logo

ఇంటికే పోషకాహారం

అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా బాలింతలు, గర్భిణులకు వైఎస్‌ఆర్‌ సంపూర్ణ పోషణ, పోషణ ప్లస్‌ కార్యక్రమాల కింద ప్రతి నెలా ప్రభుత్వం పోషకాహారం అందిస్తోంది.. కేంద్రాలు దూరంగా ఉండటంతో కొందరు, ఆరోగ్య సమస్యల కారణంగా ఇంకొందరు, ఇలా ఎక్కువ మంది రావడం లేదు.

Published : 28 May 2023 01:54 IST

జులై 1 నుంచి అమలు
ఎటపాక (రంపచోడవరం), న్యూస్‌టుడే

కరోనా సమయంలో సరకులు ఇంటింటికీ అందిస్తున్న అంగన్‌వాడీ సిబ్బంది

అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా బాలింతలు, గర్భిణులకు వైఎస్‌ఆర్‌ సంపూర్ణ పోషణ, పోషణ ప్లస్‌ కార్యక్రమాల కింద ప్రతి నెలా ప్రభుత్వం పోషకాహారం అందిస్తోంది.. కేంద్రాలు దూరంగా ఉండటంతో కొందరు, ఆరోగ్య సమస్యల కారణంగా ఇంకొందరు, ఇలా ఎక్కువ మంది రావడం లేదు. ఈ నేపథ్యంలో పోషకాహారాన్ని కేంద్రంలోనే తీసుకుంటారా, ఇంటికి తీసుకెళ్తారా, సరకులు ఇంటికి ఇవ్వమంటారా అని గత నెలలో లబ్దిదారుల నుంచి అభిప్రాయం సేకరించారు. అధిక శాతం మంది ఇంటికే అందించాలని చెప్పడంతో మళ్లీ లబ్ధిదారులకు సరకులు ఇంటికే ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. జిల్లాలోని ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల వారీగా 3,214 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఆయా కేంద్రాల్లో చిన్నారులు 78,061మంది, టేక్‌ హోం రేషన్‌ లబ్ధిదారులైన గర్భిణులు 12,549, బాలింతలు 50,183మంది ఉండగా వారందరికీ జులై ఒకటి నుంచి ఇంటికే పోషకాహారం అందించేందుకు అధికారులు అమలు చేసేందుకు చర్యలు చేపడుతున్నారు.

జిల్లాలో కొవిడ్‌ సమయంలో రెండేళ్ల పాటు టేక్‌ హోం రేషన్‌ (టీహెచ్‌ఆర్‌) పేరుతో సరకులు లబ్ధిదారుల ఇళ్లకే అందించారు. కొవిడ్‌ తగ్గుముఖం పట్టడంతో అంగన్‌వాడీ కేంద్రాలను మళ్లీ తెరిచారు. ప్రభుత్వం గతేడాది జూన్‌ ఒకటి నుంచి కేంద్రాల్లోనే లబ్ధిదారులకు వేడిగా భోజనం వండి పెట్టాలని ఆదేశించింది. ఆ మేరకు మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనాన్ని అందించారు. పూర్తిస్థాయిలో లబ్ధిదారులు ఆసక్తి చూపకపోవడంతో కొంత వెసులుబాటు కల్పించారు. నెలలు నిండటం, ఆరోగ్య సమస్యలు చిన్నారుల సంరక్షణ వంటి కారణాలతో ఇంటికి తీసుకువెళ్లేందుకు అవకాశం కల్పించారు. మెజార్టీ సభ్యులు ఇంటికే సరకులు ఇవ్వాలని సూచించడంతో నెలలో రెండు విడతలుగా వీటిని అందించేందుకు చర్యలు చేపట్టారు. ఇప్పటికే మూడేళ్ల నుంచి ఏడేళ్ల లోపు చిన్నారులకు పోషకాహారం ఇంటికే ఇస్తున్నారు.

వినాయకపురంలో భోజనం చేస్తున్న గర్భిణులు

తీరనున్న ఇబ్బందులు..

ఇంటికే సరకులు అందజేసేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవడంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బాలింతలు, గర్భిణులు కేంద్రాలకు వచ్చేందుకు అనేక ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ముఖ్యంగా వర్షాకాలంలో కేంద్రాలకు వచ్చే సమయంలో వర్షానికి తడిస్తే అనారోగ్యానికి గురవుతామని ఆందోళన చెందేవారు. పట్టణం, పల్లెల్లో అనేక చోట్ల ఇరకు ఇళ్లలో కేంద్రాలు నిర్వహించడంతో సరైన సదుపాయాలు లేక ఇబ్బందులు పడేవారు. శస్త్రచికిత్స చేయించుకున్న బాలింతలు కేంద్రాలకు నడిచి వెళ్లేందుకు అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఇప్పటి వరకు తాము పడిన ఇబ్బందులు తొలగుతాయని వారు పేర్కొంటున్నారు.

ఇకపై రాగుల పిండి

అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా ఇచ్చే పోషకాహారం జులై 1నుంచి సరకుల రూపంలో లబ్దిదారుల ఇంటికే ఇవ్వాలని ఉన్నతాధికారులు సూచించారు. ప్రతి నెలా ఒకటి నుంచి అయిదో తేదీ మధ్యలో మొదటి విడతగా బియ్యం కందిపప్పు, నూనె, కోడిగుడ్లు, పాలు, రాగిపిండి, అటుకులు, బెల్లం, చిక్కీలు, ఎండు ఖర్జూరం అందిస్తాం. రెండో విడతగా 16, 17 తేదీల్లో కోడిగుడ్లు, పాలు ఇస్తారు. కేంద్రాల్లో అందిస్తున్న జొన్న పిండి స్థానంలో రాగిపిండి పంపిణీ చేస్తాం. -సూర్యలక్ష్మి, ఐసీడీఎస్‌ పీడీ

నెలకు అందించే సరకులివే..

బియ్యం 3 కేజీలు, కందిపప్పు కేజీ, నూనె 500 గ్రాములు, గుడ్లు 25, పాలు అయిదు లీటర్లు, రాగిపిండి రెండు కేజీలు, అటుకులు కేజీ, ఖర్జూరం 250 గ్రాములు, చిక్కీలు 250 గ్రాములు, బెల్లం 250 గ్రాములు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని