logo

మన్యంపై మమకారం

కనీస వసతులకు దూరంగా బతుకుతున్న గిరిజనులకు కావాల్సిన సదుపాయాలు కల్పనకు ఓ స్వచ్ఛంద సంస్థ ముందడుగు వేసింది.

Published : 27 Mar 2023 04:38 IST

చింతూరు, న్యూస్‌టుడే

చింతూరు ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన కుర్చీలు

కనీస వసతులకు దూరంగా బతుకుతున్న గిరిజనులకు కావాల్సిన సదుపాయాలు కల్పనకు ఓ స్వచ్ఛంద సంస్థ ముందడుగు వేసింది. మన్యంపై మమకారంతో రూ.లక్షలు వెచ్చించి ఆసుపత్రులు, పాఠశాలల్లో వసతుల కల్పనకు తమ వంతు కృషి చేస్తోంది. హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న సమారిటన్స్‌ ఫర్‌ ది నేషన్‌ సంస్థ అందిస్తున్న సేవలు గిరిజనులకు ఊరటనిస్తున్నాయి. ఈ సంస్థ ఇటీవల చింతూరు ప్రాంతీయ ఆసుపత్రి అభివృద్ధికి రూ. లక్షలు వెచ్చించింది. చింతూరు ఒడ్డులో, పావురులంకలోని పాఠశాలలకు అదనపు గదులు నిర్మించి విద్యార్థులకు వసతి కల్పించింది. ఇప్పటివరకు చింతూరు ఏరియా ఆసుపత్రిలో రక్త పరీక్షలు చేసేందుకు సరైన సదుపాయం లేదు. గతంలో ఈ సంస్థ సీఈఓ ఆసుపత్రికి వచ్చినప్పుడు ఇక్కడి సమస్యలను గుర్తించి పలు రక్తపరీక్షలు చేసే అధునాతన పరికరాలు సమకూర్చారు. బయో కెమిస్ట్రీ ఎనలైజర్‌ ల్యాబ్‌ను అమర్చారు. కాలేయం పనితీరు, చక్కెర, లిపిడ్‌ ప్రొఫైల్‌ పరీక్షలు చేసేందుకు ఇది ఉపయోగపడుతుంది. సాధారణ రక్తపరీక్షలు చేసేందుకు సెల్‌ కౌంటర్‌ పరికరాన్ని ఏర్పాటుచేశారు. దీంతో సుమారు 12 రకాల రక్తపరీక్షలు చేయవచ్చు. రక్తకణాల శాతాన్ని, రక్త ఫలకికలను లెక్కించవచ్చు. అంతేకాకుండా రోగుల సౌకర్యం కోసం ప్రత్యేకంగా రెండు షెడ్లు నిర్మించారు. రోగులు కూర్చునేందుకు 40 కుర్చీలు, మంచాలు ఏర్పాటు చేశారు. కొవిడ్‌ సమయంలో ఈ ప్రాంతంలో రోగుల కోసం 20 ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లను అందుబాటులో ఉంచారు. మెడిసిన్‌ కిట్లు, శానిటైజర్లు, మాస్కులు అందజేశారు.

పాఠశాలల పునః నిర్మాణం

మండలంలోని పలు పాఠశాలలకు అదనపు గదులు నిర్మించడంతోపాటు మరమ్మతులకు గురైన గదులను పునః నిర్మించారు. పావురులంక, గొడ్లగూడెం, చింతూరు శబరి ఒడ్డు పాఠశాలలను పునః నిర్మించారు.

వరద బాధితులకు..

గత ఏడాది ఆగస్టు నెలలో సంభవించిన వరదలతో నిరాశ్రయులైన బాధితులకు తమ వంతు సంస్థ చేయూత అందించింది. సుమారు 32 గ్రామాల్లోని బాధితులకు టార్పాలిన్లు, నిత్యావసర సరకులు, మందులు, సోలార్‌ దీపాలు అందించి ఆదుకున్నారు.


గిరిజనులకు మావంతు సహకారం

చింతూరు ప్రాంతీయ ఆసుపత్రికి గతంలో వచ్చినప్పుడు రోగులు వైద్యసేవల కోసం నిల్చుని ఉండాల్సిన పరిస్థితిని గమనించా. రక్త పరీక్షల సామగ్రి లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్న తెలుసుకున్నాను. సంస్థ తరఫున ఏదైనా చేయాలని సంకల్పించుకుని రూ. 6 లక్షలు వెచ్చించి షెడ్లు నిర్మించాం. రోగులు కూర్చునేందుకు కుర్చీలు, మంచాలు, రక్త పరీక్షలకు పరికరాలు సమకూర్చాం. గిరిజనులకు మా వంతు సహకారం అందిస్తున్నాం.

రామ్‌కుమార్‌, సీఈఓ, సమారిటన్స్‌ ఫర్‌ ది నేషన్‌ సంస్థ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని