logo

జయజయ రామ.. జానకిరామా..!

పిన్న వయసులో రాక్షసులను మట్టుపెట్టాడు.. అన్యులకు సాధ్యంకాని శివ ధనస్సును ఒక్కపెట్టున ఎక్కుపెట్టాడు.. ఆయన పాదం తాకి రాయి అహల్యగా మారింది.

Published : 30 Mar 2023 03:10 IST

నేడే శ్రీరామనవమి
వరరామచంద్రాపురం, న్యూస్‌టుడే

పిన్న వయసులో రాక్షసులను మట్టుపెట్టాడు.. అన్యులకు సాధ్యంకాని శివ ధనస్సును ఒక్కపెట్టున ఎక్కుపెట్టాడు.. ఆయన పాదం తాకి రాయి
అహల్యగా మారింది.. పినతల్లి సూచన మేరకు అడవులకు వెళ్లమంటే మారుమాట్లాడకుండా కదిలాడు. ఒకటే భార్య, ఒకటే గురితప్పని బాణంగా జీవితమంతా ధర్మమార్గంలో సాగాడు. కనుకనే రాముడు దేవుడయ్యాడు, మానవాళి మనుగడకు ఆదర్శమూర్తిగా మారాడు. గురువారం శ్రీరామనవమి సందర్భంగా జయజయ రామా.. జానకిరామ అంటూ భక్తులు ఆర్తి తీరా నామస్మరణ చేస్తున్నారు.

శ్రీరాముడి కల్యాణానికి జిల్లావ్యాప్తంగా భక్తులు ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీరామగిరి రామాలయంలో, గ్రామంలోని కల్యాణ మండపం, ప్రధాన ఆలయం చుట్టూ భక్తులకు నీడ కోసం చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. భక్తులు వాహనాల పార్కింగ్‌ స్థలం, బోట్‌ పాయిట్‌ ప్రాంతాన్ని పంచాయతీ సిబ్బంది శుభ్రం చేయించారు. స్వామివారి వాహనాలకు రంగులు వేశారు. కొండపైకి ఉన్న మెట్ల మార్గం శుభ్రంచేయించి, అక్కడక్కడా నీడను ఏర్పాటు చేశారు.

సీతారాముల వనవాస కాలంలో ఈ ప్రాంతంలో గడపడం వల్లే భద్రాచలం, పర్ణశాల పరిసర ప్రాంతాలకు చారిత్రక గుర్తింపు వచ్చింది. భద్రాచలం అనుసంధానంగా ఉన్న ఈ ప్రాంతంలో వీఆర్‌పురం, ఎటపాక మండలాల్లో రామాయణ గుర్తులున్నట్లు స్థల పురాణాలు చెబుతున్నాయి.

ఎటపాక మండలంలోని గుండాల ప్రాంతంలో సీత కోసం రాముడు బాణం ఇసుక తిన్నెలో సంధించగా.. వేడినీరు ఉబికి వచ్చిందని, ఆ నీటితో అమ్మవారు స్నానం చేశారని భక్తుల నమ్మకం. నవమికి భద్రాచలం వచ్చే భక్తులు గుండాల గోదావరి తీరంలోని ఆ ప్రాంతాన్ని దర్శించుకుని ఆ నీటిని తలపై చల్లుకుని వెళ్తారు.

వీఆర్‌పురం మండలంలోని శ్రీరామగిరిపై రావణ సంహారం తరువాత రామ, లక్ష్మణులు దక్షిణముఖంగా వెలిశారు. దేశంలో ఇలా దక్షిణముఖంతో రామలక్ష్మణులు ఉన్న దేవాలయం మరెక్కడా లేదు. ఇక్కడ పూజలు చేసుకున్న భక్తులకు వారి పనుల్లో విజయం లభిస్తుందని, ఉమ్మడి రాష్ట్రంలో అనేక మంది మంత్రులు పూజల్లో పాల్గొనేవారు. దశాబ్దం క్రితం ఇద్దరు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఈ సీతారాములను దర్శించుకుని పూజలు చేశారు.

వీఆర్‌పురం మండల కేంద్రానికి 15 కిలోమీటర్ల దూరంలోని దారపల్లిలో ఆదివాసీలు సుమారు 500 ఏళ్ల క్రితం నుంచి నాలుగు భారీ టేకు వృక్షాలకు దశరథుని సంతతిగా పూజలు చేస్తున్నారు. అప్పటినుంచి ఆ వృక్షాలకు హాని చేయరు. ఎవరైనా ఆ దిశగా ప్రయత్నంచేసినా ఊరుకోరు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని