logo

ఇందిరా మార్కెట్‌లో వారపు సంత!

నర్సీపట్నం ఇందిరా కూరగాయల మార్కెట్‌లో గతంలో మాదిరిగా వారపు సంత కొనసాగేలా అధికారులు చర్యలు చేపట్టనున్నారు.

Published : 09 Feb 2023 02:11 IST

నర్సీపట్నం అర్బన్‌, న్యూస్‌టుడే

ఇందిరా మార్కెట్‌

నర్సీపట్నం ఇందిరా కూరగాయల మార్కెట్‌లో గతంలో మాదిరిగా వారపు సంత కొనసాగేలా అధికారులు చర్యలు చేపట్టనున్నారు. గత ఏడాదే ఈ దిశగా ప్రయత్నాలు చేపట్టినా టోకు వ్యాపారులు ఇక్కడికి రాలేదు. దీంతో వారపు సంత కొనసాగలేదు. ఈ ఏడాది మాత్రం ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలో చింతపల్లి రోడ్డుకు ఇరువైపులా నిర్వహిస్తున్న వారంతా తిరిగి ఇందిరామార్కెట్‌కు వచ్చేలా నచ్చజెప్పనున్నారు. ట్రాఫిక్‌ ఇబ్బందులు, ప్రమాదాలను దృష్టిలో పెట్టుకుని ఇక్కడ మార్కెట్‌ను తరలించడమే మేలని పోలీసులు భావిస్తున్నారు.

* నర్సీపట్నం వారపుసంత ద్వారా మండల పరిషత్తుకు గతంలో రూ. 14 లక్షల వరకు ఆదాయం వచ్చేది. వ్యాపారులు రాకపోవడంతో గత ఏడాది ఆదాయం రూ. 5 లక్షలకు పడిపోయింది. గతంలో మాదిరిగా ఆదాయం రావాలంటే రైతులంతా ఇందిరా మార్కెట్‌కు వచ్చేలా చూడడమే ప్రధానమని అధికారులు భావిస్తున్నారు. తద్వారా వినియోగదారులకు సౌకర్యంగా ఉంటుంది. ప్రతి మంగళ, గురు, శనివారాల్లో చుట్టుపక్కల మండలాల నుంచి రైతులు పట్టణానికి కూరగాయలు తీసుకువస్తుంటారు. విశాఖ, అనకాపల్లి, తుని నుంచి టోకు వ్యాపారులొచ్చి కొనుగోలు చేస్తుంటారు. రైతులకు అవసరమైన స్థలాన్ని అందుబాటులో ఉంచేందుకు ఏం చేయాలన్న దానిపై మండల పరిషత్తు అధికారులు దృష్టి సారించారు. కేటాయించిన ప్రదేశాన్ని మించి దుకాణాలు నిర్వహించకుండా చూడడం వల్ల రైతులకు కొంత స్థలం అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు.

రూ.లక్షల ఖర్చుతో నిర్మించిన దుకాణ సముదాయం ఇలా

* ఇటీవల రూ. 7 లక్షలతో ఆవరణ బాగుచేయించారు. ఇందిరామార్కెట్‌లో 130 దుకాణాలకు వ్యాపారులకు లీజుకు ఇచ్చారు. వీటిద్వారా మండలపరిషత్తుకు కేవలం రూ.2 లక్షలు మాత్రమే ఆదాయం వస్తోంది. దుకాణాలు తీసుకున్న కొందరు వాటిని గోదాములుగా వినియోగిస్తూ వ్యాపారాలను మాత్రం బయట చేస్తున్నారు. దాదాపు రూ.60 లక్షలతో నిర్మించిన దుకాణాల సముదాయం వినియోగం అంతంతమాత్రంగానే ఉంది. వ్యాపారులంతా ఈ సముదాయంలో విక్రయాలు సాగించేలా చూడాలని భావిస్తున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అనుమతి కోరుతూ కలెక్టర్‌కు ప్రతిపాదన పంపారు. అనుమతి రాగానే ఈ ప్రక్రియ ఆరంభించేందుకు సిద్ధం చేస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు