logo

అడిగి అడిగి విసిగి.. అడుగులో అడుగేసి..

తాజంగి పంచాయతీ బురిసింగి గ్రామంలో 60 కుటుంబాలు ఉంటున్నాయి. గతంలో నిర్మించిన చెక్‌డ్యాం దెబ్బతింది. కాలువలూ రూపం కోల్పోయాయి. గ్రామస్థులంతా ఏకమై వీటిని బాగు చేసుకున్నారు.

Published : 29 May 2023 01:56 IST

సర్కారు స్పందించకపోయినా ఆదివాసీల చైతన్యం
శ్రమదానంతో గ్రామాల్లోని సమస్యల పరిష్కారం

శ్రమదానంతో చెరువులో పూడికను తొలగించిన బిల్లబొడ్డు గిరిజనులు

తాజంగి పంచాయతీ బురిసింగి గ్రామంలో 60 కుటుంబాలు ఉంటున్నాయి. గతంలో నిర్మించిన చెక్‌డ్యాం దెబ్బతింది. కాలువలూ రూపం కోల్పోయాయి. గ్రామస్థులంతా ఏకమై వీటిని బాగు చేసుకున్నారు. తాజంగి పంచాయతీకి చెందిన రేగుబయలు గ్రామంలో 60 కుటుంబాలు ఉంటున్నాయి. వీరు తమ గ్రామంలో చెక్‌డ్యాంతోపాటు పంటకాలువలను బాగు చేసుకున్నారు.

ప్రభుత్వమే ముక్కున వేలేసుకునేలా చేశారు. వీరి చైతన్యాన్ని గుర్తించిన మన్యసీమ అనే స్వచ్ఛంద సంస్థ హైదరాబాద్‌లోని గూంజ్‌ సంస్థ సహకారంతో నిత్యావసరాలు, దుస్తులను అందించి ప్రోత్సహించింది.

చింతపల్లి, న్యూస్‌టుడే: వారంతా అక్షర జ్ఞానం లేని ఆదివాసీ గిరిజనులు.. తెల్లారి లేస్తే వ్యవసాయ పనులతోనే జీవనోపాధి. గతంలో నిర్మించిన చెక్‌డ్యాంలన్నీ  పూడికతో నిండిపోయాయి. స్పందించండి మహాప్రభో అంటూ వీరంతా ఎన్నోసార్లు నేతలు, అధికారుల చుట్టూ తిరిగారు. వీరి మొర ఆలకించే వారే లేరు. ఇక ప్రభుత్వాన్ని నమ్ముకుని లాభం లేదనుకున్నారు. తమ బాగుకోసం ఊరంతా ఏకమయ్యారు. సాగునీటి సౌకర్యం కోసం భగీరథ ప్రయత్నాలు చేశారు. వారి శ్రమ ఫలించింది. చెక్‌డ్యాంలు, చెరువుల్లో పూడికతీతను పూర్తిచేసి వర్షపు నీటి నిల్వకు వీలుగా వీటిని సిద్ధం చేశారు. కొత్తపాలెం, తాజంగి పంచాయతీలకు చెందిన కప్పల, బిల్లబొడ్డు, బురిసింగి, రేగుబయలు గ్రామాలకు చెందిన ఆదివాసీ గిరిజనుల చైతన్య గాథ ఇది.
లంబసింగి పంచాయతీకి చెందిన బురడవీధి, జల్లూరుమెట్ట గ్రామాల వారు కొండపై ఉన్న కాఫీ తోటలు, వ్యూపాయింట్‌ను పర్యటకులు సందర్శించేందుకు, ఇతర అవసరాల కోసం సొంతంగానే రెండు కిలోమీటర్ల మేర రహదారిని చదును చేసుకుని ఆదర్శంగా నిలిచారు. ఇంటిల్లిపాదీ చిన్నాపెద్దా, ఆడామగా తేడా లేకుండా ఊరంతా కదిలి తమ ఊరిమేలుకోరి ఈ పనులు చేసుకున్నారు. 

సొంతంగా రహదారి నిర్మాణం

రహదారి నిర్మాణపనుల్లో బురిసింగి గ్రామస్థులు

చింతపల్లి మండలం లంబసింగి పంచాయతీకి చెందిన బురడవీధి, జల్లూరుమెట్ట గ్రామాల్లో గిరిజనులు రహదారి పక్కనే నివాసం ఉంటున్నారు. వారి వ్యవసాయ భూములు, కాఫీతోటలు కొండపైన ఉన్నాయి. జల్లూరి మెట్ట  కొండపై వ్యూపాయింట్‌ ఉంది. ఉదయం వేళల్లో శీతాకాలంలో పొగమంచు దట్టంగా అలుముకుని చెరువులవెనాన్ని తలపిస్తుంటుంది. పర్యటకులను ఆ కొండపైకి రప్పించాలంటే సరైన మార్గం లేదు. రాళ్లురప్పలు, ఎత్తుపల్లాలతో నిండి ఉన్న ఆ మార్గాన్ని రహదారిగా మలిస్తే తమతోపాటు పర్యటకులకూ ఉపయోగకరంగా ఉంటుందని భావించిన ఈ గ్రామాల గిరిజనులు శ్రమదానంతో సుమారు రెండు కిలోమీటర్ల మేర కొండపైకి రహదారిని నిర్మించుకున్నారు.

కొత్తపాలెం పంచాయతీ బిల్లబొడ్డు గ్రామంలో 45 పీవీటీజీ కుటుంబాలు ఉంటున్నాయి. గతంలో సాగునీటి సౌకర్యార్థం చెరువును తవ్వారు. అది చాలాకాలంగా పూడికతో నిండిపోయింది. పూడిక తీస్తే సాగునీటికి ఇబ్బంది ఉండదని భావించిన గిరిజనులంతా శ్రమదానం చేశారు. దీంతో ప్రస్తుతం ఆ చెరువు కొత్తదనాన్ని సంతరించుకుంది. సాగునీటి చింతను తీర్చింది.

కొత్తపాలెం పంచాయతీ కప్పల గ్రామంలో 102 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. ప్రతి కుటుంబానికి మూడు ఎకరాలకు తగ్గకుండా వ్యవసాయ భూమి ఉంది. గ్రామంలో గతంలో నిర్మించిన చెక్‌డ్యాం పూడికతో నిండిపోయి ఉంది. పంటకాలువలు దెబ్బతిన్నాయి. చెక్‌డ్యాంలో పూడికతీతతోపాటు కాలువలను బాగు చేసుకుంటే 300 ఎకరాలకు సాగునీరందుతుందని గుర్తించారు. అంతా కలసి పదిరోజులపాటు శ్రమించి పూడిక తొలగించారు. దెబ్బతిన్న పంట కాలువలను బాగు చేసుకున్నారు.

ప్రభుత్వం పట్టించుకోలేదు: లంబసింగికి చేరువలో ఉన్న మా ఆదివాసీ గ్రామాన్ని మోడల్‌ విలేజ్‌గా తీర్చిదిద్దుతామని అప్పట్లో ప్రభుత్వం హామీ ఇచ్చింది. నేటికీ ఇళ్ల నిర్మాణాలు పూర్తికాలేదు. కొండపైకి రహదారి నిర్మించాలని ఎన్నోసార్లు అధికారులు, ప్రజాప్రతినిధులను కోరాం. ఎవరూ పట్టించుకోలేదు. వారిని నమ్ముకుని లాభం లేదని భావించి ఆఖరికి మేమంతా శ్రమదానంతో కొండపైకి రహదారిని నిర్మించుకున్నాం.

సుబ్బారావు, జల్లూరిమెట్ట

వారి శ్రమ గుర్తించి ప్రోత్సహించాం: ప్రభుత్వంపై ఆధారపడకుండా గిరిజనులే ముందుకొచ్చి చెక్‌డ్యాంలు, చెరువులు, రహదారులు బాగు చేసుకున్నారు. వారి చైతన్యాన్ని గుర్తించి ప్రోత్సహించాలని నిర్ణయించాం. హైదరాబాద్‌లోని గూంజ్‌ అనే సంస్థ సహకారంతో పనులు చేసుకున్న గిరిజనులందరికీ మావంతుగా కొద్దిమేర సిమెంటు, సామగ్రి అందించాం. శ్రమనే పెట్టుబడిగా పెట్టి సౌకర్యాలు మెరుగుపరచుకున్న గిరిజనులందరికీ నిత్యావసరాలు, దుస్తులు అందించాం. మిగిలిన గ్రామాల్లోనూ గిరిజనులు ఇటువంటి పనులు చేసుకునేలా వారిలో చైతన్యం నింపుతున్నాం.

శ్రీనివాస్‌, మన్యసీమ స్వచ్ఛంద సంస్థ కార్యదర్శి

 

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని