logo

విద్యుదుత్పత్తిలో సీలేరు వెనుకంజ

గోదావరి డెల్టాలోని రబీ పంటలకు నీటిని విడుదల చేయడంతో పాటు డొంకరాయి పవర్‌ కెనాల్‌ గండి నేపథ్యంలో సీలేరు కాంప్లెక్స్‌ విద్యుదుత్పత్తిలో వెనుకబడిందని ఏపీ జెన్‌కో ముఖ్య ఇంజినీరు బి.శ్రీధర్‌ అన్నారు.

Published : 29 Mar 2023 02:22 IST

ఏపీ జెన్‌కో ముఖ్య ఇంజినీరు శ్రీధర్‌

సీలేరు, న్యూస్‌టుడే: గోదావరి డెల్టాలోని రబీ పంటలకు నీటిని విడుదల చేయడంతో పాటు డొంకరాయి పవర్‌ కెనాల్‌ గండి నేపథ్యంలో సీలేరు కాంప్లెక్స్‌ విద్యుదుత్పత్తిలో వెనుకబడిందని ఏపీ జెన్‌కో ముఖ్య ఇంజినీరు బి.శ్రీధర్‌ అన్నారు. మంగళవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ఈ ఏడాది వర్షాకాలంలో ఒడిశాలో తక్కువ వర్షపాతం నమోదు కావడంతో ఆశించిన స్థాయిలో బలిమెల జలాశయానికి నీటి నిల్వలు చేరలేదన్నారు. దీంతోపాటు గోదావరి డెల్టాలోని రబీ పంటలకు సీలేరు నుంచి నేరుగా 12 టీఎంసీల నీటిని విడుదల చేశామని సీఈ తెలిపారు. డొంకరాయి పవర్‌ కెనాల్‌కు గండి పడటంతో సుమారు 20 రోజులపాటు విద్యుదుత్పత్తి నిలిపివేశామన్నారు. ఈ నేపథ్యంలో సీలేరు కాంప్లెక్స్‌లోని సీలేరు, పొల్లూరు జలవిద్యుత్కేంద్రాలు లక్ష్యాలకు చేరుకోలేకపోయాయని వివరించారు. గోదావరి డెల్టాకు ఈ నెల 31 వరకూ రోజుకు మూడు వేల క్యూసెక్కులు చొప్పున నీటిని విద్యుత్తుత్పత్తి లేకుండా విడుదల చేస్తామని, వచ్చే నెలలో కూడా ఇదే విధంగా నీటిని విడుదల చేయాల్సి వస్తే రాబోయే రెండు నెలల్లో సీలేరు కాంప్లెక్స్‌లో విద్యుత్కేంద్రాలకు నీటి  సమస్య తలెత్తే అవకాశముందని సీఈ అన్నారు. ప్రస్తుతం గుంటవాడ, డొంకరాయి జలాశయాల్లో ఐదు టీఎంసీలు, బలిమెల జలాశయంలో ఆంధ్రా వాటాగా ఉన్న 15.8 టీఎంసీలు నీటితో కలిపి మొత్తం 20.8 టీఎంసీల నిల్వలు ఉన్నాయని సీఈ  వివరించారు. మాచ్‌ఖండ్‌లో ఆరు యూనిట్లకు ఆర్‌ఎల్‌ఏ స్టడీస్‌కు అనుమతులు వచ్చాయన్నారు. ఎస్‌ఈ కెకెవి ప్రశాంత్‌కుమార్‌, ఈఈ లక్ష్మినారాయణ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని