logo

సెలవులో సారు.. బాధ్యులెవరూ..

ఎంపీడీవో సెలవులో ఉన్నారు. ఆయన స్థానంలో బాధ్యతలు చేపట్టాల్సిన అధికారి ఎవరు అంటే ఏమో అనే సమాధానం వినిపించింది. సంతకాల కోసం వచ్చిన సచివాలయ ఉద్యోగులకు జీకేవీధిలో ఈ వింత అనుభవం ఎదురైంది.

Published : 02 Jun 2023 02:42 IST

ఖాళీగా ఎంపీడీవో కుర్చీ

గూడెంకొత్తవీధి, న్యూస్‌టుడే: ఎంపీడీవో సెలవులో ఉన్నారు. ఆయన స్థానంలో బాధ్యతలు చేపట్టాల్సిన అధికారి ఎవరు అంటే ఏమో అనే సమాధానం వినిపించింది. సంతకాల కోసం వచ్చిన సచివాలయ ఉద్యోగులకు జీకేవీధిలో ఈ వింత అనుభవం ఎదురైంది. నాలుగు రోజులుగా మండల స్థాయి అధికారి సెలవులో ఉంటే ఆ కార్యకలాపాలను కొనసాగించే బాధ్యులెవరూ లేకపోవడం గమనార్హం. జీకేవీధి మండల పరిషత్తు అభివృద్ధి అధికారిగా ఉమామహేశ్వరరావు పనిచేస్తున్నారు. ఈయన సోదరుడు అకస్మాత్తుగా అనారోగ్యానికి గురైతే ఆదివారం సెలవుపెట్టి వెళ్లిపోయారు. ఆయన ఈవోపీఆర్డీకి బాధ్యతలు ఇస్తున్నట్లు లేఖ రాసి వెళ్లిపోయారు. అయితే ఈవోపీఆర్డీ తనకు అధికారికంగా బాధ్యతలు అప్పగించలేదని ఎంపీడీవో విధులు చేపట్టడం లేదు. వ్యవసాయాధికారికి బాధ్యతలు ఇచ్చారని, మండల పరిషత్‌ సీనియర్‌ అసిస్టెంట్‌కూ ఇచ్చారని ఇలా రకరకాలుగా చెబుతున్నారు. అసలు ఈ బాధ్యతలు అధికారికంగా ఎవరికి అప్పగించారన్నది స్పష్టత లేక ఎవరూ నిర్వహించడం లేదు. సచివాలయాల ఉద్యోగులు బదిలీలకు దరఖాస్తు చేసుకునేందుకు నో డ్యూ ధ్రువపత్రంలో ఎంపీడీవో సంతకం కోసం వారంతా సోమవారం నుంచి కార్యాలయానికి వచ్చి బాధ్యులు ఎవరో తెలుసుకోలేక నిరాశగా వెనుదిరుగుతున్నారు. ఎంపీడీవో ఇచ్చిన ధ్రువపత్రం ఆధారంగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుని ఆ పత్రాలు పాడేరులో అప్పగించాల్సి ఉంది. అందుకు గడువు ఈనెల 3 వరకే ఉండటంతో గురువారం కూడా ఉద్యోగులు కార్యాలయానికి వచ్చారు. అక్కడ కింది స్థాయి సిబ్బంది తప్పా అధికారులెవరూ లేరు. ఎంపీడీవో బాధ్యతలు ఎవరు చేపడుతున్నారో తెలియక, మరోవైపు బదిలీలకు ఒక్కరోజే గడువు ఉండటంతో ఆందోళన చెందుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని