logo

అనుమానాస్పద స్థితిలో విద్యార్థిని మృతి

గొలుగొండ మండలం చోద్యం సమీపంలోని బొడ్డేరు గెడ్డలో ఓ విద్యార్థిని గురువారం శవమై తేలింది. కొయ్యూరు మండలం ఆడాకుల పంచాయతీ డి.కొత్తూరు గ్రామానికి చెందిన అప్పిలి చిన్నారి అలియాస్‌ చిట్టెమ్మ (14).

Published : 31 Mar 2023 03:09 IST

చిట్టెమ్మ (పాత చిత్రం)

నర్సీపట్నం అర్బన్‌, గొలుగొండ, రోలుగుంట, న్యూస్‌టుడే: గొలుగొండ మండలం చోద్యం సమీపంలోని బొడ్డేరు గెడ్డలో ఓ విద్యార్థిని గురువారం శవమై తేలింది. కొయ్యూరు మండలం ఆడాకుల పంచాయతీ డి.కొత్తూరు గ్రామానికి చెందిన అప్పిలి చిన్నారి అలియాస్‌ చిట్టెమ్మ (14) రోలుగుంట మండలం అడ్డసరంలోని బంధువుల పర్యవేక్షణలో ఉంటూ స్థానిక కేజీబీవీలో తొమ్మిదో తరగతి చదువుతోంది. బాలిక తల్లి నెలల వయసులోనే చనిపోగా అడ్డసరం గ్రామానికి చెందిన పిన్నమ్మ నూకాలతల్ల్లి, పినతండ్రి కల్యాణం వద్ద పెరుగుతోంది. రోలుగుంట కేజీబీవీలో చదువుతున్న చిట్టెమ్మ ఈ నెల 27న ఉపాధ్యాయులకు చెప్పకుండా డి.కొత్తూరులోని తండ్రి వీరబాబు వద్దకు వెళ్లింది. ఈమె స్కూల్లో లేని విషయం గమనించిన సిబ్బంది వీరబాబు వద్ద ఉందని నిర్ధారించుకున్నారు. అదేరోజు ఆయనతో కలిసి బాలిక లింగంపేటలోని నూకాలమ్మ జాతరకు వెళ్లింది. జాతర ముగిసిన తర్వాత తండ్రి, కుమార్తె, కుటుంబసభ్యులతో కలిసి గ్రామానికి చేరుకుంది. ఈ నెల 28న ఉదయం కేజీబీవీకి వెళ్తానని చెప్పి తండ్రి వద్ద రూ.150 తీసుకుని బయలుదేరింది. గురువారం ఉదయం బాలిక మృతదేహం బొడ్డేరు గెడ్డలో బయటపడింది. ఇంటి నుంచి బయలుదేరిన తర్వాత మధ్యలో ఏం జరిగిందనేది ఇప్పుడు ప్రశ్నార్థకమైంది. బలవన్మరణానికి పాల్పడిందా... ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అన్నది విచారణలో తేలాల్సి ఉంది. గొలుగొండ ఎస్సై నారాయణరావు నర్సీపట్నం ఆసుపత్రి వద్ద మాట్లాడుతూ.. పెంపుడు తండ్రి కల్యాణం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశాం. దర్యాప్తు జరుగుతోందని పేర్కొన్నారు. విద్యార్థిని కుటుంబ సభ్యులను జిల్లా విద్యాశాఖ అధికారిణి వెంకటలక్ష్మమ్మ గురువారం సాయంత్రం ఆసుపత్రి వద్ద ఓదార్చారు. బాలిక మేనమామ మరువాడ అర్జున మాట్లాడుతూ.. ‘మరణానికి కారణాలేంటో అంతుబట్టడం లేదు. పోస్టుమార్టం నివేదికలో వివరాలు తెలుస్తాయని ఎదురుచూస్తున్నాం. ఏం జరిగిందో తెలియడం లేదు. పాఠశాలలో తోటి విద్యార్థినుల వేధింపులేమైనా ఉన్నాయా, ఉపాధ్యాయినులు మందలించారా’ అన్నది తెలుసుకోవాలని డీఈఓను కోరారు. అనంతరం డీఈఓ రోలుగుంటలోని కేజీబీవీకి చేరుకుని విచారణ నిర్వహించారు. చిట్టెమ్మ గోడదూకి పారిపోయిందని సిబ్బంది చెప్పారని, ఇందుకు సంబంధించి సీసీ కెమెరా ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నట్లు డీఈఓ చెప్పారు. అనంతరం విద్యార్థినుల వసతి గదులు, వంటగదిని పరిశీలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని