logo

మిరప రైతు విలవిల

విలీన మండలాల్లో మిరప పంట ప్రధానమైంది. దీన్ని పండిస్తున్న రైతుల పరిస్థితి దయనీయంగా మారుతోంది.

Published : 09 Feb 2023 02:11 IST

ఎటపాక చింతూరు, న్యూస్‌టుడే

గౌరిదేవిపేటలో మిరప పొలం

విలీన మండలాల్లో మిరప పంట ప్రధానమైంది. దీన్ని పండిస్తున్న రైతుల పరిస్థితి దయనీయంగా మారుతోంది. పంటలకు చీడపీడలు ఆశించి అన్నదాతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. గోదావరి వరదలతో ఈ ఏడాది సాగు ప్రారంభం నుంచి సాగుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

వేలల్లో కౌలు చెల్లింపు..

గత రెండేళ్లుగా విలీన మండలాల్లో కౌలు రేట్లు కొండెక్కాయి. గత ఏడాది ఎకరాకు రూ.25 వేలు నుంచి రూ.40 వేలు వరకు చెల్లించేవారు. పంట దిగుబడి వస్తే కనీసం అప్పులు తీరతాయన్న ఆశతో రైతులు కౌలు చెల్లించి సాగుకు సిద్ధమయ్యారు. ఈ ఏడాది సాగు ఆలస్యం కావడంతో మరో దారి లేక రైతులు మిర్చి పంటపై ఆధారపడ్డారు. సాగు, సస్య రక్షణకు ఎకరాకు రూ.లక్షకు పైగా పెట్టుబడి పెట్టారు. తీరా పూత, కాత దశలో తామర, రసం పీల్చే పురుగులు, నల్లి దాడికి పంటలు పాడవుతున్నాయి.

గత ఏడాదీ ఇదే తీరు..

చింతూరు డివిజన్‌లోని ఎటపాక, కూనవరం, వరరామచంద్రాపురం మండలాల్లో అధిక విస్తీర్ణంలో మిరప సాగు చేస్తున్నారు. గత ఏడాది సైతం ఈ పంటను వేల ఎకరాల్లో సాగుచేశారు. పూత దశలో తామర తెగులు సోకడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. అధికారులు పరిశీలించి ఈ తెగుళ్లకు మందులు లేవని చెప్పారు. అంతంత మాత్రం దిగుబడి రావడంతో అప్పుల్లో ఇరుక్కున్నారు. ఈ ఏడాది ఇదే పరిస్థితి నెలకొనడంతో అన్నదాతలు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు.

దిగుబడి తగ్గుముఖం

మిరప దిగుబడి గత రెండేళ్లుగా గణనీయంగా తగ్గింది. సాధారణంగా ఎకరాకు సగటున 25 క్వింటాళ్లు వస్తుంది. పురుగుల దాడికి ఈ పరిస్థితి తారుమారైంది. గత ఏడాది ఎకరాకు కనీసం 10 నుంచి 15 క్వింటాళ్లు వస్తాయని ఆశించారు. తీరా కనీసం రెండంకెల సంఖ్య కూడా దాటలేదు. ప్రస్తుతం పురుగు ఉద్ధృతి పెరగడంతో ఎకరాకు సగటున 5 నుంచి 10క్వింటాళ్లు మించేలా లేదని రైతులు చెబుతున్నారు.


పొలంలో ఏర్పాటు చేసిన జిగురు అట్ట

మిరప పంటకు తామర, నల్లి రసం పీల్చే పురుగు ఆశించడంతో మొక్కలు కళావిహీనంగా మారుతున్నాయి. పూతలో సైతం అయిదు నుంచి పది పురుగులు ఉంటున్నాయి. ఇప్పటికే ఎకరాకు రూ.లక్షల్లో పెట్టుబడులు పెట్టారు. కనీసం పెట్టుబడులు వచ్చే పరిస్థితి లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాలుగు మండలాల్లో 5,680 ఎకరాల్లో మిరప సాగు చేస్తున్నారు.


అయిదు ఎకరాల్లో వదిలేశా..

ఈ ఏడాది 15 ఎకరాల్లో మిరప సాగు చేస్తున్నా. ప్రస్తుతం పంటకు తెగులు ఎక్కువగా సోకడంతో అయిదు ఎకరాలు పూర్తిగా దెబ్బతింది. దానికి ఇంకా ఎక్కువ పెట్టుబడి పెట్టినా ప్రయోజనం ఉండదని వదిలేశాను. మిగిలిన పది ఎకరాలు సాగు చేస్తున్నా. వాటికీ పురుగు సోకింది. ఎకరాకు రూ.లక్షల్లో పెట్టుబడి పెట్టా. దిగుబడి తగ్గితే తీవ్రంగా నష్టపోతాను.  

శ్రీనివాసరావు, మిరప రైతు, నెల్లిపాక


సూచనలు పాటించాలి

మిరప రైతులు విధిగా అధికారుల సూచనలు పాటించాలి. తెగుళ్ల భయంతో అధిక మోతాదులో ఎరువులు, పురుగు మందులు ఉపయోగించకూడదు. దాని వల్ల పంటలకు ఎక్కువ నష్టం. తామర పురుగు, నల్లి బెడద అధికంగా ఉంది. వీటి నివారణకు పొలాల్లో జిగురు అట్టలు, నీలం, పసుపు, తెలుపు రకాలు ఏర్పాటు చేసుకోవాలి. పది మీటర్ల దూరంలో వీటిని ఏర్పాటు చేసుకోవాలి. తద్వారా తామర పురుగు నల్లి జిగురు అట్టలకు అంటుకుని చనిపోతాయి. తామరపురుగు ఒక్కసారి వందల సంఖ్యలో గుడ్లు పెడుతుంది. దీనివల్ల పొలాల్లో సులువుగా విస్తరిస్తుంది. రైతులు అప్రమత్తంగా ఉండాలి.

కాశీవిశ్వనాథ చౌదరి, ఏడీఏ, రంపచోడవరం


 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు