logo

సచివాలయ ఉద్యోగిని హత్య!

అచ్యుతాపురంలో గిరిజన మహిళ హత్య కలకలం రేపింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న యువకుడే హత్య చేశాడని పోలీసులు, కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు.

Updated : 30 May 2023 04:37 IST

విగత జీవిగా మహాలక్ష్మి, మరుగుదొడ్డిలో శ్రీనివాసకుమార్‌

అచ్యుతాపురం, రాంబిల్లి, ఎలమంచిలి - న్యూస్‌టుడే: అచ్యుతాపురంలో గిరిజన మహిళ హత్య కలకలం రేపింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న యువకుడే హత్య చేశాడని పోలీసులు, కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. మృతురాలి బంధువులు, పోలీసుల కథనం ప్రకారం.. విశాఖ జీవీఎంసీ పరిధిలో గల కూర్మన్నపాలేనికి చెందిన గిరిజన యువతి మహాలక్ష్మి (27) అచ్యుతాపురంలోని ఓ లాడ్జిలో సోమవారం మృతిచెందింది. ఇదే గదిలోని మరుగుదొడ్డిలో భర్త మాడే శ్రీనివాసకుమార్‌ గాయాలతో కనిపించారు. వీరు ఇద్దరూ ఉంటున్న గది నుంచి కేకలు వినిపించడంతో లాడ్జి సిబ్బంది చూసి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి తలుపులు తీయించి చూడగా యువతి రక్తపు మడుగులో విగత జీవిగా పడిఉంది. పోలీసులు రావడంతో గాయాలతో ఉన్న శ్రీనివాసకుమార్‌ మరుగుదొడ్డిలోకి వెళ్లాడు. దాంతో తలుపు పగులగొట్టి బయటకు తీసుకొచ్చిన పోలీసులు అనకాపల్లి ఎన్టీఆర్‌ ఆసుపత్రికి తరలించారు.

విశాఖ ఉక్కు ఉద్యోగి సాంబ, కల్యాణి దంపతుల ఏకైక కుమార్తె మహాలక్ష్మి చదువుల్లో ముందుండేది. వ్యవసాయ బీఎస్సీ పూర్తిచేసి రాంబిల్లి మండలం కొప్పుగొండుపాలెం సచివాలయం పరిధిలో రైతు భరోసా కేంద్రంలో వ్యవసాయ సహాయకురాలిగా పనిచేస్తోంది. గాజువాక కళాశాలలో ఇంటర్‌ చదువుతున్న రోజుల్లోనే ఈమెకు సీనియర్‌ అయిన శ్రీనివాసకుమార్‌తో పరిచయమై ప్రేమగా మారింది. ఈ వ్యవహారం ఆమె తల్లిదండ్రులకు ఇష్టం లేకపోవడంతో రహస్యంగా రిజిస్ట్ర్టార్‌ కార్యాలయంలో పెళ్లి చేసుకొంది. సోమవారం ఎలమంచిలిలో వ్యవసాయశాఖ సహాయ సంచాలకులు నిర్వహించిన సమీక్షా సమావేశానికి ఆమె హాజరైంది. తర్వాత అచ్యుతాపురం వచ్చింది. రోజూ మాట్లాడినట్లే భోజన సమయంలో తల్లి కళ్యాణితో మాట్లాడింది. తల్లికి చెప్పకుండానే మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో లాడ్జీకి వచ్చింది. శ్రీనివాసకుమార్‌ ఉదయం 10.38 నిమిషాలకు రెసిడెన్సీలోని 303 గదిలోకి ఒక్కడే వచ్చిన్నట్లు సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. కొద్ది సమయం మాట్లాడుకున్న ఇద్దరు తరవాత పెద్దపెద్ద కేకలు వేసుకున్నారు. వీరు ఉన్న గది నుంచి పెద్దపెద్ద శబ్దాలు రావడంతో అనుమానం వచ్చిన లాడ్జి సిబ్బంది గమనించి తలుపులు తియ్యమన్నా దుస్తులు మార్చుకుంటున్నామని వచ్చేస్తామని చెప్పి సిబ్బందిని ఆయన నమ్మించాడు. సిబ్బందికి అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చిన తరవాత తలుపులు తీసి మరుగుదొడ్డిలోకి వెళ్లి గడియ పెట్టుకున్నాడు. సీఐ మురళీరావు, ఎస్సై సన్యాసినాయుడు దర్యాప్తు చేస్తున్నారు.

దర్యాప్తు చేస్తున్న సీఐ మురళీరావు, ఎస్సై సన్యాసినాయుడు

గతంలోనే ఫిర్యాదు చేసినా..

బీసీ వర్గానికి చెందిన శ్రీనివాసకుమార్‌ తల్లి, ఆడపడుచులు పలుమార్లు తక్కువ కులం పేరుతో తమ కుమార్తెను వేధించేవారని, వీటిని భరించలేక ఇంటికి వచ్చేసిందని మహాలక్ష్మి తల్లిదండ్రులు సాంబ, కళ్యాణి ‘న్యూస్‌టుడే’తో చెప్పారు. చివరికి విడాకులు తీసుకోవడానికి కోర్టును ఆశ్రయించినా ఆయన కోర్టుకు వచ్చేవాడు కాదన్నారు. రాంబిల్లి మండలంలో విధులు నిర్వహించడానికి వెళ్లే సమయంలో ద్విచక్ర వాహనంతో ఢీకొట్టి చంపడానికి ప్రయత్నించాడని, ఇంటికి వచ్చి చంపుతానని పలుమార్లు బెదిరించాడని ఆరోపించారు. కులంపేరుతో దూషించడం, వేధింపులు, చంపుతానని బెదిరించడంపై కూర్మన్నపాలెం పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని విచారం వ్యక్తం చేశారు. పోలీసులు పట్టించుకొని ఉంటే మహాలక్ష్మి బతికే ఉండేదని వాపోయారు.

అనుమానంతోనే..: శ్రీనివాసకుమార్‌కి మహాలక్ష్మిపై అనుమానం పెంచుకున్నాడని, స్నేహితులతో సరదాగా మాట్లాడినా తట్టుకోలేని విధంగా ప్రవర్తించే వాడని ఆమెతో పనిచేసే ఉద్యోగులు, అధికారులు తెలిపారు. ఆమె చాలా తెలివైందని ఆత్మహత్య చేసుకునే పిరికిది కాదని పలువురు చెప్పారు. రెండేళ్లుగా రైతులకు సేవలు అందిస్తున్న మహలక్ష్మి మృతితో కొప్పుగొండుపాలెంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని