logo

మెదడు మధించి.. మదిని గెలిచి!

రేపటి పౌరులుగా ఎదుగుతున్న నేటి పిల్లల్లో మనస్తత్వం అభివృద్ధి చేయడం లక్ష్యంగా ఈ విద్యా సంవత్సరంలో జిల్లాలోని 139 పాఠశాలల్లో చేపట్టిన ప్రత్యేక కార్యక్రమం సత్ఫలితాలిస్తోంది.

Published : 27 Mar 2023 04:38 IST

రాష్ట్రస్థాయికి రెండు నమూనాల ఎంపిక
- నర్సీపట్నం గ్రామీణం, న్యూస్‌టుడే

రేపటి పౌరులుగా ఎదుగుతున్న నేటి పిల్లల్లో మనస్తత్వం అభివృద్ధి చేయడం లక్ష్యంగా ఈ విద్యా సంవత్సరంలో జిల్లాలోని 139 పాఠశాలల్లో చేపట్టిన ప్రత్యేక కార్యక్రమం సత్ఫలితాలిస్తోంది.

పిల్లల భవిష్యత్తుకు ఊతమిచ్చేలా రూపుదిద్దుకున్న 403 ప్రాజెక్టులు ఈ నెల 20న అనకాపల్లిలో ప్రదర్శనకు ఉంచగా.. వాటిలో పది జిల్లా స్థాయి పోటీలకు ఎంపికయ్యాయి.

...వీటిలో నర్సీపట్నం మండలం చెట్టుపల్లి, పాయకరావుపేట హైస్కూళ్ల నమూనాలను రాష్ట్ర స్థాయి ప్రదర్శనకు ఎంపిక చేశారు. 215 మంది గైడ్‌ టీచర్ల మార్గదర్శకంలో 13,151 మంది తొమ్మిదో తరగతి విద్యార్థులు ఈ నమూనాల తయారీలో భాగస్వామమయ్యారు.

రాష్ట్రస్థాయి ప్రదర్శన ఈ నెల 28న విజయవాడలో జరగనుంది.

ఎంపికైన ప్రాజెక్టులు ఇలా..

నర్సీపట్నం మండలం చెట్టుపల్లి జడ్పీ పాఠశాలకు చెందిన విద్యార్థులు నీలం గీతిక, కలిమి బుజ్జి, నవర జస్వంత్‌ పారిశుద్ధ్య కార్మికులను దృష్టిలో పెట్టుకుని ‘ఆరోగ్య రాయబారి కవచం’ తయారు చేశారు. పారిశుద్ధ్య కార్మికులు సాధారణంగా దుర్గంధభరితమైన పరిసరాల్లో పనిచేస్తుంటారు. దుర్గంధం భరించేందుకు కొందరు గుట్కా, ఖైనీ, మద్యానికి అలవాటు పడుతుంటారు. సురక్షితంగా ఉండేందుకు ఎన్‌-95 మాస్క్‌ వాడాలంటే మార్కెట్‌లో రూ.60 నుంచి రూ.150 వరకు ఖర్చు చేయాలి. ఇంత మొత్తాన్ని వెచ్చించే పరిస్థితి వీరికి లేనందున సాధారణ మాస్కులకే క్రిములను ఎదుర్కొనే వేపనూనె, సువాసన ఇచ్చే నిమ్మగడ్డి ద్రావణాన్ని పిచికారీ చేయడం ద్వారా తక్కువ ఖర్చుతోనే రక్షణ పొందవచ్చంటూ నమూనా తయారు చేశారు. గైడ్‌ టీచర్‌గా ఏవీ రాజగోపాల్‌ వ్యవహరించారు. కేవలం రూ.48 ఖర్చుతో వంద మి.లీ. ద్రావణాన్ని వీరు తయారు చేసి వినియోగించారు. దీన్ని అనేక మాస్క్‌లపై పిచికారీ చేసుకోవచ్చు.

పాయకరావుపేట విద్యార్థులను అభినందిస్తున్న అధికారులు

వాహన చోదకులను నిద్రమత్తు నుంచి అప్రమత్తం చేయడానికి వీలుగా ‘అటెన్షన్‌ వార్నింగ్‌ సిస్టమ్‌’ పేరిట పాయకరావుపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు కె.దుర్గాప్రసాద్‌, కె.దుర్గాస్వామి సాధారణ కళ్లద్దాలను ఆధునికీకరించారు. గైడ్‌ టీచర్‌గా ఎ.దొరబాబు వ్యవహరించారు. 2021లో దేశంలో 4,12,482 రోడ్డు ప్రమాదాల్లో 1,53,972 మంది మరణించడం, 3,84,448 మంది గాయపడటం ఈ బృందం పరిగణనలోకి తీసుకుంది. ఎక్కువ ప్రమాదాలు డ్రైవర్లు అలసట, పరధ్యానం, అతివేగం కారణంగా జరుగుతున్నట్లు గుర్తించారు. ప్రమాదాల్లో మరణించే వారిలో 67 శాతం మంది 18-45 సంవత్సరాల మధ్య వయసు వారే కావడం గమనార్హం. ప్రస్తుతం మార్కెట్‌లో నిద్రమత్తు అధిగమించేలా, డ్రైవర్లను అప్రమత్తం చేసే పరికరాలు ధరలు రూ.25 వేల వరకు ఉన్నాయి. దీంతో వీరు తక్కువ ఖర్చుతో పరికరాన్ని తయారు చేయాలని నిర్ణయించారు. బజర్‌, వైబ్రేటర్‌, మెర్కురీ, బ్యాటరీ తదితరాలను వినియోగించి సాధారణ కళ్లద్దాలను అటెన్షన్‌ వార్నింగ్‌ సిస్టమ్‌గా అభివృద్ధి చేశారు. ఈ కళ్లద్దాలకు రూ.150 మాత్రమే ఖర్చవుతుందని గైడ్‌ టీచర్‌ దొరబాబు పేర్కొన్నారు.

ఆరోగ్య రాయబారి కవచం తయారు చేసిన చెట్టుపల్లి విద్యార్థులు


భవిష్యత్తుకు మార్గదర్శిగా.. : విద్యార్థి దశ నుంచే పిల్లల మనస్తత్వం అభివృద్ధి చేయాలన్నది ఉన్నతాధికారుల ఆదేశం. తదనుగుణంగా ఈ కార్యక్రమంలో అందరూ ఉత్సాహంగా పాల్గొంటున్నారు. చార్టుల ద్వారా తమ ప్రాజెక్ట్‌ను వివరిస్తారు. జిల్లా, రాష్ట్ర స్థాయి ఎక్స్‌పోలు విద్యార్థులను ఎంతగానో చైతన్యం చేస్తాయి. భవిష్యత్తులో రాణించేందుకు మార్గదర్శకంగా ఉపయోగపడతాయి.

ఏవీ రాజగోపాల్‌, గైడ్‌ టీచర్‌, చెట్టుపల్లి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు