మందికి ఉపాధి కల్పించాలనే ఆలోచనతో ముందుకెళ్తున్నా.

చిట్టెమ్మ, స్వాతి గ్రూపు, మినుములూరు, పాడేరు


కొంతిలిలో కొత్త ఉపాధి

హుకుంపేట మండలం కొంతిలిలో వుడ్‌ డిజైనింగ్‌ చేసే యంత్రాన్ని భవాని అనే స్వయం సహాయక సభ్యురాలికి అందించారు. దీని విలువ సుమారు రూ.6 లక్షలు. రుణం రూ.4.75 లక్షలు అందగా సొంతంగా ఈమె రూ.1.25 లక్షల వరకు పెట్టుబడి పెట్టారు. ఈ యంత్రం ద్వారా ఆమెతో పాటు మరో రెండు కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. వుడ్‌ కటింగ్‌ ద్వారా నెలకు రూ.40 వేల వరకు ఆదాయం ఆమెకు సమకూరుతోంది. నెలకు రూ.10300ల వరకూ ఈఎంఐ చెల్లిస్తున్నారు.

వ్యాపారంపై ఆసక్తి: గతంలో కూలి పనులకు వెళ్లి తద్వారా వచ్చిన మొత్తంతో మా కుటుంబానికి ఆర్థికంగా సహాయ పడేవాళ్లం. స్వయం సహాయక సంఘం సభ్యురాలిగా బ్యాంకు ద్వారా వివిధ రుణాలు పొంది చిన్న వ్యాపారం చేసుకుంటూ సాగుతున్నాను. మూడు నెలల కిందట పీఎంఈజీ పథకం ద్వారా మాకు రూ.4.75 లక్షల వరకు రుణం లభించింది. నా దగ్గర గతంలో వివిధ వ్యాపార నిర్వహణ ద్వారా పొదుపు చేసుకున్న మొత్తాన్ని కలిపి డిజైనింగ్‌ యంత్రాన్ని ఏర్పాటు చేశాం. చుట్టుపక్కల వారంతా మా దగ్గరకే వచ్చి ఆర్డర్లు ఇస్తున్నారు. ప్రస్తుతం నాకు రూ.40 వేల ఆదాయం సమకూరుతోంది. తీసుకున్న రుణం ప్రతి నెలా క్రమం తప్పకుండా కట్టగలుగుతున్నాను.

భవాని, గీతాంజలి గ్రూపు, కొంతిలి, హుకుంపేట మండలం


తక్కువ సమయంలో ఆదరణ

పాడేరు పట్టణంలో ఓ హోటల్‌ను ఏర్పాటు చేశాం. ప్రభుత్వం అందించిన రుణం రూ.5 లక్షలు మాకు ఎంతో ఉపయోగపడింది. పట్టణంలో ఎన్నో భోజన హోటల్స్‌ ఉన్నా తక్కువ సమయంలో మా సంస్థ ఆదరణ పెరిగింది. మాతో పాటు మరో నలుగురు ఈ హోటల్‌ ద్వారా ఉపాధి పొందగలుగుతున్నారు. ఈ ప్రాంతం పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందుతున్నందున భవిష్యత్తులో ఓ రెస్టారెంట్‌ ఏర్పాటు చేసి వ్యాపారపరంగా విస్తరించాలనుకుంటున్నాం. ప్రభుత్వం సహకరిస్తే ముందుకెళ్తాను.

వరలక్ష్మి, సాయిరాం గ్రూపు, పాడేరు పట్టణం

పాడేరు పట్టణంలో సాయిరాం గ్రూపునకు చెందిన వరలక్ష్మికి పీఎంఈజీపీ ద్వారా రూ.5 లక్షలు రుణం లభించింది. ఈమె ఈ రుణంతో మెయిన్‌రోడ్డులో హోటల్‌ ప్రారంభించారు. దీంట్లో మరో నలుగురు మహిళలకు ఉపాధి కల్పిస్తున్నారు. బిర్యానీ, ఇతర వంటకాల విక్రయిస్తూ రోజుకు రెండు వేల రూపాయల వరకూ గడిస్తున్నారు. ఇదే మండలం మినుములూరు చిట్టెమ్మకు ఈ పథకం ద్వారా రూ.10 లక్షల రుణం ఇచ్చారు. ఈమె రైస్‌ మిల్లును ఏర్పాటు చేశారు. ఈమెతో పాటు ఐదు కుటుంబాలు మిల్లు ఆధారంగా బతుకుతున్నాయి. ఈమె నెలకు రూ.10 వేలు వరకు బ్యాంకు రుణం చెల్లిస్తోంది.


ప్రధానంగా హోటల్‌, రెస్టారెంట్లు, పిండి మిల్లులు, టెంట్‌హౌస్‌ల నిర్వహణ, సబ్బుల తయారీ, కోల్డ్‌ స్టోరేజీల నిర్వహణ వంటి చిన్న పరిశ్రమలకు రుణాలిచ్చేందుకు బ్యాంకులు ముందుకొస్తున్నారు. ఎస్సీ, ఎస్టీలకైతే రుణాల తిరుగు చెల్లింపుల్లో 45 శాతం వరకూ రాయితీ ఉంటుంది. ఇతర వర్గాల వారికి 30 శాతం వరకు రాయితీ వర్తిస్తుంది. ఇప్పటి వరకు జిల్లావ్యాప్తంగా 70 వరకూ యూనిట్లను మంజూరు చేయగా 38 యూనిట్లు గ్రౌండింగ్‌ అయ్యాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు