logo

ఉచిత చికిత్స దాతల చేయూత

చికిత్స చేయగలిగిన వ్యాధే అయినా క్షయ ఇప్పటికీ ప్రాణాంతకంగానే ఉంటోంది. పలువురు మృత్యువాత పడటానికి కారణమవుతోంది.

Published : 24 Mar 2023 02:35 IST

చింతపల్లి గ్రామీణం, అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే

చికిత్స చేయగలిగిన వ్యాధే అయినా క్షయ ఇప్పటికీ ప్రాణాంతకంగానే ఉంటోంది. పలువురు మృత్యువాత పడటానికి కారణమవుతోంది. విస్తృత పరీక్షలు, పూర్తిస్థాయి చికిత్స అందించడం ద్వారా ఈ వ్యాధి నియంత్రణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. శుక్రవారం ప్రపంచ క్షయ నివారణ దినం సందర్భంగా జిల్లాలో ఈ వ్యాధికి అడ్డుకట్ట వేసేందుకు తీసుకుంటున్న ప్రత్యేక చర్యలపై ‘న్యూస్‌టుడే’ కథనం.

మనదేశంలో 1962లో తొలిసారి జాతీయ క్షయ నివారణ కార్యక్రమం చేపట్టారు. 1998లో కొన్ని మార్పులు చేసి సవరించిన కార్యక్రమంగా చేపట్టారు. 2020 నుంచి జాతీయ క్షయ నిర్మూలన కార్యక్రమం (ఎన్‌టీఈపీ) రూపొందించారు.
క్షయరహిత సమాజ స్థాపనే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అందుకే టీబీ సోకినవారికి ఉచితంగా మందులు అందిస్తోంది. దీంతో రోగులు కోలుకోవడానికి అవసరమైన పోషకాహారం సైతం ఉచితంగా సమకూరుస్తున్నారు. ఇందుకోసం దాతల చేయూత తీసుకుంటున్నారు.

ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన టీబీ ముక్తభారత్‌ పిలుపులో భాగంగా వ్యాధి సోకినవారికి పోషకాహారానికి అవసరమయ్యే డబ్బు విరాళాలుగా ఇవ్వడానికి దాతలు ముందుకు వస్తున్నారు. అనకాపల్లి జిల్లాలో వివిధ పరిశ్రమల నిర్వాహకులు కార్పొరేట్‌ సామాజిక సేవా బాధ్యతలో (సీఎస్‌ఆర్‌) భాగంగా ఒక్కో రోగికి పోషకాహారం కోసం రూ. 700 చొప్పున అవసరమైన నగదు సహాయం ఇటీవల అందజేశారు. 771 మందికి ఈ నగదుతో పోషకాహారం అందించనున్నారు.

వ్యాధి లక్షణాలు

రెండువారాలకు మించి జర్వం, దగ్గు, నోటి నుంచి రక్తంతో కూడిన కళ్లె పడడం, క్రమేపీ బరువు తగ్గడం, ఛాతి ఎక్స్‌రేలో తేడాలు వ్యాధి ప్రధాన లక్షణాలు ఈ వ్యాధి ముఖ్యంగా ఊపిరితిత్తులకు సోకుతుంది. దీంతోపాటు శరీరంలోని ఏ భాగానికైనా సోకే అవకాశం ఉంది. గాలి ద్వారా ఒకరి నుంచి మరొకరికి సోకుతుంది. సాధారణ మైక్రోస్కోప్‌, ఎక్స్‌రే, ఆర్‌టీపీసీఆర్‌, ఆధునిక బీనాట్‌ మిషన్‌, పాథో లాజికల్‌ పరీక్షల ద్వారా నిర్ధారిస్తారు.
* అనకాపల్లి జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో  క్షయవ్యాధి గుర్తింపు పరీక్షలు చేస్తున్నారు.
* జిల్లాలో 25 కళ్లె పరీక్ష కేంద్రాలు ఉన్నాయి. మైదాన ప్రాంతాల్లో లక్ష జనాభా, మన్యంలో 50 వేల మంది జనాభాకు వీరు సేవలు అందిస్తున్నారు.  అనకాపల్లి, నర్సీపట్నంలో రెండు సీబీ నాట్‌ పరికరాల ద్వారా కళ్లె, శరీరంలోని ఇతర భాగాల నుంచి నమూనాలు సేకరించి పరీక్షలు చేస్తున్నారు.


ఆరు నెలలు ఉచిత మందులు

క్షయ సోకినట్లు గుర్తించిన రోగికి ఆరు నెలల పాటు ఉచితంగా మందులు అందిస్తాం. ఈ వ్యాధి లక్షణాలతో వచ్చిన వ్యక్తికి ముందస్తుగా సామాజిక ఆసుపత్రిలో ట్రూనాట్‌ పరికరంతో కళ్లె పరీక్ష చేస్తాం. వ్యాధి ఉన్నట్లు తేలితే ఆరు నెలల పాటు డైరెక్ట్‌ అబ్జర్వేషన్‌ ట్రీట్‌మెంట్‌ (డాట్‌) పద్ధతి ద్వారా ఆశా కార్యకర్తల సహాయంతో రోగికి రోజూ క్రమం తప్పకుండా మందులు ఇస్తాం. ఆరు నెలల్లో స్వస్థత పొందేందుకు పోషకాహారం కోసం ప్రతీ నెలా రూ. 500 ఆర్థిక సహాయం కూడా చేస్తున్నాం. టీబీ సోకిన వ్యక్తికి ఇతరత్రా వైద్య పరీక్షలు అవసరమైతే కేజీహెచ్‌కి పంపుతాం. ఇంకా అవసరమైతే విశాఖ ఛాతి వ్యాధుల ఆసుపత్రికి తరలించి ఆధునిక చికిత్స అందించి రోగి  కోలుకోవడానికి కావాల్సిన సహకారం అందిస్తాం.
మారమ్మ, వైద్యాధికారి, టీబీ నివారణ, లంబసింగి


12 కేంద్రాల్లో అత్యాధునిక పరికరాల్లో గుర్తింపు పరీక్ష నిర్వహిస్తున్నారు.


గతేడాది 44,582 మందికి పరీక్షలు చేయగా, 2249 మందికి వ్యాధి ఉందని తేలింది.


ఈ ఏడాది ఇంతవరకు 6,741 మందికి పరీక్షలు చేయగా 505 మందికి నిర్ధారణ అయింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని