పసుపుమయం.. ప్రభంజనం
గోదారమ్మ సైతం చిన్నబోయేలా తూర్పున పసుపు దండు సముద్రాన్ని తలపించింది.. ఆదివారం ఉదయం నుంచే సూరీడు ముచ్చెమటలు పట్టిస్తున్నా.. తెలుగుదేశం పార్టీపై ఉన్న అభిమానంతో రాజమహేంద్రవరం సమీప వేమగిరి వద్ద నిర్వహించిన మహానాడుకు లక్షలాదిగా జనం చేరుకున్నారు.
ఈనాడు, రాజమహేంద్రవరం, న్యూస్‌టుడే బృందం
గోదారమ్మ సైతం చిన్నబోయేలా తూర్పున పసుపు దండు సముద్రాన్ని తలపించింది.. ఆదివారం ఉదయం నుంచే సూరీడు ముచ్చెమటలు పట్టిస్తున్నా.. తెలుగుదేశం పార్టీపై ఉన్న అభిమానంతో రాజమహేంద్రవరం సమీప వేమగిరి వద్ద నిర్వహించిన మహానాడుకు లక్షలాదిగా జనం చేరుకున్నారు. బహిరంగ సభ సాయంత్రమని ప్రకటించినా.. తెల్లవారుజాము నుంచే తాకిడి మొదలైంది. ముందురోజు జరిగిన ప్రతినిధుల సభలో చంద్రబాబు రాష్ట్ర భవితకు బాటలు వేసేలా.. తెదేపా శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేస్తూ హుషారు నింపగా, పార్టీ ముఖ్య నేతలు తెదేపా హయాంలో అమలు చేసిన ప్రగతి ఫలాలను వివరించారు. ఇక ఆదివారం నాటి బహిరంగ సభకు వచ్చే దారులన్నీ వేలాది వాహనాలతో నిండిపోయాయి. ఓ వైపు సాయంత్రం వర్షం కురుస్తున్నా.. సభా ప్రాంగణంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు గ్యాలరీల్లోంచి కదల్లేదు. వివిధ ప్రాంతాల నుంచి వాహనాలతో ర్యాలీగా వచ్చినవారు తడుస్తూనే ప్రాంగణానికి చేరుకున్నారు. కార్యకర్తల నినాదాలు హోరెత్తాయి. నాయకుల ప్రసంగాలను అంతా శ్రద్ధగా విన్నారు. కాసేపటికే వర్షం తెరిపివ్వడంతో అంతా ఉపశమనం పొందారు. రెట్టించిన ఉత్సాహంతో సభ సాగింది. తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, జాతీయ కార్యదర్శి లోకేశ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెదేపా అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, నేతలు ప్రసంగిస్తూ తెదేపా అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకతను వివరించారు.
ఆరు బృందాలు.. ఆరోగ్య సేవలు
లక్షలాది మంది కొలువుదీరిన మహానాడు బహిరంగ సభలో అత్యవసర వైద్య అవసరానికి అంబులెన్సులతో పాటు ఆరు గ్రూపులుగా వైద్య సిబ్బందితో సేవలు అందించినట్లు తెదేపా వైద్య విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోరంట్ల రవిరామ్ కిరణ్ పేర్కొన్నారు. 20 మంది డ్యూటీ డాక్టర్లు, 20 మంది నర్సులు, 10 మంది పారా మెడికల్ సిబ్బంది, ఆరు అడ్వాన్స్‌డ్ లైఫ్ సర్వీస్ అంబులెన్సులు, ఆరు గ్యాస్ ఆక్సిజన్ అంబులెన్సులు, 10 బెడ్‌లు (ఆక్సిజన్‌తో), మరో ఆరు బృందాల వైద్య సిబ్బంది సేవలు అందించినట్లు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.