logo

దేవుడి భూముల్లో దర్జాగా పాగా

ఆ భూములు ఆ ఊరి రాములోరి సొత్తు.. ఏళ్ల తరబడి అన్నదాతలు వాటిలో సాగుచేసుకుంటూ శిస్తులు చెల్లించేవారు.. కొన్నేళ్లు తర్వాత ఒకరిద్దరు రైతులు ఆ భూములు తమవేనంటూ పట్టాల్లో పేర్లు చేర్చుకున్నారు.

Updated : 30 May 2023 04:23 IST

ముత్యాలనాయుడి ఇలాకాలో ఆలయ భూములు అన్యాక్రాంతం
అధికారం అండతో గుప్పిట్లో పెట్టుకున్న స్థిరాస్తి వ్యాపారి
ఈనాడు డిజిటల్‌, అనకాపల్లి

దేవాదాయశాఖ భూమిలో  స్థిరాస్తి వ్యాపారి వేసిన తోట

ఆ భూములు ఆ ఊరి రాములోరి సొత్తు.. ఏళ్ల తరబడి అన్నదాతలు వాటిలో సాగుచేసుకుంటూ శిస్తులు చెల్లించేవారు.. కొన్నేళ్లు తర్వాత ఒకరిద్దరు రైతులు ఆ భూములు తమవేనంటూ పట్టాల్లో పేర్లు చేర్చుకున్నారు.. వాటిని వేరేవారికి అమ్మేసుకున్నారు.. ఇప్పుడు వారి నుంచి ఓ స్థిరాస్తి వ్యాపారి కొనుగోలు చేశారు. ఇవన్నీ గుట్టుచప్పుడు కాకుండానే జరిగిపోయాయి. ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు సొంతూరు తారువాని ఆనుకుని ఉన్న మారేపల్లి రెవెన్యూ పరిధిలో జరిగిన ఈ భూ బాగోతం గతేడాదే వెలుగులోకి వచ్చింది. దేవుడి భూములను కారుచౌకగా కొని లేఅవుట్‌ వేసి దారి కోసం మరో గుడి పేరుతో కొండను పేల్చి రోడ్డును నిర్మించేశారు. దేవాదాయ శాఖ పరిధిలో ఉండాల్సిన విలువైన భూములు పరుల చేతిలోకి వెళ్లినట్లు సంబంధింత అధికారులు కూడా గుర్తించారు. అయితే స్థిరాస్తి వ్యాపారికి అధికార పార్టీ నేతల అండదండలుండడంతో ఆ భూముల స్వాధీనం దిశగా అడుగులు వేయలేకపోతున్నారు. ఏడాదిగా కాగితాలతోనే కాలయాపన చేస్తున్నారు.

దేవరాపల్లి మండలం మారేపల్లి రెవెన్యూ సర్వే నంబరు 115లో 23.15 ఎకరాలు ఆ ఊరి శ్రీరామస్వామి వారి గుడి పేరున ఉంది. శారదా నదికి ఆనుకుని ఉన్న ఈ భూమి కాలక్రమంలో చేతులు మారుతూ రియల్‌ఎస్టేట్‌ వ్యాపారుల గుప్పిటలోకి వచ్చింది. అడంగల్‌లో గుడి పేరిట ఈ భూములు నమోదై ఉన్నా.. కొందరి రైతుల పేర్లను చేర్చి ఈ భూ బాగోతం నడిపించారు. గతంలో ఈ భూముల హక్కుల విషయమై కోర్టులకు ఎక్కినా న్యాయస్థానం కూడా అవి దేవుడి భూములుగానే పేర్కొంది. అయినా స్థిరాస్తి వ్యాపారి పట్టువదల కుండా ఈ భూములను తమవారి పేరిట పాసుపస్తుకాలు పొందడానికి ప్రయత్నించగా తహసీల్దారు తిరస్కరించారు. ఆ భూములపై వచ్చిన ఫిర్యాదు మేరకు అవి దేవాదాయ భూములో కాదో తేల్చి చెప్పాలని గతేడాది ఆ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌కు తహసీల్దారు లేఖ రాశారు. వారు కూడా ఈ భూములను పరిశీలించి అవి దేవాదాయ భూములేనని నిర్ధారించి వాటిపై ఎవరికీ హక్కులు కల్పించొద్దని సూచించారు. అయితే స్థిరాస్తి వ్యాపారికి అధికార పార్టీ నేతల ఆశీస్సులుండడంతో ఆయన చేతిలో ఉన్న దేవాదాయ భూములను స్వాధీనం చేసుకోవడానికి మాత్రం చొరవ చూపలేకపోతున్నారు. ఈ భూముల వ్యవహారంపై ఏడాది కాలంగా సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు దాసరి వెంకన్న అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. రూ.కోట్ల విలువైన 23.15 ఎకరాల భూములను 22 (ఎ) (1 సి)లో చేర్చి రిజిస్ట్రేషన్లు జరగకుండా చూడాలని డిమాండ్‌ చేస్తున్నా అధికారులు అదిగో.. ఇదిగో అంటూ తాత్సారం చేస్తూ వస్తున్నారు.

మారేపల్లిలో చేతులు మారిపోయిన 23.15 ఎకరాల భూమి ఈ గుడికి చెందిందే..

దేవాదాయ శాఖవేనని గుర్తించినా..

మారేపల్లిలోని స్థిరాస్తి వ్యాపారి చేతిలో ఉన్న 23.15 ఎకరాలకు తోడు మరో రెండు సర్వే నంబర్లలో కలిపి సుమారు 40 ఎకరాలు భూమి దేవాదాయ శాఖ చెందినవేనని గుర్తించారు. ఈ అడ్డగోలు భూ వ్యవహారంపై ఫిర్యాదులు అందిన మేరకు విచారణ జరిపి నివేదికను దేవాదాయ కమిషనరేట్‌కు పంపించారు. ఉన్నతాధికారుల నుంచి వచ్చే ఉత్తర్వుల కోసం జిల్లా అధికారులు ఎదురుచూస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఆ రియల్టర్‌ భూములను వదులుకోవడానికి ససేమిరా అంటున్నారు. అధికార పార్టీ నేతల అండతో ఆ భూములను అగ్రి ఫామ్‌గా అభివృద్ధి చేశారు.. మొక్కలు పెంచి.. వాటిని చూపించి బేరాలు పెడుతున్నారు. ఈ భూములు ఎప్పటికైనా దేవాదాయశాఖ చేతుల్లోకి వెళ్లిపోతాయని తెలిసినా ఆ భూమిని ప్లాట్లగా అమ్మకాలు చేయడానికి సిద్ధపడుతుండడం విశేషం. ఈ విషయమై జిల్లా దేవాదాయ శాఖ అధికారి రాజారావు వద్ద ప్రస్తావించగా మారేపల్లి సర్వే నంబరు 115లో భూములు దేవాదాయశాఖకు చెందినవేనని స్పష్టం చేశారు. 22ఏ (1సి)లో చేర్చడానికి ప్రతిపాదిస్తూ ఉన్నతాధికారులకు దస్త్రం పంపించామన్నారు. వారి నుంచి అనుమతి వచ్చాక మిగతా చర్యలు చేపడతామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని