logo

ఊరూరా రహదారి కల నెరవేరేనా!

డోలి మోతలకు స్వస్తి పలకాలని, రవాణా ఇబ్బందులు లేకుండా చూడాలనే లక్ష్యంతో పాడేరు ఐటీడీఏ ఆధ్వర్యంలో మిషన్‌ కనెక్ట్‌ను ప్రతిపాదించారు.

Published : 30 May 2023 03:21 IST

మిషన్‌ కనెక్ట్‌ పనుల్లో కనిపించని పురోగతి
జి.మాడుగుల (పాడేరు), న్యూస్‌టుడే

మిషన్‌ కనెక్టులో ఎంపికైన రహదారిపై రాసపనుకు గ్రామస్థుల శ్రమదానం

డోలి మోతలకు స్వస్తి పలకాలని, రవాణా ఇబ్బందులు లేకుండా చూడాలనే లక్ష్యంతో పాడేరు ఐటీడీఏ ఆధ్వర్యంలో మిషన్‌ కనెక్ట్‌ను ప్రతిపాదించారు. దీన్లో భాగంగా జిల్లాలో సుమారు 900 మారుమూల  గ్రామాలను ఎంపిక చేశామని ఘనంగా ప్రకటించారు. వినడానికి బాగానే ఉన్నా ఎంపికైన పలు గ్రామాలు ఇంకా రోడ్డు సదుపాయానికి నోచుకోవడం లేదు. ఫలితంగా గిరిజనులకు రాకపోకలకు ఇబ్బందులు తప్పడం లేదు.

ఐటీడీఏ గత పీవో గోపాలకృష్ణ మారుమూల గ్రామాలకు రహదారి సదుపాయం కల్పించేందుకు మిషన్‌ కనెక్ట్‌ ద్వారా సర్వే చేయించారు. దీనికి పలు గ్రామాలను ఎంపిక చేశారు. కొన్ని గ్రామాల్లో పనులు పూర్తి కాగా అధిక శాతం గ్రామాల్లో పనులు ప్రారంభమే కాలేదు. మరికొన్ని గ్రామాల్లో ప్రారంభించి వదిలేశారు. అత్యంత మారుమూల గ్రామాలను ఎంపిక చేయడంతో ఎన్నో ఏళ్ల కల నెరవేరుతుందని గ్రామస్థులు సంతోషపడ్డారు. తీరా పనులు జరగకపోవడంతో వారు అసహనానికి లోనవుతున్నారు. పనుల్లో పురోగతి లేకపోవడంతో అధికారుల లక్ష్యం నెరవేరడం లేదు. గిరిజనులకు డోలిమోతలు, రహదారి కష్టాలు తప్పడం లేదు.  దీనిపై ఆయా పంచాయతీల సర్పంచులు, గ్రామస్థులు, ప్రజా ప్రతినిధులు ఐటీడీఏ స్పందనలో ఫిర్యాదులు చేసినా ఫలితం లేదు.

ఇదీ పరిస్థితి

* జి.మాడుగుల మండలం వంతాల పంచాయతీలో పయ్యారిమామిడి నుంచి పూలదొడ్డి, కుమ్మరిగుంట నుంచి వంట్లమామిడి, వంతాల నుంచి రాసపనుకు గ్రామాలకు రహదారి సదుపాయం కల్పించాల్సి ఉంది. వంతాల నుంచి రాసపనుకు వరకు పొక్లెయిన్‌తో కొంతమేర పనులు చేసి వదిలేశారు. మిగతా రెండు గ్రామాల్లో కనీసం పనులు మొదలు పెట్టలేదు. రాసపనుకు పాఠశాల నాడు-నేడుకు ఎంపికైంది. నిర్మాణ సామగ్రి వెళ్లేందుకు కనీస మార్గం లేక ఆ పనులు నిలిచిపోయాయి. దీనిపై సర్పంచి పద్మ స్పందన కార్యక్రమంలో రెండు సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకునేవారే లేరు.

* పెదలోచలి పంచాయతీ పాచెలి నుంచి జోలంపట్టు వరకు నిర్మాణ పనులు మొదలు కాలేదు. కనీస దారి లేకపోవడంతో అనారోగ్యాలకు గురైతే డోలిమోతలు తప్పడం లేదు.

* గడుతూరు పంచాయతీలో వెదురుపల్లి నుంచి ఆకుతోట వరకు నిర్మించాల్సిన రహదారికి అధికారులు వచ్చి కొలతలు వేసుకొని వెళ్లిపోయారు. నెలలు గడుస్తున్నా పనులు మొదలు కావడం లేదు.

* లువ్వాసింగి పంచాయతీలో వంచెబు గ్రామానికి మట్టి పనులు చేసి బీటీ వేయలేదు. సంగులోయ నుంచి రాచకొండ వరకు మెటల్‌ వేసి వదిలేశారు.

మిషన్‌ కనెక్ట్‌లో ఎంపికైన కుమ్మరిగుంట-వంట్లమామిడి రహదారి పరిస్థితి

కొన్నింటికే పరిమితమా..?

మన్యంలో రహదారులు లేని గ్రామాలన్నింటికీ మిషన్‌ కనెక్ట్‌ ద్వారా రహదారి సదుపాయాలు కల్పిస్తామని అధికారులు చెబుతున్నా అందులో కొన్నింటికే పరిమితం చేశారు. జి.మాడుగుల మండలంలో లువ్వాసింగి పంచాయతీలో ఐదు రహదారులను ఎంపిక చేసి, మరో 8 గ్రామాలకు మొండిచేయి చూపారు. తడపాలెం, సంకులమిద్దె, బూసుపల్లి, చిలకలపాలెం, అలగం, ఏస్తాలు, కిల్లుపల్లి, మొనపల్లి ప్రజలు కనీస రహదారి సదుపాయాలు లేక అవస్థలు పడుతున్నారు.


అవస్థలు తీరతాయనుకున్నాం..

వంతాల పంచాయతీలో మూడు గ్రామాలకు రోడ్డు సదుపాయం కలుగుతుందని ఆశపడ్డాం. బీటీ రహదారులుగా మారుస్తామని చెప్పి కొలతలతో సరిపెట్టేశారు. పలుమార్లు ఐటీడీఏ పీవో, ఎమ్మెల్యేలకు ఫిర్యాదులు చేశాం. ఎవరూ స్పందించడం లేదు. వంతాల నుంచి రాసపనుకు వరకు గ్రామస్థులందరూ శ్రమదానంతో మట్టి రహదారి పనులు చేసుకుంటున్నాం. ఇప్పటికే కొంతమేర మట్టి రహదారి పనులు శ్రమదానంతో జరుగుతున్నాయి. ఇప్పటికైనా ఐటీడీఏ అధికారులు స్పందించాలని కోరుతున్నాం.

కొండబాబు, వంతాల


కొలతలు తీసినా పనులు మొదలవ్వలేదు

వెదురుపల్లి నుంచి ఆకుతోట వరకు రహదారి నిర్మిస్తామని అధికారులు కొలతలు తీసుకున్నారు. నెలలు గడుస్తున్నా పనులు ప్రారంభం కావడం లేదు. ఆకుతోట అత్యంత మారుమూల గ్రామం. అనారోగ్యానికి గురైన వారిని, గర్భిణులను తరలించడానికి డోలిమోతలు తప్పడం లేదు. బీటీ కాకపోయినా మెటల్‌ రోడ్డు సదుపాయమైనా కల్పించండి.

కొండపల్లి అప్పలమ్మ, సర్పంచి, గడుతూరు


ఆ గ్రామాలన్నింటికీ రోడ్లు నిర్మిస్తాం

మిషన్‌ కనెక్ట్‌లో భాగంగా గతంలో నిర్మాణ పనులు చేసిన వాటికి జిల్లా కలెక్టర్‌ నిధులు విడుదల చేశారు. నిధుల కొరత వంటి కొన్ని సమస్యలతో పలు రహదారి పనులు ఇంకా ప్రారంభం కాలేదు. విషయం ఐటీడీఏ పీవో, జిల్లా కలెక్టర్‌ దృష్టిలో ఉంది. ఎంపిక చేసిన గ్రామాలన్నింటికీ రహదారి సదుపాయం కల్పిస్తాం.

మాణిక్యం, మండల ఇంజినీరింగ్‌ అధికారి, జి.మాడుగుల

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని