logo

అడ్డదారుల్లో ఆగని తరలింపు

తాజాగా ఏపీగురుకుల కళాశాలల వసతిగృహాలకు కాయగూరలను సరఫరా చేసే లక్ష్మణ్‌ అనే గూడెంకొత్తవీధికి చెందిన గుత్తేదారు తమ వాహనాల్లో గంజాయిని తరలిస్తుండగా పోలీసులకు చిక్కారు.

Published : 02 Jun 2023 02:42 IST

గంజాయి నిర్మూలన మాటల్లోనే
నిత్యం వెలుగుచూస్తున్న దందా
చింతపల్లి, సీలేరు, న్యూస్‌టుడే

తాజాగా ఏపీగురుకుల కళాశాలల వసతిగృహాలకు కాయగూరలను సరఫరా చేసే లక్ష్మణ్‌ అనే గూడెంకొత్తవీధికి చెందిన గుత్తేదారు తమ వాహనాల్లో గంజాయిని తరలిస్తుండగా పోలీసులకు చిక్కారు.

* ఈ ఏడాది ఏప్రిల్‌ 5న బీటెక్‌ చదువుతున్న ఎం.సాయి సురేంద్ర 24 కేజీల గంజాయి తరలిస్తూ  పోలీసులకు పట్టుబడ్డాడు.

* మోతుగూడెం పోలీస్‌స్టేషన్‌ ఎస్సైగా పనిచేస్తున్న వాసంశెట్టి సత్తిబాబు గంజాయి రవాణాదారులకు సహకరించినట్లు నెల్లూరులో సెబ్‌ అధికారులు గుర్తించారు. ఈ సమాచారంతో ఆయన పరారయ్యారు. ఇటీవల పోలీసులకు ఆయన లొంగిపోయారు.

* ఏప్రిల్‌ 13న ఒడిశాలోని చిత్రకొండ నుంచి గంజాయి తరలిస్తున్న ముగ్గురు ఇంజినీరింగ్‌ విద్యార్థులను  పోలీసులు కటకటాల్లోకి తరలించారు.

* చింతపల్లిలో మందుల దుకాణం నడిపే ఒకరు గతంలో గంజాయి తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఆర్‌ఎంపీ ముసుగులో ఈయన మారుమూల గ్రామాలకు వెళ్లి అక్కడ వైద్యం పేరుతో గిరిజనులను మచ్చిక చేసుకుని గంజాయి వ్యాపారం చేసేవారు. విషయం తెలిసి ఒక రోజు పోలీసులు ఇతన్ని అరెస్టు చేశారు.

* కొన్ని దశాబ్దాలుగా నర్సీపట్నం నుంచి సీలేరు వెళుతున్న ఒక ప్రైవేటు బస్సులో ఇటీవల ఏటిగైరంపేట వద్ద పోలీసుల తనిఖీల్లో గంజాయి చిక్కింది. ఈ వ్యవహారంలో బస్సు డ్రైవర్‌, కండక్టర్ల పాత్ర ఉండటంతో వారిని పోలీసులు అరెస్టు చేశారు.

..ఇలా ఒకట్రెండు కాదు.. నిత్యం ఎక్కడో ఒక చోట.. ఏదో రూపంలో.. ఏదో మార్గంలో మన్యం మీదుగా గంజాయి తరలిపోతూనే ఉంది.  తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఏ మూల దొరికినా దాని మూలాలు అల్లూరి జిల్లాతోనే ముడిపడి ఉంటున్నాయి. ఇది  పోలీసు యంత్రాంగానికి పెద్ద సవాలుగా మారింది. జిల్లాలో గంజాయి సాగును పూర్తిగా నియంత్రించామని పోలీసు అధికారులు చెబుతున్నారు. నిజానికి సాగు తగ్గితే సాధారణంగా రవాణా సైతం తగ్గాలి. దీనికి భిన్నంగా రోజూ ఉమ్మడి విశాఖ జిల్లాలో ఎక్కడో ఒక చోట గంజాయి చిక్కుతూనే ఉంది. ఒడిశా భూభాగంలో పండించిన గంజాయిని వివిధ రహస్య స్ధావరాలకు తరలించి వాటిని వివిధ మార్గాల ద్వారా మైదానప్రాంతాలకు చేరవేస్తున్నారు. ఈ వ్యవహారంలో అధికంగా అల్లూరి జిల్లాకు చెందిన యువకులే అధికంగా ఉంటున్నారు. డబ్బుకోసం ఆశపడి స్మగర్ల వలకు వీరు చిక్కుతున్నారు.

ఆపరేషన్‌ పరివర్తన్‌ కార్యక్రమంపై అవగాహన కల్పిస్తున్న పోలీసులు (పాతచిత్రం)

ఆపరేషన్‌ పరివర్తన్‌లో భాగంగా ..

నిన్నమొన్నటి వరకూ గిరి యువతను మావోయిస్టులకు దూరం చేయడమే ప్రధానంగా పనిచేసిన పోలీసులు ఇప్పుడు గిరిజనుల జీవితాలను నాశనం చేసే గంజాయికి దూరంగా పెట్టాలని నిర్ణయించారు. ఆపరేషన్‌ పరివర్తన్‌ పేరుతో మన్యంవ్యాప్తంగా ఉన్న తోటలను ధ్వంసం చేశారు. సుమారు ఆరువేల ఎకరాల్లో లక్షలాది గంజాయి మొక్కలను తొలగించారు. రెండో దశలో గిరిజనులను క్షేత్రస్థాయిలో గంజాయి సాగుకు దూరంగా ఉండాలని ఇందుకు బదులు అధిక ఆదాయాన్నిచ్చే పంటలను పండించాలంటూ విస్తృతంగా ప్రచారం చేశారు. అయినా చాటుమాటుగా కొన్నిచోట్ల గిరిజనులు వ్యాపారులు ఇచ్చే డబ్బులకు ఆశపడి గంజాయిని పండిస్తున్నారన్న తెలుసుకున్న పోలీసులు దూకుడు పెంచారు. అయితే ఒడిశా సరిహద్దు ప్రాంతంలో మావోయిస్టుల కదలికల నేపథ్యంలో అక్కడికి చొచ్చుకుపోవడం పోలీసులకు ఇబ్బందికరంగా మారింది.

దశల వారీగా..

ఆపరేషన్‌ పరివర్తన్‌లో భాగంగా తొలుత గంజాయి తోటలను ధ్వంసం చేశాం. మార్పుకోసం గ్రామాల్లో యువతకు అవగాహన కల్పిస్తున్నాం. వారికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నాం, అవసరమైన శిక్షణ అందిస్తున్నాం. అధిక ఆదాయాన్నిచ్చే పంటలను పండించుకోవాలని సూచిస్తున్నాం. ప్రభుత్వం ద్వారా వారికి రాయితీపై రాజ్‌మా, జాప్రా, మినుములు వంటి విత్తనాలు అందిస్తున్నాం. మూడో అస్త్రంగా కేసులు, అరెస్టులు, భూముల జప్తు వంటి కఠిన చర్యలకు ఉపక్రమిస్తున్నాం.

గంజాయితో దొరికిన నిందితులు, వారినుంచి స్వాధీనం చేసుకున్న వాహనాలు, ఇతర సామగ్రి

ప్రతాప్‌ శివకిశోర్‌, ఏఎస్పీ, చింతపల్లి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని