logo

పులకించిన శ్రీరామగిరి

మా రాములోరి కల్యాణం మళ్లీ ఇక్కడ చూస్తామో.. లేదో.. అన్న సందేహంతో శ్రీరామగిరిలో జరిగిన సీతారాముల కల్యాణానికి భక్తులు పోటెత్తారు.

Published : 31 Mar 2023 03:09 IST

కనులపండువగా జగదభిరాముని కల్యాణం

భక్తులకు యజ్ఞోపవీతం చూపిస్తున్న అర్చకులు

వరరామచంద్రాపురం, న్యూస్‌టుడే: మా రాములోరి కల్యాణం మళ్లీ ఇక్కడ చూస్తామో.. లేదో.. అన్న సందేహంతో శ్రీరామగిరిలో జరిగిన సీతారాముల కల్యాణానికి భక్తులు పోటెత్తారు. కుటుంబసమేతంగా జానకిరామయ్య పెళ్లిని చూడాలని ముందుగా వచ్చి కల్యాణ మండపంలో కూర్చున్నారు. శ్రీరామగిరి కొండపైనున్న ఆలయం నుంచి కింద కల్యాణ మండపం వరకు గురువారం జనజాతర నెలకొంది. రామనామస్మరణ మార్మోగింది.

కొండపై నుంచి ఊరేగింపుగా వస్తున్న స్వామివారికి పూలతో స్వాగతం

వరరామచంద్రాపురం మండలంలోని శ్రీరామగిరి రామాలయంలో, గ్రామంలోని కల్యాణ మండపంలో సీతారాముల కల్యాణం అర్చకులు పురుషోత్తమాచార్యులు బృందం కనులపండువగా జరిపించింది. వేకువజాము నుంచే ప్రధాన ఆలయంలో స్వామివారి పెళ్లి పనులు ప్రారంభమయ్యాయి. మూలవర్లుకు, ఉత్సవర్లుకు అభిషేకాలు చేసి, పట్టువస్త్రాలు అలంకరించారు. సుప్రభాతసేవ, అష్టోత్తర శతనామావళీ, పూజా కైంకర్యాలు పూర్తిచేసి ముందుగా గర్భగుడిలోని మూలవర్లుకు కల్యాణం నిర్వహించారు. భక్తులకు దర్శనం కల్పించారు. అనంతరం ఉత్సవర్లును పల్లకీలో ఉంచి, మేళతాళాలతో కొండ పైనుంచి, గ్రామంలోని కల్యాణ మండపానికి తీసుకొచ్చారు.  కల్యాణ ద్రవాలపై, భక్తులపై సంప్రోక్షణ జలాలు చిలకరించారు. కన్యాదానం, మంగళసూత్ర ధారణ, తలంబ్రాలు, ముత్యాల తలంబ్రాలు తదితర ఘట్టాలను రుత్వికుల వేదమంత్రాల ఘోషలో, భక్తుల జయజయధ్వానాల మధ్య కమనీయంగా జరిపారు. భక్తులకు వేదాశీర్వచనం చేసి అర్చకులు, తీర్థప్రసాదాలు అందించారు. స్వామివారి అక్షింతల కోసం తొక్కిలాసట జరగకుండా ఎటపాక సీఐ గజేంద్రకుమార్‌ ఆధ్వర్యంలో కూనవరం, వీఆర్‌పురం ఎస్సైలు వెంకటేశ్‌, దుర్గాప్రసాద్‌ బందోబస్తు ఏర్పాటు చేశారు.


జిల్లాకేంద్రంలో కోలాహలం

సుండ్రుపుట్టులో కల్యాణానికి పట్టువస్త్రాలు తీసుకొస్తున్న ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి

పాడేరు, న్యూస్‌టుడే: జిల్లాకేంద్రం పాడేరు సుండ్రుపుట్టులోని పురాతన రామాలయంలో, పాతపాడేరులో సీతారాముల కల్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు. నక్కలపుట్టులో గ్రామపెద్ద బొర్రా నాగరాజు దంపతుల ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. మధ్యాహ్నం అన్నసమారాధన జరిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని