logo

కాఫీ ఘుమఘుమ..ప్రభుత్వ ప్రోత్సాహం మమ

అంతర్జాతీయ ఖ్యాతి గడించిన మన్యం కాఫీపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది. స్థానికంగా ప్రాసెసింగ్‌ చేసి నాణ్యమైన కాఫీ పొడి తయారు చేసి లాభాలు అందించేలా గిరిజన సహకార సంస్థ (జీసీసీ), సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) చేస్తున్న ప్రయత్నాలకు సర్కారు నుంచి ప్రోత్సాహం కరవవుతోంది.

Updated : 27 May 2023 05:53 IST

తక్కువ ధరకే పంట విక్రయించాల్సిన దుస్థితి
ప్రాసెసింగ్‌ యూనిట్‌కు అనుమతుల్లో తాత్సారం
గూడెంకొత్తవీధి, న్యూస్‌టుడే

అంతర్జాతీయ ఖ్యాతి గడించిన మన్యం కాఫీపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది. స్థానికంగా ప్రాసెసింగ్‌ చేసి నాణ్యమైన కాఫీ పొడి తయారు చేసి లాభాలు అందించేలా గిరిజన సహకార సంస్థ (జీసీసీ), సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) చేస్తున్న ప్రయత్నాలకు సర్కారు నుంచి ప్రోత్సాహం కరవవుతోంది. రూ. 5 కోట్ల వ్యయంతో ఐటీడీఏ గూడెంకొత్తవీధి, జి.మాడుగుల మండలాల్లో చేపట్టిన ఎకో పల్పింగ్‌ యూనిట్ల నిర్మాణాల నిధులు పక్కదారి పట్టించడంతో అవి మధ్యలోనే నిలిచిపోయాయి. జీసీసీ రూ. 4 కోట్ల వ్యయంతో డౌనూరులో ఇంటిగ్రేటెడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ స్థాపించేందుకు చర్యలు తీసుకున్నా ప్రభుత్వం అనుమతులు ఇవ్వడంలో ఎక్కడ లేని తాత్సారం చేస్తోంది.

మన్యంలో పూర్తి సేంద్రియ విధానంలో పండించే ప్రధాన వాణిజ్య పంట కాఫీ. ఐటీడీఏ ప్రోత్సాహంతో 11 మండలాల పరిధిలో 10 లక్షలకు పైగా ఎకరాల్లో గిరిజనులు పండిస్తున్న ఈ పంటకు అంతర్జాతీయ మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉంది. ప్రతిష్ఠాత్మక సేంద్రియ ధ్రువీకరణ (ఆర్గానిక్‌ సర్టిఫికేషన్‌) సాధించడం ఇందుకు నిదర్శనం. చింతపల్లి, గూడెంకొత్తవీధి మండలాల్లో 2600 మంది గిరిజన రైతులకు సేంద్రియ ధృవపత్రాలు అందించింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో మరో 1500 మందికి వీటిని అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో జీసీసీ 150 టన్నుల కాఫీ కొనుగోలు చేసింది. ఆశించిన లాభాలు రాలేదు. 2022-23లో కొనుగోలు ధర పెంచి సేకరించింది. దళారుల కంటే జీసీసీ అధిక ధరకు కొనుగోలు చేయడంతో రైతులు సంస్థకే విక్రయించారు. కాఫీని ప్రత్యేకంగా బెంగళూరులో ప్రాసెసింగ్‌ చేయించి గ్రేడింగ్‌ వచ్చేలా చూసి అంతర్జాతీయ మార్కెట్లో విక్రయించారు. వెయ్యి టన్నుల కాఫీతో రూ. 20కోట్ల టర్నోవర్‌ సాధించింది.

సొంతంగా ప్రాసెసింగ్‌తో లాభం

మన్యం కాఫీకి అంతర్జాతీయంగా గుర్తింపు ఉన్నా గ్రేడింగ్‌పైనే కొనుగోలు ధర ఆధారపడి ఉంటుంది. కాఫీ ఎంత చక్కగా ప్రాసెసింగ్‌ జరిగితే అంత మంచి ధర లభిస్తుంది. జీసీసీ కొనుగోలు చేసిన కాఫీ అంతా బెంగళూరులో ప్రాసెసింగ్‌ చేయిస్తున్నారు. ఇది అదనపు వ్యయంగా భావించిన జీసీసీ సొంతంగా ఇంటిగ్రేటెడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ ఏర్పాట చేయాలని భావించింది. కొయ్యూరు మండలంలోని డౌనూరు వద్ద అయిదు ఎకరాల స్థలంలో రూ. 3.5 కోట్ల వ్యయంతో ఈ యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు గతేడాది జీసీసీ ప్రభుత్వానికి పంపించింది. అనుమతులు వస్తే యూనిట్‌ ఏర్పాటవుతుంది. అయితే.. దీనికి ప్రభుత్వం నుంచి స్పందన లేదు. మళ్లీ ఈ ఏడాది యూనిట్‌ స్థాపన అంచనా రూ. 50 లక్షలు అదనంగా పెరిగింది. అయినా రూ. 4 కోట్లతో డౌనూరులో యూనిట్‌ ఏర్పాటుకు మళ్లీ ప్రతిపాదనలు పంపారు. ఇప్పుడు అనుమతులు వస్తే యూనిట్‌ స్థాపించి వచ్చే ఆర్థిక సంవత్సరంలో స్థానికంగా ప్రాసెసింగ్‌ ప్రారంభించేందుకు అవకాశం ఉంటుంది. అలా చేస్తే అదనపు వ్యయం తగ్గి ఆ లాభం రైతులకు అందించేందుకు వీలుంటుంది. అయితే ప్రభుత్వం అనుమతులు ఇవ్వకుండా కాలయాపన చేస్తోంది.

నిలిచిన ఎకోపల్పింగ్‌ యూనిట్లు

గిరిజన రైతులు కాఫీని పండ్ల రూపంలో విక్రయించడంతో నష్టపోతున్నారు. పండ్లు పల్పింగ్‌ చేసి ఆరబెట్టి పిక్కలుగా, పొడిగా అమ్మితే మూడింతల లాభం వస్తుంది. ఈ విషయం గ్రహించిన ఐటీడీఏ ప్రాజెక్ట్‌ అధికారిగా పనిచేసిన రోణంకి గోపాలకృష్ణ గూడెంకొత్తవీధి, జి.మాడుగుల మండలాల్లో ఎకో పల్పింగ్‌ యూనిట్లు నెలకొల్పేందుకు రెండేళ్ల కిందటే చర్యలు తీసుకున్నారు. గూడెంకొత్తవీధి యూనిట్‌కు రూ. 2.27 కోట్లు, జి.మాడుగుల యూనిట్‌కు రూ. 2.38 కోట్లు కేటాయించి నిర్మాణ పనులు ప్రారంభించారు. గత ఏడాది ఆర్థిక సంవత్సరంలోనే ఇవి అందుబాటులోకి తేవాలని అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేపట్టారు. ఆ నిధులు పక్కదారి పట్టడంతో గుత్తేదారులకు రావాల్సిన బిల్లుల చెల్లింపులు ఆగిపోయి నిర్మాణాలు అర్ధంతరంగా నిలిచిపోయాయి. ఇందుకోసం తెచ్చిన అధునాతన యంత్రాలు గత ఆరు నెలలుగా నిరుపయోగంగా ఉన్నాయి. ఇంటిగ్రేటెడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌కు అనుమతులు ఇచ్చి, ఆగిపోయిన ఎకో పల్పింగ్‌ యూనిట్ల పనులు పునఃప్రారంభించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే రానున్న ఆర్థిక సంవత్సరంలో వ్యయం తగ్గి కాఫీ రైతులు లాభాలు అర్జించేందుకు వీలవుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.


ప్రభుత్వం అనుమతిస్తే యూనిట్‌ స్థాపిస్తాం

మన్యం కాఫీని ఇక్కడే ప్రాసెసింగ్‌ చేసి నాణ్యత పెంచేలా ఇంటిగ్రేటెడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ ఏర్పాటు చేయాలని భావించాం. అందుకు రూ. 3.5 కోట్లతో ప్రతిపాదనలు పంపించాం. అనుమతి రాలేదు. ప్రస్తుతం ఆ వ్యయం రూ. 50 లక్షలు పెరిగింది. ప్రభుత్వం అనుమతులు ఇస్తే రూ. 4 కోట్ల వ్యయంతో యూనిట్‌ను ప్రారంభించి అందుబాటులోకి తీసుకువస్తాం.
జి.సురేష్‌కుమార్‌, జీసీసీ ఎండీ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు