logo

తటాకం... తాజంగికి తలమానికం

చింతపల్లి మండలంలోని తాజంగి జలాశయం ఇటు పర్యటకులను అలరిస్తూనే అటు రైతులు, మత్స్యకారులకు ఉపాధి కల్పిస్తోంది. సహజ వనరులకు ఎటువంటి ముప్పు తలపెట్టకుండా చిన్నచిన్న మార్పులను  చేపట్టడం ద్వారా పెద్దచెరువు పదిమందికి ఉపాధినిచ్చే కల్పతరువుగా మారింది.

Published : 28 Mar 2023 05:07 IST

రైతులకు సాగునీరు.. మత్స్యకారులకు ఉపాధి
చింతపల్లి, న్యూస్‌టుడే

అందాలొలికే తాజంగి జలాశయం

చింతపల్లి మండలంలోని తాజంగి జలాశయం ఇటు పర్యటకులను అలరిస్తూనే అటు రైతులు, మత్స్యకారులకు ఉపాధి కల్పిస్తోంది. సహజ వనరులకు ఎటువంటి ముప్పు తలపెట్టకుండా చిన్నచిన్న మార్పులను  చేపట్టడం ద్వారా పెద్దచెరువు పదిమందికి ఉపాధినిచ్చే కల్పతరువుగా మారింది.

జోలాపుట్‌ రిజర్వాయరు నిర్మాణ సమయంలో నిర్వాసితుల కోసం ఏర్పడిన గిరి పల్లె తాజంగి. సుమారు 200 కుటుంబాలను అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఇక్కడికి తరలించారు. వారు వ్యవసాయం చేసుకుని జీవనోపాధి పొందేందుకు వీలుగా 1500 ఎకరాలకు సాగునీరందించేలా మట్టి, రాళ్లను ఉపయోగించి 50 ఏళ్ల కిందట పెద్దచెరువును నిర్మించారు. కాలక్రమంలో తర్వాత కాలంలో దీన్ని కొంత అభివృద్ధి చేశారు. ఈ చెరువును ఆనుకుని ఉన్న భూములకు సాగునీరందడంతో రైతులు వ్యవసాయాధారితంగా జీవనోపాధి అందుతోంది. ఈ ప్రాంతానికి చెందిన కొందరు గిరిజన రైతులు మత్స్యకారులుగా మారారు. గిరిజన మత్స్యకార సొసైటీని స్థాపించారు. మత్యశాఖ సహకారంతో ఇదే జలాశయంలో ఏటా చేప పిల్లలను పెంచుతున్నారు. వీటి వల్ల కొన్ని కుటుంబాలకు ఉపాధి కలుగుతోంది.

సహజవనరుల సద్వినియోగంతో గుర్తింపు

ఏటా చలికాలంలో దూరప్రాంతాల నుంచి వచ్చే పర్యటకులు ఆంధ్రా కశ్మీర్‌గా పేరొందిన లంబసింగికి వచ్చి ఇక్కడ ఉన్న శీతల వాతావరణాన్ని ఆస్వాదించి వెళతారు. అక్కడనుంచి కొండపై ఉన్న  చెరువులవెనాన్ని సందర్శిస్తారు. అనంతరం పర్యటకులు వచ్చి చూసేది ఇక్కడ జలాశయం నిజానికి ఇది కేవలం రైతులకోసం నిర్మించిన ఒక పెద్ద చెరువు తొలినాళ్లలో తాజంగిలో చూడటానికి ఏముంది..! మావూర్లో చెరువులాగానే ఉంది అని పర్యటకులు పెదవి విరిచేవారు. దీంతో గ్రామంలోని నిరుద్యోగ యువత తమ ప్రాంతంలో ఉన్న సహజవనరులను ఎలాగైనా సద్వినియోగం చేసుకుని దాన్ని పర్యటకులకు వినోదం పంచేలా అవసరమైన ప్రణాళికలు రూపొందించారు.

మనసు పెట్టి చూస్తే..

కేవలం రైతుల ప్రయోజనం కోసం నిర్మించిన ఒక చెరువు అనే సహజవనరును యువత తమ ఆలోచనలకు పదును పెట్టి తమ పరిజ్ఞానాన్ని వినియోగించడంతో ఇలా రైతులకు, మత్స్యకారులకు పర్యటకులకు, గిరిజన యువతకు ఐటీడీఏకు ఆదాయాన్నిచ్చే వనరుగా మారింది. రూ.కోట్లు ఖర్చు చేసి పెద్దపెద్ద ప్రాజెక్టులను నిర్మించకపోయినా మనసు పెట్టి ఆలోచిస్తే మన్యంలో ఇటువంటి సహజ వనరులు ఎన్నో కనిపిస్తాయి. వాటిని గుర్తించి కొన్ని విలువలు, హంగులు జోడిస్తే అభివృద్ధికి ఆస్కారం ఉంటుంది. ఆదాయానికీ కొదవ ఉండదు. ఈ దిశగా అధికారులు ఆలోచించాల్సిన అవసరం ఉంది.


పర్యటక వికాస్‌ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం రూపుదిద్దుకుంది. పాడేరు ఐటీడీఏ కొంత సహకారాన్ని అందించడంతో ఇక్కడ సాహసక్రీడలకు బీజం పడింది. తాజంగి జలాశయం పైనుంచి గగన విహారం చేసేలా జిప్‌లైనర్‌ను ఏర్పాటు చేశారు. దీంతో దీన్ని ఎక్కేందుకు పర్యటకులు ఆసక్తి కనపరుస్తున్నారు. ఇక ఇదే జలాశయంపై బోటు షికారు మొదలైంది.

తాజంగి వచ్చే పర్యటకులంతా జిప్‌లైనర్‌పైకెక్కి ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ మరోవైపు జలాశయంలో బోటుషికారు చేస్తూ సరదాగా గడుపుతున్నారు. దీని వల్ల స్థానికంగా గిరిజన నిరుద్యోగ యువతకు ఉపాధి, మరోవైపు ఐటీడీఏకు ఆదాయం సమకూరుతోంది.


జలాశయ అభివృద్ధికి చర్యలు

తాజంగి జలాశయాన్ని మరింత అభివృద్ధి చేయాలని ఉన్నతాధికారులను కోరుతున్నాం. దీని అభివృద్ధికి ప్రపంచ బ్యాంకు రూ. కోటి ఇచ్చినా గుత్తేదారుల నిర్లక్ష్యంతో పనులు జరగలేదు. స్థానికంగా ఉన్న యువత తమకున్న ఆలోచనలకు పదును పెట్టడంతో ఇది పర్యటకులకు వినోదాన్ని పంచుతోంది. అగ్రి, ఎకో టూరిజం ప్రాజెక్టుల్లో అటవీ శాఖ కూడా భాగస్వామిగి మారి ఈ ప్రాంతంలో ట్రెక్కింగ్‌ వంటి సదుపాయాలు కల్పిస్తే మరింత ఆదరణ పెరుగుతుంది. తాజంగి జలాశయాన్ని అన్ని వర్గాలవారికీ ఉపయోగపడేలా తీర్చిదిద్దే ప్రయత్నాలు చేస్తున్నాం.

కోరాబు అనూషాదేవి, చింతపల్లి ఎంపీపీ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని