logo

ఫ్యామిలీ ఫిజీషియన్‌తో సేవలు మెరుగు

ఫ్యామిలీ ఫిజీషియన్‌ కార్యక్రమంతో ప్రజలకు మరింత మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ పేర్కొన్నారు.

Published : 28 Mar 2023 05:07 IST

104 వాహనాలను జెండా ఊపి ప్రారంభిస్తున్న కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌, పీవో గోపాలకృష్ణ, ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి

పాడేరు/పట్టణం, న్యూస్‌టుడే: ఫ్యామిలీ ఫిజీషియన్‌ కార్యక్రమంతో ప్రజలకు మరింత మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ పేర్కొన్నారు. జిల్లాకు మంజూరైన 104 వాహనాలను ఐటీడీఏ కార్యాలయంలో సోమవారం జెండా ఊపి ప్రారంభించారు. డీఎంహెచ్‌వో  జమాల్‌ బాషా అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి, ఐటీడీఏ పీఓ గోపాలకృష్ణ, ఎంపీపీ రత్నకుమారి హాజరయ్యారు.  టీబీ నియంత్రణాధికారి డాక్టర్‌ విశ్వేశ్వరనాయుడు, సిబ్బంది పాల్గొన్నారు.  

* భూముల రీసర్వే ప్రక్రియను సకాలంలో, పక్కాగా పూర్తి చేయాలని కలెక్టర్‌ పేర్కొన్నారు. కలెక్టరేట్‌లో భూముల రీసర్వే ప్రగతిపై ఐటీడీఏ పీవోలు, సబ్‌ కలెక్టర్లు, తహసీల్దార్లు, సర్వేయర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ సర్వేలో సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. రేషన్‌కార్డులో కుటుంబసభ్యుల పేర్లు తొలగింపు, చేర్పులు, ఇతర మార్పుల ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. సంయుక్త కలెక్టర్‌ శివ శ్రీనివాస్‌, డీఆర్‌వో అంబేడ్కర్‌, పీవోలు గోపాలకృష్ణ, సూరజ్‌ గనోరే, సబ్‌ కలెక్టర్లు అభిషేక్‌, శుభం బన్సల్‌ తదితరులు పాల్గొన్నారు.

* జిల్లాలోని ఖాళీగా ఉన్న 49 వాలంటీరు పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ తెలిపారు. ఈ నెల 29వ తేదీ నుంచి వచ్చే నెల ఒకటో తేదీ వరకూ దరఖాస్తులు స్వీకరించనున్నట్లు చెప్పారు.

* గంజాయి సాగు చేసే రైతులను గుర్తించి ప్రత్యామ్నాయ పంటల సాగుకు ప్రోత్సాహం అందించాలని కలెక్టర్‌, ఎస్పీ పేర్కొన్నారు. పోలీసు, డ్వామా, ఉద్యానాధికారులతో జూమ్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. శిక్షణ కలెక్టర్‌ అశుతోష్‌ శ్రీవాత్సవ, పీవో సూరజ్‌ గనోరే పాల్గొన్నారు.  

హుకుంపేట: క్షయ నిర్ధారణ పరీక్షలు ఇకపై పక్కాగా నిర్వహించాలని కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ పేర్కొన్నారు. ఐసీఎంఆర్‌, గీతం మెడికల్‌ కళాశాల సంయుక్త వితరణతో అందించిన రూ. 7 లక్షల క్షయ నిర్ధారణ పరికరాన్ని హుకుంపేట పీహెచ్‌సీలో ప్రారంభించారు. ఏప్రిల్‌ 1 నుంచి పాడేరు, హుకుంపేట, జి.మాడుగులలో చేసే క్షయ నిర్ధారణ పరీక్షలను ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్‌ టి.విశ్వేశ్వరనాయుడు, గీతం వైద్యాధికారి రాజ్యలక్ష్మి, వైద్యాధికారులు గాయత్రి, శాంతి తదితరులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు