logo

ఊరూరా దాహం కేకలే

వేసవి ప్రారంభంలోనే జిల్లాలోని ప్రతి ఊరిలో దాహం కేకలు వినిపిస్తున్నాయి. వేసవిలో నీటి కష్టాలు ఎదురవకుండా ఏటా ప్రత్యేక నిధులు విడుదలవుతూనే ఉన్నాయి.

Published : 06 Mar 2023 02:27 IST

వేసవి ముందే తాగునీటి సమస్య ఉద్ధృతం
పూర్తిస్థాయిలో గొంతు తడపని జల్‌జీవన్‌

పాడేరు పట్టణంలో తాగునీటికి మహిళల ఇక్కట్లు

వేసవి ప్రారంభంలోనే జిల్లాలోని ప్రతి ఊరిలో దాహం కేకలు వినిపిస్తున్నాయి. వేసవిలో నీటి కష్టాలు ఎదురవకుండా ఏటా ప్రత్యేక నిధులు విడుదలవుతూనే ఉన్నాయి. వీటితో సీజన్‌లో మొక్కుబడిగా మరమ్మతులు చేపట్టి ఆ తర్వాత ఆ పథకం ముఖం చూసేందుకు సైతం గ్రామీణ నీటి సరఫరా విభాగం ఇష్టపడడం లేదు. దీని ఫలితంగా నీటి పథకాలు మూన్నాళ్ల ముచ్చటగా మారిపోయాయి. సమగ్ర కార్యాచరణతో తాగునీటి పథకాలు వినియోగంలోకి తీసుకొచ్చి ఉంటే ఇబ్బందులు కొంత వరకైనా పరిష్కారమయ్యేవి.

పాత పాడేరు గ్రామంలో వృథాగా పడి ఉన్న పైపులు

పల్లెల్లో తాగునీటిని సరఫరా బాధ్యతలు పర్యవేక్షించేందుకు గ్రామీణ నీటిసరఫరా విభాగం (ఆర్‌డబ్ల్యూఎస్‌) ఉంది. గతంలో ప్రపంచబ్యాంకు ద్వారా ప్రతి మండల కేంద్రంలో రక్షిత పథకాలు నిర్మించారు. నిధుల లేమితో వీటిలో కొన్ని నిర్మాణాలు నిలిచిపోయాయి. ఆ తర్వాత సౌర విద్యుత్తు తాగునీటి పథకాలు 700 వరకు నిర్మించారు. సరైన పర్యవేక్షణ, నిర్వహణ సక్రమంగా లేక ఈ పథకం కూడా సత్ఫలితాలు ఇవ్వలేదు. తాజాగా జల జీవన్‌ మిషన్‌ ద్వారా ఇంటింటికీ కుళాయి ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టారు.

* ఇది కూడా చాలాచోట్ల అందుబాటులో ఉన్న పాత పథకానికే అనుసంధానం చేశారు. గతంలో విఫలమైన పథకాలకు తరచూ మరమ్మతులు వస్తున్నాయని... వాటికే జల్‌జీవన్‌ అనుసంధానం చేయడం వల్ల నిధులు ఖర్చు తప్ప ప్రయోజనం ఉండదని గ్రామస్థులు ఆమోదించడం లేదు. ఈ కారణంగా గ్రామాల్లో జల్‌జీవన్‌ నత్తనడకన సాగుతోంది.

పాత పాడేరుో ఆరు నెలలుగా బోరు వేసి వదిలేశారిలా..

సగానికి పైగా గ్రామాల్లో..

జిల్లా పరిధిలో పాడేరు, రంపచోడవరం, చింతూరు రెవెన్యూ మండలాలున్నాయి. మొత్తంగా 4500కు పైగా గ్రామాలున్నాయి. పాడేరు ఐటీడీఏ పరిధిలో 3576 గ్రామాలుండగా ఇందులో వెయ్యికి పైగా గ్రామాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని అధికారుల సర్వేలోనే వెల్లడైంది. ఇదే సమయంలో రంపచోడవరం, చింతూరు ఐటీడీఏ పరిధిలో 800 గ్రామాల వరకు ఉండగా, ఇందులో 300కు పైగా గ్రామాల్లో నీటి ఎద్దడి ఉంది.

* రంపచోడవరం రెవెన్యూ డివిజన్‌ పరిధిలో దేవిపట్నం పంచాయతీ తూనూరు గ్రామంలో ఏర్పాటు చేసిన సౌరవిద్యుత్తు పథకం ఏడాదిగా మరమ్మతులకు గురైనా సంబంధిత శాఖ అధికారులు పట్టించుకునే పాపాన పోలేదు. ఈ డివిజన్‌ పరిధిలో భూపతిపాలెం, ముసురుమల్లి జలాశయాల నుంచి కొన్ని ప్రాంతాలకే తాగునీరు సరఫరా అవుతోంది. చింతూరు ఐటీడీఏ పరిధిలో అటవీ ప్రాంతం ఎక్కువగా ఉండటంతో ఊటనీటినే వారు వినియోగించుకోవాల్సి వస్తోంది. లోతట్టు ప్రాంతాల్లో బోర్లు, బావులు ఎక్కువగా మరమ్మతులకు గురయ్యాయి. రంపచోడవరం డివిజన్‌ కేంద్రంలో తాగునీటి సమస్య అంతగా లేకపోయినా ఇతర ప్రాంతాల్లో నీటి సమస్య ఎక్కువగానే ఉంది.

* పాడేరు రెవెన్యూ డివిజన్‌ పరిధిలో వెయ్యికి పైగా గ్రామాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. పాడేరు పట్టణంలో 20 వేల జనాభా నివాసముంటున్నారు. ఇక్కడ పాత, కొత్త పథకాలతో కలుపుకొని నాలుగు వరకు రక్షిత పథకాలున్నాయి. ఇందులో నాలుగు దశాబ్దాల క్రితమే రూ. కోటి ఖర్చుతో పథకం నిర్మించారు. ఈ పథకం ద్వారా లోచలిపుట్టు, గుడివాడ, సినిమాహాల్‌ కూడలి, మసీదు కాలనీలకు తాగునీరు అందించాల్సి ఉంది.

* ప్రతి ఏటా మోదకొండమ్మ అమ్మవారి పండగ మూడు రోజులపాటు ఈ పథకాన్ని బాగుచేసి నీటి సరఫరా చేస్తారు. ఈ నీరూ తాగేందుకు ఉపయోగపడదు. ఈ పథకానికి ఏటా నిర్వహణ ఖర్చుల కింద రూ. 4 లక్షల వరకు వెచ్చిస్తారు. ఇప్పటికి పదేళ్లుగా ప్రతి ఏటా రూ.40 లక్షల వరకు వెచ్చించారు. అయినా ఏడాదిలో పట్టుమని నెల రోజులు కూడా నీరు రాదు. పట్టణంలో మిగతా మూడు పథకాల నుంచి వారంలో మూడు రోజులే ప్రజలకు నీరందుతోంది. అదీ అరకొరగానే. పట్టణవాసులందరికీ బయట మార్కెట్‌లో కొనుగోలు చేసిన నీరే ఆధారం.

* పాడేరు మండలం కొయ్యూరు, కక్కి, డోకులూరు, బడిమెల, కించూరు వంటి ప్రాంతాల్లో నీటి కొరత ఎక్కువగానే ఉంది. ఇదే మండలం కక్కి గ్రామంలో గతంలో రూ. 10 లక్షలతో ఓ పథకాన్ని నిర్మించారు. ఇది విఫలం కావడంతో జల్‌జీవన్‌ ద్వారా మరో రూ. 12 లక్షలు ఇదే పథకానికి మంజూరు చేశారు. ఈ పథకానికి నిధులు సరిపోవడం లేదని ట్యాంకు నిర్మాణం మధ్యలోనే గుత్తేదారు ఆపేశాడు. కొత్తగా నిధులొస్తేనే పథకం ముందుకెళ్తుంది. చింతపల్లి, కొయ్యూరు, గూడెంకొత్తవీధి మండల కేంద్రాల్లో పేరుకు రక్షిత పథకాలున్నా ప్రజల దాహార్తిని తీర్చడం లేదు. ఒక్క కొయ్యూరు మండల పరిధిలోనే 82 గ్రామాల్లో నీటి పథకాలు అందుబాటులో లేవు.  

* అరకులోయ నియోజకవర్గం పరిధిలో నీటి సమస్య ఉద్ధృతంగానే ఉంది. అరకులోయ పట్టణ పరిధిలో పట్టణ వాసులకు తాగునీరు పూర్తిగా అందడం లేదు. ముంచంగిపుట్టు మండలంలో 100కు పైగా గ్రామాల్లో నీటి పథకాల ఉనికే లేదు. మంచంగిపుట్టు మండలం కేంద్రానికి తాగునీరు అందించేందుకు సుజనకోట ప్రాంతంలో రక్షిత ప్రాజెక్టు నిర్మించారు. ఏడు గ్రామాలకు తాగునీరు ఇవ్వాల్సి ఉండగా సగం గ్రామాలకు కూడా పూర్తిస్థాయిలో నీరందడం లేదు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు