అమ్మకానికి జగనన్న ఇళ్లు!
జగనన్న ఇళ్ల కాలనీ వ్యవహారం చోడవరంలో ప్రారంభం నుంచి ప్రహసనంగా తయారైంది. ఇళ్ల నిర్మాణాలు అన్ని గుత్తేదారు చేస్తాడు అంటూ అధికార పార్టీ నాయకులు చెప్పడంతో నగదు చెల్లించి లబ్ధిదారులు మోసపోయారు.
లబ్ధిదారుల అవసరాలు.. దళారుల ప్రలోభాలు
అనధికారికంగా చేతులు మారుతున్న స్థలాలు
ఈనాడు డిజిటల్, అనకాపల్లి, చోడవరం, న్యూస్‌టుడే
అమ్మకాలు జోరుగా సాగుతున్న నర్సయ్యపేట లేఅవుట్ ఇదే..
జగనన్న ఇళ్ల కాలనీ వ్యవహారం చోడవరంలో ప్రారంభం నుంచి ప్రహసనంగా తయారైంది. ఇళ్ల నిర్మాణాలు అన్ని గుత్తేదారు చేస్తాడు అంటూ అధికార పార్టీ నాయకులు చెప్పడంతో నగదు చెల్లించి లబ్ధిదారులు మోసపోయారు. ఇదొక పెద్ద కుంభకోణంగా మిగిలింది. ఈ వివాదం ముగియకముందే మరో వ్యవహారం తెర పైకి వచ్చింది. జగనన్న లేఅవుట్‌లో అమ్ముతామంటూ ఇళ్ల పట్టా వివరాలు సామాజిక మాధ్యమాలలో పెడుతున్నారు. దీనిపై పరిశీలించగా పలు అంశాలు వెలుగుచూశాయి. దాదాపు 200కి పైగా ఇంటి స్థలాల అమ్మకాలు జరిగాయి. దాదాపు రూ.కోటికి పైగా నగదు చేతులు మారింది. ఈ అమ్మకాలలో లబ్ధిదారుల కన్నా స్థిరాస్తి వ్యాపారం చేసే మధ్యవర్తులే బాగా లబ్ధి పొందారు. ప్రస్తుతం చోడవరంలో జగనన్న లేఅవుట్‌లో స్థలం రూ.లక్షన్నర నుంచి రూ.పది లక్షల వరకు ధర పలుకుతోంది.
చోడవరం నుంచి చీడికాడ వెళ్లే రహదారి పక్కన నర్సయ్యపేట రెవెన్యూ భూమిలో 1, 2, 3 పేరిట వై.ఎస్.ఆర్ జగనన్న ఇళ్ల కాలనీలుగా మూడు లేఅవుట్‌లను రెవెన్యూ వర్గాలు వేశాయి. ఈ మూడు లేఅవుట్‌లలో 528 మందికి ఇళ్లు కేటాయించారు. చోడవరం పట్టణ ప్రజలతో పాటు నర్సయ్యపేట, లక్ష్మీపురం, గాంధీగ్రామం, శ్రీరామపట్నం, అంకుపాలెం, దామునాపల్లి గ్రామాలకు చెందిన ఇళ్లు లేని నిరు పేదలకు ఇళ్ల స్థల పట్టాలను అందజేశారు. 2022 ఫిబ్రవరి 2న అప్పటి గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరకువాడ శ్రీరంగనాథరాజు చేతులమీదుగా నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయించారు. ఏడాదిలో పూర్తి చేసి సీఎం జగన్ చేతులు మీదుగా ప్రారంభోత్సవాలు చేయిస్తామని ప్రభుత్వ విప్ ధర్మశ్రీ ప్రకటించారు. నేటికి పూర్తయినవి 12 ఇళ్లే. ఇవి కాక చోడవరం నుంచి సింహాద్రిపురం వెళ్లే దారిలో వాటర్ వర్క్స్ వద్ద వేసిన మరో లేఅవుట్‌లో 238 మందికి ఇళ్ల పట్టాలిచ్చారు.
* చోడవరం వాటర్ వర్స్క్ వద్ద లేఅవుట్‌లో 132 ప్లాట్ నం. రాయి సత్యవతి. ఈమెది పి.ఎస్.పేట గ్రామం. తనకు కేటాయించిన స్థలం అమ్ముతానంటూ వాట్సాప్‌లో పోస్టు చేశారు. 72 గజాల విస్తీర్ణం ఉన్న ప్లాట్ రూ. లక్షన్నరకు అమ్ముతారని ఆమె పేరున ఎం.నాగరాజు అనే వ్యక్తి వివిధ వాట్సాప్ గ్రూప్‌లలో సమాచారం పెట్టాడు. ఇళ్ల స్థలం పట్టాతో పాటు సరిహద్దులు తెలిపే ఫామ్ గ్రూప్‌లో ఉంచాడు.
అధికారులు ఏమంటున్నారంటే...
జగనన్న ఇళ్ల కాలనీలో ఇళ్ల కొనుగోలు చేయడం నేరమని హౌసింగ్ ఏఈ రమణమూర్తి అన్నారు. ఇళ్ల అమ్మకాలు జరుగుతున్న విషయం తమ దృష్టికి రాలేదన్నారు. ఎవరు కొనుగోలు చేసినా హక్కులన్నీ పట్టాదారులకే ఉంటాయి. కోర్టుకు వెళ్లినా చెల్లదని ఆయన స్పష్టం చేశారు. ఎవరైనా కొనుగోలు చేస్తే నష్టపోతారని చెప్పారు. అమ్మకాలు జరిపినట్టు రుజువైతే చట్టపరమైన చర్యలు తీసుకుంటారని ఏఈ రమణమూర్తి ‘న్యూస్‌టుడే’కు చెప్పారు. తహసీల్దారు ఎల్.తిరుమలబాబు మాట్లాడుతూ అమ్మకాలు జరుగుతున్నట్లు ఎవరూ ఫిర్యాదు చేయలేదన్నారు. అమ్మినట్లు పక్కాగా రుజువులతో తేలితే పట్టాను రద్దు చేస్తామని తెలిపారు.
నర్సయ్యపేట లేఅవుట్‌లో 40 శాతం పైగా కాలనీ ఇళ్ల అమ్మకాలు జరిగిపోయాయి. పునాదులు తీసిన తన ఇంటి స్థల పట్టాను పది లక్షలకు అమ్ముతానంటూ ఓ లబ్ధిదారుడు స్థిరాస్తి వ్యాపారం చేసే మధ్యవర్తులకు తెలిపాడు. ఇక్కడ రహదారి పక్కన ఉన్న స్థలాలకు గిరాకీ ఎక్కువగా ఉంది. రూ.ఏడు లక్షల నుంచి తొమ్మిది లక్షల వరకు అమ్మకాలు జరిగాయి. రహదారికి దూరంగా ఉండే ఖాళీ స్థలాలు రెండున్నర లక్షలకు అమ్ముతున్నారు. ప్రభుత్వమిచ్చే రుణంతో కలిపి స్థలం కావాలంటే రూ.ఆరు లక్షలు లేదా రుణం అవసరం లేకుండా కేవలం ఖాళీ ఇంటి స్థల పట్టా కావాలంటే రూ.రెండున్నర లక్షలుగా అమ్మకాలు సాగుతున్నాయని ఓ మధ్యవర్తి ‘న్యూస్‌టుడే’కు తెలిపారు. నర్సయ్యపేట లేఅవుట్‌లో లబ్ధిదారుల కంటే కొనుగోలు చేసుకున్న కొత్త వ్యక్తులే ఇళ్ల నిర్మాణాలు చేసుకుంటుండటం గమనార్హం. అధికారులు లోతుగా పరిశీలిస్తే అమ్మకాలు బయటపడతాయి. నర్సయ్యపేట జగనన్న లేఅవుట్ స్థిరాస్తి వ్యాపారంలో ఉండే మధ్యవర్తులకు అడ్డాగా మారిపోయింది.
చీడికాడ రహదారిలో నర్సయ్యపేట రెవెన్యూలో వేసిన లేఅవుట్‌కు 2022లో గృహనిర్మాణ శాఖ మంత్రి శ్రీరంగనాథరాజు ఆవిష్కరించిన శంకుస్థాపన శిలాఫలకం
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Devara: ‘దేవర’.. ఒక్క సంభాషణా కట్ చేయలేం.. పార్ట్ 2 ప్రకటించిన కొరటాల శివ
-
Rahul Gandhi: అమ్మకు రాహుల్ సర్ప్రైజ్ గిఫ్ట్.. ఏమిచ్చారంటే..?
-
Supriya Sule: ‘హనీమూన్’ ముగియక ముందే.. మహా ప్రభుత్వంలో ముసలం?
-
Raviteja: ఆ పదాన్ని వాడడం మానేయాలని అభ్యర్థిస్తున్నా: రవితేజ
-
Vivo mobiles: 50MP సెల్ఫీ కెమెరాతో వీవో కొత్త ఫోన్లు.. ధర, ఫీచర్లివే..!
-
Chandrababu Arrest: చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా