logo

చుట్టూ పెట్టెలు... మధ్యలో పాఠాలు

బాలురు ఓచోట.. బాలికలు మరోచోట విద్యాభ్యాసం. ఇరుకు గదుల్లో ఇబ్బందులు పడుతున్న బాలురు. భవన నిర్మాణానికి కోట్లాది రూపాయలు కేటాయించి మూడేళ్లవుతున్నా నేటికి ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు.

Published : 27 Mar 2023 04:38 IST

కొయ్యూరు, న్యూస్‌టుడే

గురుకుల పాఠశాలలో ఏకలవ్యకు కేటాయించిన భవనం

బాలురు ఓచోట.. బాలికలు మరోచోట విద్యాభ్యాసం. ఇరుకు గదుల్లో ఇబ్బందులు పడుతున్న బాలురు. భవన నిర్మాణానికి కోట్లాది రూపాయలు కేటాయించి మూడేళ్లవుతున్నా నేటికి ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. తాత్కాలికంగా మరో భవనం కోసం అధికారులు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇదీ కొయ్యూరులోని ఏకలవ్య పాఠశాల పరిస్థితి.

కార్పొరేట్‌ తరహా విద్య అందించే ఉద్దేశంతో ప్రభుత్వం మండలానికో ఏకలవ్య పాఠశాలను మంజూరు చేసింది. ఒకే ప్రాంతంలో బాలురు, బాలికలకు వేర్వేరు వసతిగృహాలు, ఇతర అన్ని వసతులు కల్పించేందుకు రూ.40 కోట్లు కేటాయించింది. ఈ నిధులతో ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యాభ్యాసానికి సకల సదుపాయాలు కల్పించాల్సి ఉంది. కొయ్యూరు గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలోనే 2020 ఏప్రిల్‌లో ఈ పాఠశాలను ప్రారంభించారు. పాఠశాల భవన నిర్మాణానికి బాలారం పంచాయతీలో 18.90 ఎకరాల స్థలాన్ని కేటాయించారు.

 *   అప్పటి నుంచి నేటి వరకు పనులు మాత్రం ప్రారంభం కాలేదు. గురుకుల పాఠశాలలో సైన్స్‌ ల్యాబ్‌ నిర్వహించే రెండు గదుల భవనాన్ని ఏకలవ్యకు కేటాయించారు. 2022 ఆగస్టులో ఏకలవ్యకు శాశ్వత ప్రిన్సిపల్‌ రావడంతో బడిని వేర్వేరుగా నిర్వహిస్తున్నారు. రెండు గదుల్లో బాలురకు ఆరు, ఏడు తరగతులు నిర్వహిస్తున్నారు. ఆరో తరగతిలో 30 మంది, ఏడులో 25 మంది చదువుతున్నారు. వీరంతా ఇరుకు గదుల్లో చుట్టూ పెట్టెల మధ్యలో చదువుకొంటున్నారు. బాలికలు ఆరు, ఏడు తరగతులు కలిపి 60 మంది చింతపల్లి ఏకలవ్యలో విద్యాభ్యాసం చేస్తున్నారు. వచ్చే విద్యా సంవత్సరంలో మరో తరగతి పెరగనుంది. ఇప్పుడే ఇరుకు గదుల్లో బడి కొనసాగుతోందని, మరో తరగతిని ఎక్కడ నిర్వహించాలా అని ప్రిన్సిపల్‌, ఉపాధ్యాయులు తలలు పట్టుకుంటున్నారు. 

పెట్టెల మధ్యలో కూర్చుని చదువుకుంటున్న విద్యార్థులు

తాత్కాలిక భవనానికి వెతుకులాట  

శాశ్వత భవన నిర్మాణం జరిగే వరకు తాత్కాలికంగా వేరేచోట నిర్వహించడానికి చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపల్‌ ఉన్నతాధికారులను కోరారు. గతేడాది నవంబర్‌లో దీనిపై స్పందించిన గిరిజన సంక్షేమశాఖ డీడీ కొండలరావు, నోడల్‌ ప్రిన్సిపల్‌, గురుకుల ఓఎస్డీలతో కలిసి మండ లానికి వచ్చారు. ఎంపీపీ రమేష్‌, ఏటీడబ్ల్యూవోలతో కలిసి గతంలో ఎంపీడీవో కార్యాలయంగా నిర్వహించే భవనాన్ని, కాకరపాడులోని బాలికల పోస్ట్‌మెట్రిక్‌ వసతిగృహాన్ని పరిశీలించారు. ఎంపీడీవో కార్యాలయ పాత భవనం ఓ గదిలో ఎంఈవో కార్యాలయం, మరో గదిలో ఆధార్‌ కేంద్రం నడుస్తుండటంతో అది సరిపోదు.

 *   బాలికల పోస్ట్‌మెట్రిక్‌ వసతిగృహంలో సరిపడా గదులున్నా.. బాలురు ఉంటారు కాబట్టి స్నానాలు, మరుగుదొడ్లకు ఇబ్బంది అవుతుందని భావించారు. తప్పనిసరి పరిస్థితుల్లో అక్కడ ఇరుకు గదుల్లోనే ఇబ్బందులు పడుతూనే పాఠశాల కొనసాగిస్తున్నారు. పక్కనే ఉన్న రాజవొమ్మంగి మండలంలో శాశ్వత భవన నిర్మాణం పూర్తవడం, అందులోకి విద్యార్థులు వెళ్లిపోవడం జరిగిపోయింది.

 *   కొయ్యూరులో మాత్రం కనీసం నిర్మాణ పనులే ప్రారంభం కాకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీని గురించి ప్రజాప్రతినిధులు పట్టించుకోవడంలేదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఎంపీ, ఎమ్మెల్యే పట్టించుకుంటే కనీసం నిర్మాణ పనులైనా ప్రారంభమయ్యేవని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్‌ దృష్టిసారించి ఏకలవ్య పాఠశాల భవన నిర్మాణ పనులు ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవాలని విద్యార్థులు, తల్లిదండ్రులు, స్థానికులు కోరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని