logo

ప్రవేశాల వేళ.. ధ్రువపత్రాలు సిద్ధమా?

పది, ఇంటర్‌, డిప్లమో, డిగ్రీ, ఇంజినీరింగ్‌, మెడిసిన్‌ ఇలా వివిధ కోర్సుల్లో ప్రవేశానికి పరీక్షలు జరిగాయి. కౌన్సెలింగ్‌కు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Published : 30 May 2023 03:21 IST

పాడేరు పట్టణం, న్యూస్‌టుడే

పది, ఇంటర్‌, డిప్లమో, డిగ్రీ, ఇంజినీరింగ్‌, మెడిసిన్‌ ఇలా వివిధ కోర్సుల్లో ప్రవేశానికి పరీక్షలు జరిగాయి. కౌన్సెలింగ్‌కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ క్రమంలో విద్యార్థులు పై తరగతుల్లో చేరేందుకు అవసరమైన ధ్రువపత్రాలను సిద్ధం చేసుకోవాల్సి ఉంది. ప్రభుత్వ కార్యాలయాల నుంచి తీసుకునే వీటిపై ప్రతి ఒక్క విద్యార్థి అప్రమత్తంగా ఉండాలని విద్యావేత్తలు సూచిస్తున్నారు. చివరి వరకు వేచి చూడకుండా ముందస్తుగానే వీటిని పొందేలా చూసుకోవాలని పేర్కొన్నారు. కళాశాలల్లో ప్రవేశాలు, ఉద్యోగ నియామక ప్రక్రియల సమయంలో సంబంధిత ధ్రువపత్రాలు అవసరం చాలా ఉంటుంది. వాటిని అధికారులు నిశితంగా పరిశీలిస్తారు. అందువల్ల కనీసం రెండు, మూడు వారాల ముందుగానే అన్ని పత్రాలను సిద్ధం చేసుకోవాలి. సమయం దగ్గరకు వచ్చాక దరఖాస్తు చేస్తే కార్యాలయాల్లో సాంకేతిక సమస్యలు, ఇతర ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉంది.

కావాల్సినవి ఇవే

రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కుల, ఆదాయ, స్థానిక, నాన్‌ క్రీమీలేయర్‌ వంటి ధ్రువపత్రాలు విద్యార్థులకు అవసరం ఉంటుంది. ఇవి పాతవి ఉంటే నవీకరించుకోవాలి. కేంద్ర ప్రభుత్వ సంస్థలకు సంబంధించిన ఓబీసీ, ఆర్థికంగా బలహీన వర్గాల ధ్రువపత్రాలు అవసరం. ఆదాయ ధ్రువీకరణ పత్రాలకు ఏడాదే కాల పరిమితి ఉంటుంది. తాజాగా 2023 ఏప్రిల్‌ తరువాత జారీ చేసినవి మాత్రమే చెల్లుబాటవుతాయి. కుల ధ్రువీకరణ పత్రంలో పుట్టిన తేదీ కావాలంటే దరఖాస్తుకు జనన ధ్రువీకరణ ఆధారాలు జతచేయాలి. ఆధార్‌ కార్డు, దరఖాస్తు చిరునామాలు వేర్వేరుగా ఉంటే అధికారులను కలిసి సమస్య వివరించాలి. ప్రత్యామ్నాయ మార్గాలు తెలుసుకోవాలి. ఆదాయ, కుల, స్థానిక ధ్రువపత్రాలకు సంబంధించి గ్రామ సచివాలయం డిజిటల్‌ అసిస్టెంట్‌ వద్ద ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. చదివిన పాఠశాలల నుంచి తీసుకునే ధ్రువపత్రాలు సరిగా చూసుకోవాలి.


త్వరగా మంజూరుకు చర్యలు

వివిధ ప్రవేశపరీక్షలు, ఉద్యోగాలు, ఫీజ్‌రీయంబర్స్‌మెంట్‌, నూతన కోర్సులకు సంబంధించి అభ్యర్థులకు ఎలాంటి జాప్యం చేయకుండా త్వరితగతిన ధ్రువపత్రాలు మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. దరఖాస్తు చేసుకున్న వెంటనే త్వరగా పరిశీలన చేసి అందజేస్తున్నాం. రోజుకు 20 నుంచి 50 మంది వరకు వివిధ దరఖాస్తులు వస్తున్నాయి. విద్యార్థులు, నిరుద్యోగ యువత  ముందుగానే అవసరమైన ధ్రువ పత్రాలకు దరఖాస్తు చేసుకుంటే మంచిది.

వంజంగి త్రినాథ్‌రావునాయుడు, తహసీల్దారు, పాడేరు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని