logo

భీమిలిలో మ్యూజిక్‌ రికార్డింగ్‌ స్టూడియో నిర్మించాలనుకుంటున్నా

కవులు, కళాకారులకు పుట్టినిళ్లు ఆంధ్రప్రదేశ్‌ అని సినీ సంగీత దర్శకులు ఎస్‌.ఎస్‌.తమన్‌ అన్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం, సెయింట్‌ లుక్స్‌ సంస్థ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఆడియో ఇంజినీరింగ్‌, మ్యూజిక్‌ ప్రొడక్షన్‌ స్టూడియోని ఆయన ఆదివారం ప్రారంభించి మాట్లాడారు.

Updated : 27 Mar 2023 05:25 IST

సంగీత దర్శకుడు తమన్‌

ఏయూ స్టూడియోలో సినీ సంగీత దర్శకులు ఎస్‌.ఎస్‌.తమన్‌, వీసీ ఆచార్య ప్రసాదరెడ్డి, తదితరులు

ఏయూ ప్రాంగణం, న్యూస్‌టుడే : కవులు, కళాకారులకు పుట్టినిళ్లు ఆంధ్రప్రదేశ్‌ అని సినీ సంగీత దర్శకులు ఎస్‌.ఎస్‌.తమన్‌ అన్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం, సెయింట్‌ లుక్స్‌ సంస్థ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఆడియో ఇంజినీరింగ్‌, మ్యూజిక్‌ ప్రొడక్షన్‌ స్టూడియోని ఆయన ఆదివారం ప్రారంభించి మాట్లాడారు. విశాఖ కేంద్రంగా ఇంతటి భారీ స్టూడియో నిర్మాణం చేయడం అభినందనీయమన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రఖ్యాత కవులు, నటులు, సంగీత కళాకారులకు జన్మస్థలమన్నారు. ఇక్కడి భాష, యాస తనకు ఎంతో స్ఫూర్తిని అందిస్తాయన్నారు. తన విశ్రాంత జీవితాన్ని విశాఖ నగరంలో గడపడానికి ఇష్టపడతానన్నారు. భీమిలిలో తాను మ్యూజిక్‌ రికార్డింగ్‌ స్టూడియో నిర్మించే ఆలోచన ఉందన్నారు. విద్యార్థుల కోరిక మేరకు ‘నిన్నిలా... నిన్నిలా చూశానే’ పాట పాడి వినిపించారు. వీసీ ఆచార్య పి.వి.జి.డి.ప్రసాదరెడ్డి మాట్లాడుతూ.. తొలిదశలో రూ.3.5 కోట్లు వెచ్చించి రికార్డింగ్‌ స్టూడియో, ప్రాక్టికల్‌ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని.. విద్యార్థులు సంగీత రంగంలో రాణించడానికి అవసరమైన కోర్సులను అందిస్తామన్నారు. అన్ని విభాగాల విద్యార్థులు ఈ కోర్సులను చేసే విధంగా అవకాశం కల్పిస్తామన్నారు. ఏయూ తరఫున తమన్‌ను సత్కరించారు. కార్యక్రమంలో ఆచార్య సరస్వతి విద్యార్థి, జేమ్స్‌ స్టీఫెన్‌, టి.షారోన్‌రాజు, ఎ.కె.ఎం. పవార్‌, సెయింట్‌ లూక్స్‌ సంస్థ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని