logo

ఖాతాలకు చేరని ఖనిజ నిధి

జిల్లా ఖనిజాభివృద్ధి నిధి (డీఎంఎఫ్‌) రూపంలో లీజుదారుల నుంచి సొమ్ములైతే వసూలు చేస్తున్నారు.. వాటితో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు మాత్రం కనబడడం లేదు.

Published : 01 Jun 2023 02:47 IST

జిల్లాల్లో వనరుల ఆధారంగా డీఎంఎఫ్‌ వాటాలు
రెండేళ్లుగా సొమ్ముల్లేక నిలిచిన అభివృద్ధి పనులు
ఈనాడు డిజిటల్‌, పాడేరు

ఓ మైనింగ్‌ ప్రాంతం

ఇటీవలే జిల్లాల వారీగా ఈ శాఖను విభజించి సహాయ సంచాలకుల స్థానంలో జిల్లా గనులశాఖ అధికారి పేరిట కొత్త కార్యాలయాలు తెరిచారు. వాటి పేరున పీడీ ఖాతాలు తెరిచి డీఎంఎఫ్‌ నిధుల కోసం ఎదురుచూస్తున్నారు.

జిల్లాల వారీగా కొత్త ఖాతాలు తెరవకపోవడంతో ఆ సొమ్మును వాటాలు వేసుకోలేకపోయారు. కొన్నినెలల తర్వాత సమానంగా కాకుండా ఏ జిల్లాలో లీజులు ఎక్కువగా ఉంటాయో వాటి ఆధారంగా డీఎంఎఫ్‌ పంపకాలు చేసుకోవాలని ఆదేశించారు.

జిల్లా ఖనిజాభివృద్ధి నిధి (డీఎంఎఫ్‌) రూపంలో లీజుదారుల నుంచి సొమ్ములైతే వసూలు చేస్తున్నారు.. వాటితో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు మాత్రం కనబడడం లేదు. జిల్లాల పునర్విభజనకు ముందు నుంచి ఈ నిధులు అందుబాటులో లేకుండా పోయాయి. నిన్నమొన్నటి వరకు గనులు భూగర్భశాఖ ఉమ్మడిగా కొనసాగడంతో ఈ నిధులను జిల్లా ఖాతాకు సర్దుబాటు చేయకుండా డైరెక్టరేట్‌లోనే అట్టిపెట్టుకున్నారు.

ఉమ్మడి జిల్లాలో గనులు, క్వారీలను అధికారికంగా లీజులకు తీసుకున్న నిర్వాహకులు సీనరేజి ఛార్జిల్లో 30 శాతం డీఎంఎఫ్‌గా చెల్లించాల్సి ఉంటుంది. ఇలా 2019-20 నుంచి గతేడాది జూన్‌ వరకు సుమారు రూ.55.69 కోట్లు నిధులు జిల్లాకు అందుబాటులోకి వచ్చాయి. కొవిడ్‌ కాలంలో ఖర్చుల కోసమని రూ.6.69 కోట్లు ప్రభుత్వం వాడుకుంది. మిగతా రూ.49.6 కోట్లు ఉమ్మడి జిల్లా ఖాతాలోనే ఉండిపోయాయి. 2022 జూన్‌ 14 తర్వాత నుంచి వసూళ్లు చేసిన డీఎంఎఫ్‌ నిధులు సుమారు రూ.9.28 కోట్లు డైరెక్టరేట్‌ ఖాతాలో పెట్టుకున్నారు. వీటి పంపకాలపై తలోరకంగా ఆదేశాలివ్వడంతో అధికారులు అయోమయానికి గురవ్వాల్సి వచ్చింది. మొదట మూడు జిల్లాలకు సమానంగా రూ.16 కోట్లు చొప్పున పంచుకోవాలని సూచించారు.

మూడేళ్ల క్రితం కశింకోట వద్ద డీఎంఎఫ్‌ నిధులతో వంతెన నిర్మాణానికి వేసిన శిలాఫలకం

ఆ లెక్కన చూస్తే అనకాపల్లి జిల్లాకు భారీగా డీఎంఎఫ్‌ సొమ్ము అందుబాటులోకి రానుంది. విశాఖ, అల్లూరి జిల్లాలకు ఈ నిధులు తక్కువ మొత్తంలోనే సమకూరనున్నాయి. కొత్త జిల్లాల వారీగా ఖాతాలు తెరిచినా ఖాజానా కార్యాలయాలతో వాటిని అనుసంధానించడంలో జాప్యం జరుగుతోంది. దీనివల్ల నిధులు కాగితాల్లో కనిపిస్తున్నా ఖర్చుపెట్టడానికి వీల్లేకుండా పోతుంది.

వినియోగంపై ఆంక్షలు

గనుల తవ్వకాలతో ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభావితమయ్యే 10 నుంచి 25 కిలోమీటర్ల పరిధిలోని గ్రామాల్లో అభివృద్ధి పనులకు ఈ నిధులను వినియోగించుకోవచ్చు. తాగునీరు, విద్య, వైద్య సేవలకు ఎక్కువగా ఉపయోగించాలి. తర్వాత ప్రాధాన్యాంశంగా రోడ్లు, ఇతర పనులు చేపట్టొచ్చు. గత ప్రభుత్వ హయాంలో ఈ నిధులను జిల్లా అధికారులు బాగానే ఉపయోగించుకున్నారు. వైకాపా సర్కారు వచ్చాక డీఎంఎఫ్‌ నిధుల వినియోగానికి అవరోధాలు ఎదురవుతున్నాయి. ఖాతాల్లో కనిపించే నిధులు చేతికి చిక్కడం లేదు. ఉన్న సొమ్ముల వినియోగంపై ఆంక్షలు పెట్టడంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. కశింకోట వద్ద శారదా నదిపై కాలిబాట వంతెనకు మూడేళ్ల క్రితం ఈ నిధులతోనే శంకుస్థాపన చేశారు. పునాదుల స్థాయిలోనే ఈ పనులు నిలిచిపోయాయి..అల్లూరి జిల్లాలోనూ డీఎంఎఫ్‌ నిధులతో చేపట్టిన పనుల్లో కదలిక లేకుండా పోయింది.

త్వరలో ఖాతాల్లో జమ..: గతేడాదికి సంబంధించి సుమారు రూ.6 కోట్లు అనకాపల్లి జిల్లాకు అందుబాటులో వచ్చాయి. ఇటీవలే జిల్లాల వారీగా కొత్త ఖాతాలు తెరిపించాం. ఖజానా కార్యాలయంలో ఖాతాల మ్యాపింగ్‌ ప్రక్రియ పూర్తయితే ఆ నిధులు కనిపిస్తాయి. అంతకుముందు ఉమ్మడి జిల్లా ఖాతాలో ఉండిపోయిన నిధులను జూన్‌ మొదటి వారంలో దామాషా ప్రకారం మూడు జిల్లాలకు సర్దుబాటు చేస్తారు. వాటిని కలెక్టర్‌ ఆదేశాల మేరకు ఖర్చుచేయడానికి వీలుంటుంది.

సుబ్బారాయుడు, జిల్లా గనులశాఖ అధికారి, అనకాపల్లి

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని