logo

ఎన్‌హెచ్‌ఆర్‌సీ నోటీసుల నేపథ్యంలో జూజులబందలో సర్వే

అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం జూజుబందలో పాఠశాల ఎందుకు ఏర్పాటు చేయలేదని రాష్ట్ర ప్రభుత్వానికి జాతీయ మానవ హక్కుల కమిషన్‌ శుక్రవారం నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ ఆదేశాల మేరకు ఎంఈవో బోడంనాయుడు శనివారం గ్రామానికి వెళ్లి ఇంటింట సర్వే చేశారు.

Published : 04 Jun 2023 04:46 IST

గ్రామంలోని విద్యార్థులతో ఎంఈవో బోడంనాయుడు

కొయ్యూరు, న్యూస్‌టుడే: అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం జూజుబందలో పాఠశాల ఎందుకు ఏర్పాటు చేయలేదని రాష్ట్ర ప్రభుత్వానికి జాతీయ మానవ హక్కుల కమిషన్‌ శుక్రవారం నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ ఆదేశాల మేరకు ఎంఈవో బోడంనాయుడు శనివారం గ్రామానికి వెళ్లి ఇంటింట సర్వే చేశారు. జూజులబందలో పాఠశాల లేక విద్యార్థులు దట్టమైన అటవీ మార్గంలో నడిచి వెళ్లడం, ఓ సంస్థ సహకారంతో తల్లిదండ్రులు తాత్కాలికంగా బడి కోసం రేకుల షెడ్డు నిర్మించడంపై ‘బడి, బాలలు సిద్ధం.. బోధించేవారు లేక కష్టం’ శీర్షికన ‘ఈనాడు’లో మే 31న కథనం ప్రచురితమైంది. ఇతర ప్రతికల్లోనూ వార్తలు వచ్చాయి. దీనికి మానవ హక్కుల కమిషన్‌ స్పందించి ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఎంఈవో, సీఆర్పీ సీతారాం, ఉపాధ్యాయుడు సతీష్‌ గ్రామంలో ఇంటింట సర్వే చేశారు. గతేడాది కుమ్మర్ల పాఠశాలకు జూజులబంద నుంచి 10 మంది విద్యార్థులు అటవీ మార్గంలో వెళ్లేవారని ఎంఈవో తెలిపారు. ప్రస్తుతం మరో 14 మంది పాఠశాలలో చేరడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. గ్రామంలో 18 మంది విద్యార్థులు వివిధ ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్నారని చెప్పారు. సర్వే అనంతరం గ్రామంలోని ప్రజలతో సమావేశం నిర్వహించారు. పాఠశాల లేకపోవడంతో విద్యార్థుల కష్టాలను, అక్కడి సమస్యలను గిరిజనులు వారికి వివరించారు. నివేదికను జిల్లా కలెక్టర్‌కు పంపించనున్నట్లు ఎంఈవో తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని