logo

3 రోజులే అమృత్‌ ఘడియలు

కేంద్ర ప్రభుత్వం కొత్తగా అమృత్‌ జలధార, యంగ్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌ అనే రెండు పథకాలను ఇటీవల తీసుకువచ్చింది.

Updated : 24 Mar 2023 06:33 IST

దళిత రైతుల రుణాల దరఖాస్తుకు అతికొద్ది గడువు
నిరుద్యోగులకూ ఇదే సమస్య
ఈనాడు డిజిటల్‌, అనకాపల్లి

 

గత ప్రభుత్వహయాంలో ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా అందించిన ట్రాక్టర్‌ (పాతచిత్రం)

కేంద్ర ప్రభుత్వం కొత్తగా అమృత్‌ జలధార, యంగ్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌ అనే రెండు పథకాలను ఇటీవల తీసుకువచ్చింది. దళిత రైతులు, నిరుద్యోగులు జీవితంలో నిలదొక్కుకునేలా రూ. 50 వేల నుంచి రూ. 60 వేల రాయితీతో రుణాలివ్వడానికి ముందుకొచ్చింది. అయితే ఆయా పథకాలకు దరఖాస్తు చేసుకోవడమే ఇప్పుడు సమస్యగా మారింది.

ఈనెల మొదటి వారంలోనే పథకాలు అందుబాటులోకి వచ్చినా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ ఉందని ఇప్పటి వరకు వెల్లడించలేదు. ఈనెల 20న ఈ పథకాల గురించి జిల్లా అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. వీటికి ఈనెల 27లోగా దరఖాస్తు చేసుకుంటేనే అర్హులని ప్రకటించారు. నాలుగేళ్ల తర్వాత రాయితీ రుణాలిస్తున్నారనే సంతోషం కంటే వాటికి దరఖాస్తు చేసుకోవడానికి అమృత కాలం దాటిపోతుండడంతో రైతులు, నిరుద్యోగుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

అన్నదాతల సాగునీటి ఇబ్బందులు తీర్చేందుకు గత ప్రభుత్వ హయాంలో ఎన్టీఆర్‌ జలసిరి పథకం పేరుతో బోర్లు తవ్వి.. సౌర విద్యుత్తుతో మోటార్లు అందించారు. వైకాపా ప్రభుత్వం వచ్చాక ఆ పథకాన్ని వైఎస్‌ఆర్‌ జలకళగా మార్చి అమలులోకి తెచ్చారు. అయితే ఈ నాలుగేళ్లలో ఈ పథకం ద్వారా ఒక్క రైతు కూడా లబ్ధి పొందలేదు. బోరు వేస్తే, విద్యుత్తు కనెక్షన్‌ ఇవ్వలేదు.. విద్యుత్తు ఇస్తే మోటార్లు ఇవ్వలేదు.. దీంతో ఏ రైతు కూడా జలకళ ద్వారా నీటిని పంటకు పెట్టుకోలేకపోయారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం అమృత్‌ జలధార పథకం ద్వారా ఎస్సీ రైతులకు రూ. లక్ష రుణంతో బోరు వేసుకునే సదుపాయాన్ని కల్పించింది. అందులో ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా రూ. 50 వేలు రాయితీ కాగా, మిగతా రూ. 50 వేలు బ్యాంకు రుణంగా ఇప్పించనున్నారు. కనీసం 2.5 ఎకరాలున్న రైతులే అర్హులు. వైఎస్‌ఆర్‌ జలకళతో విసిగిపోయిన రైతులకు అమృత్‌ జలధార కొంత ఊరడింపుగానే ఉంది. కాకపోతే ఈ పథకం గురించి 20వ తేదీన చెప్పి 27లోగా దరఖాస్తు చేసుకోవాలని గడువుపెట్టడం రైతులను కలవరపెడుతోంది.

పట్టాదారు పాసుపుస్తకాలు, ఆధార్‌, కుల ధ్రువీకరణ పత్రం, బ్యాంకు ఖాతా నెంబర్‌ వంటి వివరాలతో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. అధికారులు చెప్పిన వారం రోజుల గడువులో ఒకరోజు ఉగాది, మరో రోజు ఆదివారం సెలవులున్నాయి. అంటే దరఖాస్తుకు కేవలం అయిదు రోజులే అవకాశం ఇవ్వడం వల్ల ఈ అమృత్‌ జలధారను అందుకోవడం కష్టమేనని సంబంధిత శాఖలోనే చర్చనీయాంశం అవుతోంది.

ఆటోలు, ట్రాక్టర్లు, కిరాణా దుకాణాలు, ఫొటో స్టూడియో, టెంట్‌ హౌస్‌, మెడికల్‌ క్లినికల్‌ ల్యాబ్‌, ఫ్యాన్సీ దుకాణం వంటి వాటితో స్వయం ఉపాధిని పొందడానికి వీలుగా రూ.3 లక్షల వరకు బ్యాంకు రుణం ఇవ్వనున్నారు. ఇందులో రూ. 60 వేల రాయితీ సదుపాయం కల్పించారు. ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి కూడా ఈనెల 27నే గడువుగా పేర్కొన్నారు.


సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోండి
ఈ విషయమై ఎస్సీ కార్పొరేషన్‌

ఈడీ రమణమూర్తి వద్ద ప్రస్తావించగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి కారణంగా పథకం ప్రకటించడంలో ఆలస్యమైందన్నారు..దరఖాస్తు గడువు పొడిగింపుపై ఎలా సమాచారం లేదన్నారు. అన్ని గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకునేందుకు వీలు కల్పించినట్లు చెప్పారు.

అంతా అయిదారు రోజుల్లోనే...

రాష్ట్ర ప్రభుత్వం గత నాలుగేళ్లలో నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి రుణాలేవీ ఇవ్వలేదు. కేంద్ర ప్రభుత్వమే ఇప్పుడు యంగ్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌ స్కీమ్‌ (వైఈఎస్‌-యస్‌) పేరుతో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన 21 ఏళ్ల నుంచి 48 ఏళ్లలోపు నిరుద్యోగ యువతకు రాయితీ రుణాలను అందించాలని నిర్ణయించింది.

చాలా కాలంగా రుణాల కోసం

ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఈ పథకం ఓ సదవకాశమే అయినా దరఖాస్తు చేసుకోవడానికి తగినంత సమయం ఇవ్వకపోవడంతో తీవ్ర నిరాశతో ఉన్నారు. అవసరమైన ధ్రువపత్రాలతో, బ్యాంకర్లను కలిసి రుణాలకు ఒప్పించడం అయిదారు రోజుల్లో జరిగే పని కాదని నిరుద్యోగ యువత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని