logo

కొండవాగులపై వంతెనలు కలేనా?

గిరిజనులు అనారోగ్యానికి గురైతే అత్యవసర పరిస్థితుల్లో వైద్య సేవలకు ఆసుపత్రికి తీసుకెళ్లలేని పరిస్థితులు నెలకొన్నాయి.

Published : 24 Mar 2023 02:35 IST

రంపచోడవరం, న్యూస్‌టుడే

రాజవొమ్మంగి శివారున వట్టిగడ్డ జలాశయం నుంచి పొంగి ప్రవహిస్తున్న వాగు (పాతచిత్రం)

గిరిజనులు అనారోగ్యానికి గురైతే అత్యవసర పరిస్థితుల్లో వైద్య సేవలకు ఆసుపత్రికి తీసుకెళ్లలేని పరిస్థితులు నెలకొన్నాయి. కొన్ని సందర్భాలలో వైద్యం అందక మృతి చెందిన ఘటనలు చోటుచేసుకున్నాయి.

ఏజెన్సీ ప్రాంతంలో కొండ కాలువలపై వంతెనల నిర్మాణం కలగా మిగిలింది. వర్షాకాలం వచ్చిందంటే వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తాయి. దీంతో గిరిజనుల రాకపోకలు స్తంభించిపోతాయి. కొన్నిచోట్ల కాలువలపై కర్రలతో వంతెనలు నిర్మించుకొని గిరిజనులు రాకపోకలు సాగిస్తున్నారు.  

వర్షాకాలంలో నిత్యావసర సరకులు తెచ్చుకునేందుకు మండల కేంద్రాలు, వారపు సంతలకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొండవాగులపై వంతెనలు నిర్మించి ఇబ్బందులను తొలగించాలని ఏళ్లతరబడి గిరిజనులు వేడుకొంటున్నా వీరి మొర ఆలకించే పరిస్థితి లేదు. దీనిపై అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వాగులపై వంతెన నిర్మాణాలకు చర్యలు చేపట్టాలని ఆయా గ్రామాల గిరిజనులు కోరుతున్నారు.

పెద్దూరు-దొరచింతలపాలెం, సున్నంపాడు-నూరుపూడి మధ్యలో ఉన్న వాగులు వర్షాకాలంలో పొంగి ప్రవహిస్తాయి. దీంతో డి.వెలమలకోట, తాడేపల్లి, దొరచింతలపాడు పంచాయతీలకు చెందిన ప్రజల రాకపోకలు నిలిచిపోతాయి. నెల్లిమట్ల వద్ద చిన్నూరు వాగుపై వంతెన నిర్మించాలని 15 గ్రామాలకు చెందిన ప్రజలు ఏళ్ల తరబడి వేడుకొంటున్నారు. వట్టిగడ్డ జలాశయం వల్ల రాజవొమ్మంగి శివారున పొర్లు కాలువ పొంగి ప్రవహిస్తుంది. దీనిపై వంతెన ఏర్పాటు చేయాలని ఆరు గ్రామాల ప్రజలు కోరుతున్నారు. తంటికొండ ప్రధాన రహదారి నుంచి గింజర్తి వెళ్లే మార్గంలో వంతెన లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని