logo

అకాల వర్షం.. ఆఖరిలో కష్టం

మిరప సాగుచేస్తున్న రైతులకు చివరిదశలోనూ ఇబ్బందులు తప్పడం లేదు. అకాల వర్షాలతో వీరంతా నానా అవస్థలు పడుతున్నారు.

Published : 29 May 2023 01:56 IST

మిరప కాయలపై బరకం కప్పుతున్న రైతుల్ఠు

ఎటపాక, న్యూస్‌టుడే: మిరప సాగుచేస్తున్న రైతులకు చివరిదశలోనూ ఇబ్బందులు తప్పడం లేదు. అకాల వర్షాలతో వీరంతా నానా అవస్థలు పడుతున్నారు. ఆదివారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి కల్లాల్లో మిరప కాయలు తడవకుండా కాపాడుకునేందుకు అన్నదాతలు నానా ఇబ్బందులు పడ్డారు. ఈ ఏడాది సాగు ప్రారంభం నుంచి రైతులు ఎన్నో కష్టాలు పడ్డారు. తొలుత గోదావరి వరదలు, ఆ తర్వాత భారీ వర్షాలకు రెండు నెలల పాటు సాగు నిలిచిపోయింది. ఆ తర్వాత అంతంత మాత్రంగా చేస్తున్న సాగును తుపానులు దెబ్బతీశాయి. తెగుళ్లతో దిగుబడి తగ్గిపోయింది. దిగుబడిని తగ్గించాయి. గన్నవరం, నందిగామ, మురుమూరు, గౌరిదేవిపేట, గన్నేరుకొయ్యలపాడు, నెల్లిపాక గ్రామాల్లో కల్లాల్లో వందల క్వింటాళ్లలో మిరప కాయలు ఉన్నాయి. ప్రస్తుతం చివరి దశలో కోతలు కోస్తున్నారు. ఇప్పటివరకు అమ్మిన కాయలు పెట్టుబడికి, అప్పులకు, కౌలు చెల్లించేందుకే సరిపోయాయని.. ఇప్పుడు కల్లాల్లో ఉన్న కాయలు అమ్మితేనే పైసా కనిపిస్తుందని.. ఇలాంటి తరుణంలో అకాల వర్షాలతో ఆందోళన తప్పడం లేదని రైతులు చెబుతున్నారు. ఎప్పుడు వర్షం కురుస్తుందో తెలియని పరిస్థితి. పంటను కళ్లల్లో పెట్టుకుని కాపాడుకుంటున్నామని చెబుతున్నారు. వర్షాల కారణంగా మిరప కాయలు నాణ్యత కోల్పోయి కనీస ధర పలకడం లేదని ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు.


ఈదురుగాలుల బీభత్సం

వరిగెలపాలెంలో ఎగిరిపోయిన ఇంటి రేకులు

చింతపల్లి గ్రామీణం, జి.మాడుగుల, గూడెంకొత్తవీధి, న్యూస్‌టుడే: జి.మాడుగుల మండలంలో ఆదివారం మధ్యాహ్నం ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. గాలుల ధాటికి గెమ్మెలి పంచాయతీ వరిగెలపాలెం గ్రామానికి చెందిన కురిడే లక్ష్మయ్య, పండ్లి బాలరాజు, సెగ్గే లక్ష్మయ్య ఇళ్ల రేకులు ఎగిరిపోయాయి. పిడుగుల శబ్దాలకు ప్రజలు భయాందోళనకు గురయ్యారు. గూడెంకొత్తవీధి మండలంలో ఈదురుగాలులతో వర్షం కురిసింది. గూడెంకొత్తవీధిలోని జీసీసీ పెట్రోల్‌ బంకు సమీపంలో రెండు చెట్లు విరిగిపడటంతో రాకపోకలు నిలిచిపోయాయి. స్థానికులు ఆ చెట్లను తొలగించారు. విద్యుత్తు సరఫరాకు ఆటంకం ఏర్పడింది. లంబసింగి, తాజంగి, రాజుపాకలు తదితర గ్రామాల్లో ఈదురుగాలులు, పిడుగులతో భారీ వర్షం కురిసింది. గాలుల ప్రభావానికి తాజంగి పంచాయతీ బలబద్రం గ్రామానికి చెందిన రైతు వనుం శ్యాంసుందర్‌ రేకుల ఇంటి పైకప్పు ఎగిరిపోయింది. మొండి గోడలు మాత్రమే మిగిలాయి. ఇదే పంచాయతీలోని రేగుబయలు గ్రామంలో పాంగి రామకృష్ణకు చెందిన ఆరు మేకలు, ఒక లేగదూడ పిడుగుపాటుకు మృతి చెందాయి.

 

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని