logo

ఇంతకీ ఎన్ని అడుగులు..?

జిల్లా కేంద్రమైన పాడేరు పట్టణంలో రోడ్డు విస్తరణకు సంబంధించి అధికారుల్లో సమన్వయ లోపం కొట్టొచ్చిన్నట్లు కనిపిస్తోంది. గత వారం రోజులుగా చోటు చేసుకుంటున్న పరిణామాలు స్థానిక వ్యాపారులను కలవరానికి గురి చేస్తున్నాయి.

Published : 03 Jun 2023 02:39 IST

జిల్లా కేంద్రం రోడ్డు విస్తరణలో గందరగోళం
ఆక్రమణల తొలగింపులో సమన్వయ లోపం

పాడేరు/పట్టణం, న్యూస్‌టుడే : జిల్లా కేంద్రమైన పాడేరు పట్టణంలో రోడ్డు విస్తరణకు సంబంధించి అధికారుల్లో సమన్వయ లోపం కొట్టొచ్చిన్నట్లు కనిపిస్తోంది. గత వారం రోజులుగా చోటు చేసుకుంటున్న పరిణామాలు స్థానిక వ్యాపారులను కలవరానికి గురి చేస్తున్నాయి. రోడ్డు విస్తరణలో భాగంగా రెవెన్యూ, ఆర్‌అండ్‌బీ, పంచాయతీ అధికారులు సమన్వయంతో వ్యవహరించాల్సి ఉంది. దీనికి భిన్నంగా స్థానిక పంచాయతీ సర్పంచికి కనీస సమాచారం ఇవ్వకుండానే విస్తరణ పనులు చేపడుతుండడం వివాదాస్పదమైంది. దీనిపై ఆగ్రహించిన సర్పంచి ఉషారాణి జరుగుతున్న తాజా పరిణామాలపై కలెక్టర్‌, ఇతర ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం గమనార్హం.

ఆర్టీసీ కాంప్లెక్సు వద్ద కూల్చేసిన దుకాణాలు

తీవ్రమైన ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తుతున్నాయని స్థానిక గిరిజన సంఘాలు, పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఆందోళన వ్యక్తంచేసేవారు. పట్టణ ప్రధాన రహదారులు విస్తరించి ప్రమాదాలు చోటుచేసుకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఎన్నో పర్యాయాలు రెవెన్యూ, ఇతర ఉన్నతాధికారులను వినతి పత్రాలు అందజేశారు. ఇదే కాకుండా జిల్లా కేంద్రంగా అవతరించడంతో జనసాంద్రత, వాహన రద్దీ పెరిగాయి. దీంతో రోడ్డు విస్తరణ అనివార్యమైన పరిస్థితి. అయినా ఆక్రమణల పేరిట దుకాణాలు తొలగించే ప్రక్రియలో అధికారులు తీసుకున్న చర్యలు పలు విమర్శలకు తావిస్తున్నాయి. పోలీసు బలగాలతో కనీస సమాచారం, సమయం ఇవ్వకుండా ఆక్రమణలు తొలగించడం ఏమిటని దుకాణదారులు అధికారులను నిలదీస్తున్నారు.

దుకాణం ముందు భాగం పోవడంతో వ్యాపారి దిగాలు

రోడ్డుకు ఇరువైపులా ఎంత మేరకు ఆక్రమణలు తొలగిస్తారనే దానిపై అధికారులకే స్పష్టత లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. రోడ్డు సెంటర్‌ పాయింట్‌ నుంచి ఇరువైపులా 35 అడుగుల చొప్పున విస్తరిస్తారని కొంత మంది ఉద్యోగులు చెబుతున్నారు. అలా కాకుండా రెవెన్యూ, ఆర్‌అండ్‌బీ అధీనంలో ఉన్న ప్రాంతం వరకు తొలగిస్తారని మరో విభాగపు సిబ్బంది వచ్చి సూచిస్తున్నారు. దీనిని ఆసరాగా తీసుకున్న కొందరు రెండు వైపులా కలిసి 80 నుంచి 90, 100 అడుగుల వరకు తొలగిస్తారని స్థానికులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అలా కాకుండా రెవెన్యూ, ఆర్‌అండ్‌బీ, అధికారులు సమన్వయంతో పక్కాగా ఇన్ని అడుగులు తొలగిస్తామని స్పష్టత ఇవ్వాలని స్థానికులు    కోరుతున్నారు.

అధికారుల దుందుడుకు చర్యల కారణంగా రోడ్డున పడ్డామని సుమారు 150 మంది చిరు వ్యాపారులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఉన్నతాధికారులు మానవతా దృక్పథంతో ఆలోచించి వీరికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సీపీఐ, ఇతర ప్రజాసంఘాల నాయకులు కోరుతున్నారు.

ఆ ప్రాజెక్టు పట్టాలెక్కేనా?

పాడేరు అంబేడ్కర్‌ కూడలి నుంచి అరకులోయ రోడ్డులో ఉన్న తలారిసింగి వరకు రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని ఎప్పటి నుంచో ప్రతిపాదనలు ఉన్నాయి. విశాఖపట్నం రోడ్లో ఎంపీడీవో కార్యాలయం వరకు జి.మాడుగుల వెళ్లే రహదారి పి.గొందూరు వరకు విస్తరించాల్సి ఉంది. తెదేపా ప్రభుత్వ హయాంలో ఈ విస్తరణకు సంబంధించి రూ.48 కోట్లతో ప్రత్యేక ప్రాజెక్టు సైతం మంజూరైంది. ఆ తర్వాత వైకాపా అధికారంలోకి రావడంతో అప్పటి వరకు ప్రారంభం కాని పనులన్నీ రద్దు చేసింది.  

దుకాణాల తొలగింపు అనంతరం ఇలా..

ఇప్పుడే చెప్పలేం

ఎన్ని అడుగులకు విస్తరిస్తారని ఆర్‌అండ్‌బీ ఈఈ బాలసుందరాన్ని ‘న్యూస్‌టుడే’ వివరణ కోరగా ప్రస్తుత పరిస్థితుల్లో తాము స్పష్టత ఇవ్వలేమన్నారు. కలెక్టర్‌ ఆదేశానుసారం ముందుకెళ్తామని చెబుతున్నారు. మండల తహసీల్దార్‌ త్రినాథనాయుడు స్పందిస్తూ రోడ్డు విస్తరణకు అవసరమైన మేరకు తొలగిస్తామని, దీనిపై త్వరలో స్పష్టత వస్తుందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని