logo

గిరి గ్రామాల్లో దాహం కేకలు

ఏజెన్సీ ప్రాంతంలో మంచినీటి పథకాలు మరమ్మతులకు గురవుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడంలేదు. వేసవి ప్రారంభమవడంతో తాగునీటికి గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Published : 21 Mar 2023 01:20 IST

రంపచోడవరం, న్యూస్‌టుడే

వరలు కుంగిపోయిన బావి

ఏజెన్సీ ప్రాంతంలో మంచినీటి పథకాలు మరమ్మతులకు గురవుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడంలేదు. వేసవి ప్రారంభమవడంతో తాగునీటికి గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

రంపచోడవరం మండలం లోతట్టు గ్రామం కింటుకూరులో 30 గిరిజన కుటుంబాలు నివసిస్తున్నాయి. ఇక్కడ రెండు చేతిపంపులు ఉన్నాయి. ఇందులో ఒకటి మరమ్మతులకు గురైంది. మరో బోరు ద్వారా ఎర్ర నీరు వస్తోంది. రెండేళ్ల క్రితం రూ.5 లక్షలతో ఆర్‌డబ్ల్యూఎస్‌ ఆధ్వర్యంలో సోలార్‌ మంచినీటి పథకాన్ని ఏర్పాటు చేశారు. పట్టుమని మూడు నెలలు కూడా గడవకుండానే అది మరమ్మతులకు గురై చుక్కనీరు కూడా రాకుండా నిరుపయోగంగా మారింది. చేతిపంపులు, సోలార్‌ పథకం పాడవడంతో కొండకాలువ వద్ద చెలమలు తవ్వుకొని గిరిజనులు తాగునీటిని తెచ్చుకొంటున్నారు.

* మారేడుమిల్లి మండలం లోతట్టు ప్రాంతం శ్రీపురంలో తాగునీటికి స్థానికులు అల్లాడుతున్నారు. గతంలో గ్రామంలో రెండు ట్యాంకులను ఏర్పాటు చేసి సత్యసాయి పథకం ద్వారా నీటిని సరఫరా చేసేవారు. ఈ పథకం పాడవడంతో ఏడాదిగా తమ గ్రామానికి నీటి సరఫరా ఆగిందని స్థానికులు చెబుతున్నారు.

ముంచంగిపుట్టు: వనబసింగి పంచాయతీ కొత్తూరులో ప్రజలు తాగునీటి కోసం అల్లాడుతున్నారు. గ్రామంలో సౌర విద్యుత్తు ఆధారంగా పనిచేసే నీటి పథకం మూలకు చేరి మూడేళ్లయినా మరమ్మతులు చేపట్టలేదు. గ్రామంలో బావిలో ఒరలు కుంగి లోపలికి పడిపోయాయి. గ్రామంలోని బోరు మూలకు చేరింది. దీంతో గ్రామంలోని 30 కుటుంబాల ప్రజలు గ్రామం నుంచి కి.మీ. దూరంలో ఉన్న గెడ్డ ఊటనీరు వినియోగిస్తున్నారు. పాడేరు వెళ్లే ప్రధాన రోడ్డు దాటుకుని పొలాల వద్దకు వెళ్లి ఊట నీరు వినియోగించుకుంటున్నామని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీటి పథకాన్ని వినియోగంలోనికి తేవాలని గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో అధికారులు విన్నవించి, ఆరు నెలలు గడుస్తున్నా మరమ్మతులు చేపట్టలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

కింటుకూరులో మరమ్మతులకు గురైన సోలార్‌ నీటి పథకం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని