logo

బదిలీల సందడి.. సిఫార్సులు దండి!

ప్రభుత్వశాఖల్లో సాధారణ బదిలీల సందడి కొనసాగుతోంది. కొన్నిశాఖల్లో ఈ ప్రక్రియ పూర్తయ్యింది. నేతలతో పైరవీలు చేయించుకున్న వారికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలిసింది.

Updated : 02 Jun 2023 03:05 IST

ఈనాడు డిజిటల్‌, పాడేరు, అనకాపల్లి

ప్రభుత్వశాఖల్లో సాధారణ బదిలీల సందడి కొనసాగుతోంది. కొన్నిశాఖల్లో ఈ ప్రక్రియ పూర్తయ్యింది. నేతలతో పైరవీలు చేయించుకున్న వారికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలిసింది. ఎమ్మెల్యేందరూ సిఫార్సు లేఖలు ఇచ్చారు.. కొందరైతే ఇద్దరేసి ఎమ్మెల్యేలు, మంత్రుల లేఖలు జతచేసి మరీ దరఖాస్తులిచ్చారు. ఉద్యోగ సంఘాల పేరుతో మరికొందరు ఒత్తిళ్లు తెచ్చారు.. వాటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని బదిలీల జాబితాను తయారు చేసి కలెక్టర్‌ ఆమోదంతో ఉత్తర్వులు జారీచేస్తున్నారు. కొన్నిశాఖలు ఇంకా బదిలీల వివరాలను బయటపెట్టడం లేదు.

జలవనరుల శాఖలో..

ఇంజినీరింగ్‌ అధికారుల బదిలీల ప్రక్రియ ఈఎన్సీ కార్యాలయంలో జరుగుతోంది. ఆ జాబితా రెండు రోజుల తర్వాత వస్తుందని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. ఎస్‌ఈ పరిధిలో సీనియర్‌, జూనియర్‌ అసిస్టెంట్లు, ఇతర క్యాడర్లకు సంబంధించి బదిలీలు పూర్తిచేశారు. వారిలో దీర్ఘకాలం ఒకేచోట పనిచేసిన ఒకరిద్దరిని దూర ప్రాంతానికి బదిలీ చేయకుండా సర్కిల్‌ నుంచి డివిజన్‌ కార్యాలయానికి కదిపి వదిలేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ బదిలీలపై కొంతమంది ఫిర్యాదుకు సిద్ధమవుతున్నారు.

డీఆర్‌డీఏ పరిధిలో..

జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఏ) పరిధిలో గతేడాది బదిలీల్లో ఏజెన్సీ నుంచి మైదాన ప్రాంతానికి రావాల్సిన సిబ్బంది సిఫార్సులు కారణంగా రాలేకపోయారు. దీంతో ఈ ఏడాది ముందే మేల్కోని అక్కడ సిబ్బంది కలెక్టర్‌ దృష్టికి తమ సమస్యలను తీసుకువెళ్లారు. దీనిపై సంబంధిత అధికారికి కలెక్టర్‌ కాల్‌ చేసినా స్పందించలేదని సమాచారం. దీంతో నేరుగా సెర్స్‌ సీఈవోతోనే మాట్లాడి అక్కడి నుంచే బదిలీ ఉత్తర్వులు జారీ అయ్యేలా చేసినట్లు తెలిసింది. పాడేరు నుంచి తొమ్మిది మంది వివిధ క్యాడర్ల సిబ్బంది ఈ సారి మైదాన ప్రాంతానికి బదిలీ అయ్యారు. విశాఖపట్నం నుంచి మరో ఏడుగురికి బదిలీలు చేశారు. వారిలో కొంతమంది సిఫార్సులతో డిప్యుటేషన్లు రద్దు చేయించుకున్నట్లు సమాచారం.

పంచాయతీరాజ్‌ శాఖ పరిధిలో..

అనకాపల్లి జిల్లా పంచాయతీ అధికారి పరిధిలో 11 మంది, అల్లూరి జిల్లాలో అయిదుగురు పంచాయతీ కార్యదర్శులకు స్థాన చలనం కల్పించారు. అనకాపల్లి నుంచి ఏజెన్సీకి ముగ్గురు కార్యదర్శులను పంపిస్తున్నారు. ఏజెన్సీ నుంచి కొంతమంది కిందకు రావడానికి ప్రయత్నించినా బదిలీల్లో వారికి చోటులేకుండా చేసినట్లు తెలిసింది. సచివాలయాల్లో గ్రేడ్‌-5 కార్యదర్శుల బదిలీల ప్రక్రియ ఇప్పుడిప్పుడే మొదలైంది.

వైద్యారోగ్య శాఖలో.. ఏపీఎన్జీవో వివాదం

వైద్యారోగ్య శాఖ బదిలీల్లో పారదర్శకత లోపిస్తోందని కొందరు ఫిర్యాదు చేయడం మొదలుపెట్టారు. ఏపీఎన్జీవో ఎన్నికల నిర్వహణలో లోపముందని.. మార్గదర్శకాలేవీ పాటించకుండా సభ్యులను ఎన్నుకున్నారని పిటీషన్‌లో పేర్కొన్నారు. దీనిపై ప్రతివాదులు కౌంటర్‌ దాఖలు చేసేవరకు ఆర్థికపరమైన అంశాల్లోగానీ, బదిలీల్లోగానీ ఆ సంఘం సభ్యుల ప్రభావం ఉండకూడదని న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. దీంతో వైద్యారోగ్య శాఖ బదిలీల నుంచి ఈసారి ఏపీఎన్జీవో నేతలకు మినహాయింపు ఉండకపోవచ్చని పలువురు భావిస్తున్నారు. ఈ విషయమై వైద్యారోగ్య శాఖ ప్రాంతీయ సంచాలకురాలు ఉమాసుందరి వద్ద ప్రస్తావించగా ఆ వివాదం తమ దృష్టికి వచ్చిందన్నారు. దానిపై కలెక్టర్‌కు నోట్‌ఫైల్‌ పెట్టి ఆయన ఆదేశాల మేరకు ముందుకు వెళ్తామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని