logo

మహానేతతో మరచిపోలేని జ్ఞాపకాలు

సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చీ రాగానే ప్రజల మనసుల్లో సుస్థిరస్థానం పొందిన మహానేత ఎన్టీఆర్‌. ఆయనతో మన్యంవాసుల అనుబంధం మరపురాని జ్ఞాపకాలు మిగిల్చింది. ఒకప్పటి చింతపల్లి అసెంబ్లీ నియోజకవర్గం తెదేపాకు కంచుకోటగా ఉండేది.

Published : 28 May 2023 01:54 IST

ఎన్టీఆర్‌తో చల్లంగి లక్ష్మణరావు, అప్పటి ఎమ్మెల్యే ఎల్‌బీ దుక్కు (పాత చిత్రం)

చింతపల్లి, న్యూస్‌టుడే: సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చీ రాగానే ప్రజల మనసుల్లో సుస్థిరస్థానం పొందిన మహానేత ఎన్టీఆర్‌. ఆయనతో మన్యంవాసుల అనుబంధం మరపురాని జ్ఞాపకాలు మిగిల్చింది. ఒకప్పటి చింతపల్లి అసెంబ్లీ నియోజకవర్గం తెదేపాకు కంచుకోటగా ఉండేది. చింతపల్లికి చెందిన చల్లంగి లక్ష్మణరావు మొదటి నుంచి తెదేపాకు వీరాభిమాని. ఈయన ఖజానా శాఖలో ఉద్యోగం చేస్తూనే ఎన్టీఆర్‌పై ఉన్న అభిమానంతో తెదేపాకు మొదటి నుంచి వెన్నుదన్నుగా నిలిచారు. ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అప్పటి ఎస్‌.కోట ఎమ్మెల్యే ఎల్‌బీ దుక్కు రాష్ట్రస్థాయిలో లెజిస్లేచర్‌ కమిటీ ఛైర్మన్‌గా పనిచేశారు. ఆ సమయంలో ఆయన వద్ద పీఏగా లక్ష్మణరావు పనిచేశారు.  ఆ సమయంలో తరచూ గిరిజన ప్రాంతాల్లో సమస్యలపై ఎల్‌బీ దుక్కుతో కలసి ఎన్టీఆర్‌ను లక్ష్మణరావు కలుస్తూ ఉండేవారు.

సొంత సొమ్ముతో చింతపల్లిలో విగ్రహం

ఎన్టీఆర్‌పై ఉన్న అభిమానంతో నా సొంత నిధులతో చింతపల్లిలో ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేశాను. అప్పటికి మన్యంలో ఎక్కడా ఎన్టీఆర్‌కు విగ్రహాలు లేవు. నేనే తొలిసారిగా చింతపల్లిలో ఏర్పాటు చేశాను.  పదివేల మందితో విగ్రహావిష్కరణ చేయించాం. తెదేపా ప్రభుత్వ హయాంలో అటవీ, గిరిజన సంక్షేమ శాఖామంత్రులుగా పనిచేసిన అయ్యన్నపాత్రుడు, మణికుమారి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. పార్టీపై ఉన్న అభిమానంతో ఉద్యోగ విరమణ చేసిన తర్వాత తెదేపాలో క్రియాశీలకంగా పనిచేస్తున్నా. నా కుమార్తె చల్లంగి జ్ఞానేశ్వరి నాతోపాటే పార్టీలో పనిచేస్తోంది. ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చారామె. 2004లో చింతపల్లి నుంచి ఎమ్మెల్యేగా తెదేపా తరఫున పోటీ చేశారు. ఎన్టీఆర్‌తో ఉన్న అనుబంధం మాటల్లో వర్ణించలేనిది

చల్లంగి లక్ష్మణరావు, తెదేపా జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి

పిలిచి కారులో తీసుకెళ్లారు..!

రంపచోడవరం, న్యూస్‌టుడే

తెదేపా స్థాపించిన నాటి నుంచి పార్టీలో ఉన్నాను. ఎన్టీఆర్‌ నటించిన జానపద, పౌరాణిక చిత్రాలను ఎక్కువగా చూస్తూ ఆయన అభిమానినయ్యాను. 1982లో పార్టీ స్థాపించిన తర్వాత అదే సంవత్సరం నవంబరులో ఎన్టీఆర్‌ రంపచోడవరం వచ్చారు. అప్పటికి నేను చిన్నవాడినే అయినా ఎన్టీఆర్‌ వెంటే పర్యటించాను. 1985లో రంపచోడవరం మండల పరిషత్‌ అధ్యక్షునిగా పనిచేశాను. 1989లో రంపచోడవరం (అప్పట్లో ఎల్లవరం) నుంచి ఎమ్మెల్యేగా టికెట్‌ ఇచ్చారు. అత్యధిక మెజారిటీతో గెలుపొందాను. ఆ తర్వాత 1994, 1999 సంవత్సరాల్లో కూడా ఎమ్మెల్యేగా గెలుపొందాను. మొదటిసారిగా 1989లో ఎమ్మెల్యే అయిన తర్వాత రంపచోడవరంలోని గోదావరి ఫ్లయివుడ్‌ ఫ్యాక్టరీకి స్థానికులు కలపను సరఫరా చేసేందుకు అనుమతులు ఇప్పించాలని కోరేందుకు హైదరాబాదు వెళ్లారు. ఎన్టీఆర్‌ను కలిసేందుకు అబిడ్స్‌లో ఆటో దిగి నడచి వెళ్తుండగా కారులో వెళ్తున్న నన్ను చూసి ఆయన తన కారులో ఎక్కించుకొన్నారు. అప్పుడు ఆ లేఖను అందించాను. కోరిన వెంటనే అనుమతులు కూడా ఇప్పించారు.

శీతంశెట్టి వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని