బోగీల్లో భూకంపం!!
ఒడిశాలో శుక్రవారం రాత్రి జరిగిన ఘోర రైలు ప్రమాదం వందల మందిని బలి తీసుకుంది. ఇంకా ఆచూకీ తెలియాల్సిన వారు పెద్ద సంఖ్యలో ఉన్నారు. వీరంతా ఎక్కడున్నారు...ఎలా ఉన్నారు అనే వివరాలు తెలుసుకునేందుకు యంత్రాంగం కసరత్తు చేస్తోంది.
ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం
పెద్ద సంఖ్యలోగాయపడిన విశాఖ వాసులు
అదో భయానక రాత్రి
ఘటన గుర్తుకొస్తే చాలు...వణికిపోతున్న ప్రయాణికులు
ఈనాడు, విశాఖపట్నం న్యూస్‌టుడే, కార్పొరేషన్, ఎంవీపీ కాలనీ, రైల్వేస్టేషన్, మాధవధార, తాటిచెట్లపాలెం
కళ్లు తెరిసి చూస్తే...
బోగీలు బోల్తాకొట్టి ఉన్నాయి
చుట్టూ ప్రయాణికులున్నా...
ఎవరూ కదల్లేని పరిస్థితి!
కొందరు అప్పటికే ప్రాణాలు
కోల్పోయారు! ఇంకొందరు అవయవాలు తెగిపడి రోదిస్తున్నారు..
సీట్ల కింద.. పైన నలిగిపోయిన వారు ఎందరో ఎట్టకేలకు బయటపడిన క్షతగాత్రులు సెల్‌ఫోన్ వెలుగుల్లో..
తమ వాళ్ల కోసం గాలించి... ఆసుపత్రుల్లో చేరి ఊపిరి పీల్చుకున్నారు! ఆ సంఘటనను ఊహించుకుంటేనే చాలు వణికిపోతున్నారు.
ప్రమాద స్థలిలో రైల్లోంచి బయటకు వస్తున్న బాధితులు
ఒడిశాలో శుక్రవారం రాత్రి జరిగిన ఘోర రైలు ప్రమాదం వందల మందిని బలి తీసుకుంది. ఇంకా ఆచూకీ తెలియాల్సిన వారు పెద్ద సంఖ్యలో ఉన్నారు. వీరంతా ఎక్కడున్నారు...ఎలా ఉన్నారు అనే వివరాలు తెలుసుకునేందుకు యంత్రాంగం కసరత్తు చేస్తోంది. షాలిమార్ నుంచి బయలుదేరిన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌లో ఏపీకి చెందిన వారిలో విశాఖలో దిగాల్సిన వారే ఎక్కువ. ఈ రైలులో ఏపీలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారు మొత్తం 482 మంది ప్రయాణిస్తుంటే విశాఖలో దిగాల్సిన వారు 300 మందికి పైగా ఉన్నారు. వీరంతా ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన వారిగా భావిస్తున్నారు. జిల్లాకు సంబంధించి ఇప్పటి వరకూ మృతుల సమాచారం అధికారులకు రాలేదు.
పట్టాలపై చెల్లాచెదురుగా మృతదేహాలు..
ప్రమాదం జరిగిన తరువాత మేం ట్రాక్ దాటి బయటకు వచ్చేశాం. పది నిమిషాల్లోనే పోలీసులు, అంబులెన్సులు వచ్చాయి. రెండు ఎక్స్‌ప్రెస్ రైళ్ల మధ్య కాస్త సమయం ఉంటే ఘోర ప్రమాదం జరిగేది కాదు. సహాయక చర్యలు చేపట్టడానికి వచ్చిన సిబ్బందికి ఎవరిని బయటకు తీయాలో అర్థం కాలేదు. పట్టాలపై చెల్లాచెదురుగా మృతదేహాలు పడి ఉన్నాయి. మాది బిహార్‌లోని స్పారా ప్రాంతం. నావికాదళంలో పనిచేస్తూ ఐదేళ్లుగా విశాఖలో ఉంటున్నా.
ఆశిష్‌సింగ్, నావికాదళ అధికారి
చీకటిలో పెద్ద శబ్ధంతో పక్కకు పడిపోయాం..
నేను, మా చెల్లి బోగీలో ఆడుకుంటున్నాం. ఒక్కసారిగా రైలులో పెద్ద శబ్దం వచ్చి మా బోగీ పక్కకు ఒరిగిపోయి, అంతా చీకటిగా మారిపోయింది. దీంతో మేమిద్దరం పక్కకు పడిపోయాం. మా అమ్మ, నాన్న మరోవైపు పడిపోయారు. ఏం జరిగిందో తెలియక మాకు చాలా భయం వేసి కేకలు వేసి ఏడ్చాం. కొంత సమయం తర్వాత అందరూ బయటకు పరుగులు తీశారు. చీకటిగా ఉండటంతో ఏమి జరిగిందో తెలియలేదు. వెంటనే మా నాన్న, అమ్మను, మమ్మల్ని రైల్వే పోలీసులు వచ్చి బయటకు తీసుకువచ్చారు. నాకు కాళ్లు, వీపు, మా చెల్లికి చేతులపై స్వల్ప గాయాలయ్యాయి. రాత్రంతా నిద్రపోలేదు, భయంతోనే ఉన్నాం.
హేమంత్, కరిష్మా, మారికవలస
నాకూ, పిల్లలకు ఇది పునర్జన్మే..
నా భర్త కోల్‌కతాలో ఆర్మీలో పనిచేస్తున్నారు. సెలవులని ఇద్దరు పిల్లలతో కలిసి గుంటూరులోని మా పుట్టింటికి బయలుదేరాం. బి-8 బోగీలో ఉన్నాం. బాలాసోర్ సమీపంలోకి వచ్చేసరికి పిల్లలు ఆకలి వేస్తుందంటే రోటీలు పెట్టేందుకు సిద్ధమవుతున్నా. ఇంతలో భారీ శబ్దం వచ్చి దూరంగా ఎగిరిపడ్డాం. పిల్లలు ఇద్దరూ బోగీ తలుపు దగ్గర పడిపోయారు. అంతా చీకటి అలుముకుంది. వారు ఎక్కడున్నారో కనిపించలేదు. అప్పుడే ఎవరో సెల్‌ఫోన్ వెలుగు చూపిస్తే లేచా. తల తిరుగుతున్నట్లు అనిపించడంతో అక్కడే పడిపోయా. పిల్లలు కనిపించకపోయేసరికి వారికి ఏమైందోనని ఆందోళన రేగింది. అప్పటికే బోగీలో చాలామంది ప్రాణాలు కోల్పోయి పడి ఉన్నారు. ఏం చేయాలో నాకు తోచలేదు. మెల్లగా ఫోన్ తీసుకొని దాని లైటు వెలుగులో పిల్లల్ని వెతికా. దేవుడి దయ వల్ల ఎవరికీ ఏం కాలేదు. మా చుట్టుపక్కల కూర్చున్న వాళ్లు చాలామందికి తీవ్ర గాయాలయ్యాయి. మా ముందు బోగీలన్నీ పూర్తిగా నుజ్జయిపోయాయి. నాకూ, నా పిల్లలకు ఇది పునర్జన్మే.
హబీబా, గుంటూరు
ఘటనపై కలెక్టరేట్‌లో కంట్రోల్ రూం
అనకాపల్లి కలెక్టరేట్, న్యూస్‌టుడే: ఒడిశాలోని రైళ్లు ఢీకొన్న ప్రమాదఘటనపై ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు అనకాపల్లి జిల్లా కలెక్టరేట్‌లో కంట్రోల్ రూం ఏర్పాటు చేశామని కలెక్టర్ రవి శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా నుంచి ఎవరైనా ఈ ప్రమాదంలో చిక్కుకుంటే తక్షణమే కంట్రోల్ రూం నంబరు 08924 222888 ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు. రైల్వే శాఖతో సమన్వయం చేసుకొని ఎప్పటికప్పుడు ప్రయాణికులు వివరాలు సేకరిస్తున్నామన్నారు. ఒడిశా అధికారులతో మాట్లాడి సహాయక చర్యలు చేపడుతున్నామని తెలిపారు. రాష్ట్ర మంత్రి గుడివాడ అమర్‌నాథ్, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారన్నారు. జిల్లావాసులెవరైనా ఈ ప్రమాదం బారినపడి ఉంటే తక్షణమే కుటుంబ సభ్యులు కంట్రోల్ రూంనకు సమాచారం అందిస్తే సహాయ చర్యలు చేపడతామన్నారు.
రైలు ప్రమాద బాధితులకు బాసటగా నేడు రక్తదాన శిబిరం
లక్ష్మీదేవిపేట(అనకాపల్లి), న్యూస్‌టుడే: కొత్తూరు నరసింగరావుపేట విశాఖ గ్రామీణ బ్యాంకు వద్ద ప్రేరక్ ఆర్గనైజేషన్, కల్చరల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం అత్యవసర రక్తసేకరణ శిబిరం నిర్వహిస్తున్నామని కల్చరల్ ఫౌండేషన్ ప్రతినిధులు తెలిపారు. ఒడిశాలో బాలేశ్వర్ జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో బాధితులకు బాసటగా అవసరమైన రక్తం సేకరించడానికి ఈ శిబిరం నిర్వహిస్తున్నామన్నారు.
సహాయక చర్యల్లో యంత్రాంగం
నియంత్రణ గదిలో డీఆర్వోకు సూచనలు చేస్తున్న జిల్లా కలెక్టర్ మల్లికార్జున
వన్‌టౌన్, న్యూస్‌టుడే: రైలు ప్రమాద బాధితుల కోసం సహాయక కార్యక్రమాలు చేపట్టడంలో జిల్లా యంత్రాంగం తలమునకలైంది. ప్రమాదంలో చిక్కుకున్న వారి వివరాలు తెలుసుకుని, వారికి అవసరమైన సహాయం అందించేందుకు వీలుగా కలెక్టర్ ఎ.మల్లికార్జున ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లో నియంత్రణ గది ఏర్పాటు చేశారు. ఆయన స్వయంగా నియంత్రణ గదిలోకి వెళ్లి డీఆర్వో శ్రీనివాసమూర్తి, ఇతర అధికారులకు పలు సూచనలు చేశారు. 0891-2590100, 0891-2590102 ఫోన్ నెంబర్లు, వాట్సప్ నెంబరు 91544 05292ను అందుబాటులో ఉంచారు. డీఆర్‌ఎం, ఇతర రైల్వే అధికారులతో కలెక్టర్ మాట్లాడారు. రైలు ప్రమాదంతో పలు రైళ్లు రద్దయ్యాయి. దీంతో విశాఖలో ఉండిపోయిన ప్రయాణికుల తరలింపునకు ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. మరో వైపు అంబులెన్సులను సిద్ధం చేశారు. నగరంలో కేజీహెచ్ సహా పలు ఆసుపత్రుల్లో క్షతగాత్రులకు వైద్య సేవలందించే విధంగా ఏర్పాట్లు చేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు సూచించారు. ప్రమాదంలో చిక్కుకున్న ప్రయాణికుల బంధువులు తమ వారి వివరాలను వాట్సప్, ల్యాండ్‌లైన్ నెంబర్లకు తెలియజేయాలని కలెక్టర్ కోరారు.
అత్యంత దయనీయం
‘ఈ తరహా ప్రమాదాలు గతంలో ఎన్నడూ చూడలేదు. సాఫీగా ప్రయాణం సాగుతుందని భావిస్తున్న తరుణంలో ఒక్కసారిగా కుదుపులు, శబ్దాలతో రైలు ప్రమాదానికి గురైంది. ఏమి జరిగిందో తెలుసుకునే సరికి నా చేతికి, నా మిత్రుడి కాలికి గాయాలయ్యాయి. గాయాలతోనే బయటకు వచ్చి చూడగా అత్యంత దయనీయ పరిస్థితి కనిపించింది. నాకు స్వల్పగాయాలు కావటంతో ఇతరులకు సహాయం చేశాను. అలానే నా మిత్రుడికి కాలికి గాయం కావటంతో ఒకరికొకరం సహాయం చేసుకుంటూ భువనేశ్వర్ చేరుకున్నాం’ అని చెన్నైకి చెందిన బీఎస్‌ఎఫ్ ఉద్యోగి కనకరాజు పేర్కొన్నారు.
అతికష్టం మీద బయటకు
చెన్నైకి చెందిన ఉమాదేవి మాట్లాడుతూ ‘షాలిమార్ నుంచి చెన్నైకు కోరమాండల్ ఏసీ బోగిలో మా బాబుతో కలిసి ప్రయాణం చేస్తున్నా. మా బోగితో పాటు ముందు, వెనుక ఉన్న బోగీలు ఒక్కసారిగా పక్కకు పడిపోవటంతో అందరం గట్టిగా కేకలు వేశాం. ఏమి జరుగుతుందో తెలియక గందరగోళ పరిస్థితి నెలకుంది. చాలా సేపటి తర్వాత కొందరు వచ్చి బోగి నుంచి బయటకు రావాలని చెప్పారు. కష్టంమీద కుమారుడితో బయటకు వచ్చాను. తోటి ప్రయాణికుల సహాయంతో లగేజ్‌ను తీసుకున్నాం. ఓ వైపు సహాయం కోసం ఆర్తనాదాలు చేసేవారిని చూశాం. రెస్క్యూ బృందం సహాయంతో భువనేశ్వర్ చేరుకున్నాం. అక్కడ రైల్వే అధికారుల సహాయంతో బాబు చేతికి కట్టు కట్టారు. వారు భోజన వసతి కల్పించిన తర్వాత ప్రత్యేక రైలులో ఇంటికి వెళ్తున్నాం’ అని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.