logo

ఉచితం సరే.. బస్సులేవి సారూ!

పదో తరగతి విద్యార్థులు పరీక్షలు వెళ్లి రావడానికి ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించొచ్చని ప్రభుత్వం ప్రకటించింది. ఇంతవరకు బాగానే ఉన్నా అసలు తమ గ్రామాలకు బస్సులే రావడం లేదని.

Published : 31 Mar 2023 03:09 IST

ఆటోలో పరిమితికి మించి ఇలా..

మాడుగుల, దేవరాపల్లి, న్యూస్‌టుడే: పదో తరగతి విద్యార్థులు పరీక్షలు వెళ్లి రావడానికి ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించొచ్చని ప్రభుత్వం ప్రకటించింది. ఇంతవరకు బాగానే ఉన్నా అసలు తమ గ్రామాలకు బస్సులే రావడం లేదని, నానాపాట్లు పడి ఆటోలు పట్టుకుంటే తప్ప ప్రయాణ సౌకర్యమే లేదని గ్రామీణ ప్రాంత విద్యార్థుల తల్లిదండ్రులు అంటున్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల్లో సొంత వాహనాలు ఉన్నవారికి మినహా మిగిలిన వారికి ప్రమాదకర ప్రయాణం మినహా గత్యంతరం లేకుండా పోయింది. మాడుగుల నియోజకవర్గంలోని చాలా గ్రామాలకు బస్సు సౌకర్యమే లేదు. కొన్ని గ్రామాలకు ఉన్న బస్సులు తొలగించగా.. లోతట్టు ప్రాంతాలు ఈ సదుపాయానికి దూరంగా ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో మాడుగుల, చీడికాడ, దేవరాపల్లి, కె.కోటపాడు మండలాల్లో 13 కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటిలో 2,313 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు.  

వాహనాల కోసం వేచి ఉన్న విద్యార్థులు

మాడుగుల మండలం- ఇక్కడ 5 కేంద్రాల్లో 733 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. మాడుగుల, కె.జె.పురం, ఒమ్మలి, తాటిపర్తిలో కేంద్రాలు ఏర్పాటు చేశారు. తాటిపర్తి పాఠశాలకు ఎల్‌.పొన్నవోలు గిరిజనాశ్రమ పాఠశాల విద్యార్థులు రావాలి. వారికి తాటిపర్తి 20 కి.మీ. దూరం. ఇక్కడికి బస్సు సదుపాయం లేదు. రోజూ ఆటోల్లో రావాలంటే ఖర్చులు ఎవరు భరిస్తారన్నది ప్రశ్న. విద్యార్థులను తరలించే బాధ్యత ఉపాధ్యాయులపైనే పడడంతో వారు తల పట్టుకుంటున్నారు. ఒమ్మలి కేంద్రానిదీ అదే సమస్య. గతంలో ఉదయం 6 గంటలకు నర్సీపట్నం నుంచి బస్సు బయల్దేరి మాడుగుల 8 గంటలకు చేరుకునేది. అన్ని గ్రామాల మీదుగా ఈ బస్సు రావడంతో పరీక్షల సమయంలో మరింత ఉపయోగంగా ఉండేది. అప్పటి మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు బస్సును పునరుద్ధరించేలా చర్యలు తీసుకున్నా తర్వాత మళ్లీ రద్దు చేశారు. ఈ బస్సును తిరిగేలా చేస్తే పరీక్షల్లో వివిధ గ్రామాల విద్యార్థులకు మేలు కలుగుతుంది.

కోనాం, చీడికాడ, మంచాల కేంద్రాల్లో 570 మంది పరీక్షలు రాయనున్నారు. ఈ కేంద్రాలకూ బస్సు సౌకర్యం లేదు. అప్పలరాజుపురం, ఖండివరం విద్యార్థులు మంచాలకు వెళ్లాలి. దూరంగా ఉన్న ఈ కేంద్రానికి ఆటోలే దిక్కు.

దేవరాపల్లి, తెనుగుపూడి కేంద్రాల్లో 460 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. పెదగంగవరం, జీనబాడు, వాలాబు గిరిజన గ్రామల విద్యార్థులు దేవరాపల్లి రావాలి. వేచలం, ఎం.అలమండ, కలిగొట్ల, ఏ.కొత్తపల్లి, ముషిడిపల్లి గ్రామాల నుంచి 20 కి.మీ. దూరం నుంచి ఇక్కడికి రావలసి ఉంది. వీటి మధ్య బస్సు సదుపాయం లేదు.

కె.కోటపాడులో రెండు, ఎ.కోడూరులో ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. 550 మంది పరీక్షలు రాయనున్నారు. ఈ మండలంలో పలు  గ్రామాలకు బస్సు సదుపాయం ఉన్నా.. పాతవలసకు చెందిన విద్యార్థులు కె.కోటపాడు రావాలంటే ప్రైవేటు వాహనాల్లోనే చేరుకోవాలి. వీటిని అధికారులు పరిశీలించి కనీసం గతంలో తిరిగిన బస్సులను పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని