logo

‘అంగన్‌వాడీల అరెస్టులు అన్యాయం’

తమ న్యాయబద్ధమైన డిమాండ్లు నెరవేర్చాలని చలో విజయవాడకు పిలుపునిచ్చిన అంగన్‌వాడీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేయడం, నిర్బంధించడం తగదని ఆ సంఘం జిల్లా కార్యదర్శి భాగ్యలక్ష్మి, సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఉమామహేశ్వరరావు అన్నారు.

Published : 21 Mar 2023 01:20 IST

పాడేరు అంబేడ్కర్‌ కూడలిలో అంగన్‌వాడీ కార్యకర్తలు, సీఐటీయూ నేతల నిరసన

పాడేరు పట్టణం, న్యూస్‌టుడే: తమ న్యాయబద్ధమైన డిమాండ్లు నెరవేర్చాలని చలో విజయవాడకు పిలుపునిచ్చిన అంగన్‌వాడీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేయడం, నిర్బంధించడం తగదని ఆ సంఘం జిల్లా కార్యదర్శి భాగ్యలక్ష్మి, సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఉమామహేశ్వరరావు అన్నారు. సోమవారం జిల్లా కేంద్రం పాడేరులో నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కొంతకాలంగా తమ సమస్యలు పరిష్కరించాలని ఆందోళన చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం కనీసం స్పందించడం లేదని చెప్పారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా విజయవాడలో ధర్నాకు పిలుపునిచ్చామని, ఇదేదో నేరంగా రాష్ట్ర ప్రభుత్వం భావించి ఎక్కడికక్కడ సీఐటీయూ నాయకులు, అంగన్‌వాడీ కార్యకర్తలను గృహ నిర్బంధం  చేయడం అన్యాయమన్నారు. ఉద్యమాలను అణగదొక్కితే గత ప్రభుత్వాలకు పట్టిన గతే ఈ ప్రభుత్వానికీ పడుతుందని హెచ్చరించారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ కార్యకర్తల సంఘ నేతలు అంబికా, చిన్నారి, దేవి, ఇంద్ర, సత్యవతి, సీఐటీయూ నాయకులు సుందరరావు తదితరులు పాల్గొన్నారు.

నిరంకుశ వైఖరి విడనాడాలి

చింతూరు: వైకాపా ప్రభుత్వం నిరంకుశ వైఖరిని విడనాడాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లపు వెంకట్‌ పేర్కొన్నారు. సోమవారం చింతూరు ఐటీడీఏ కార్యాలయం ఎదుట అంగన్‌వాడీ కార్యకర్తలతో కలిసి సీఐటీయూ నేతలు నిరసన చేపట్టారు. న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరిన వారిపై ప్రభుత్వం జులుం ప్రదర్శిస్తోందని చెప్పారు. అనంతరం అధికారులకు వినతిపత్రం అందించారు. నాయకులు ఎర్రంశెట్టి శ్రీనివాస్‌, పొడియం లక్ష్మణ్‌, పొడియం సావిత్రి, వెంకటరమణ, అన్నపూర్ణ, కామేశ్వరి పాల్గొన్నారు.

చింతూరులో పీఓకు వినతిపత్రమిస్తున్న సీఐటీయూ నాయకులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని